నవతెలంగాణ-హైదరాబాద్ : ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రిలోని స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ వార్డులో సంభవించిన అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణం ఏసీ పేళిపోయింది. దీంతో చెలరేగిన మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో చికిత్స పొందుతున్న ఇద్దరు పసికందులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన చిన్నారుల తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ముఖ్యమంత్రి.. ప్రమాద తీవ్రతపై ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ దుర్ఘటనలో గాయపడిన, ఊపిరాడక అస్వస్థతకు గురైన మిగిలిన చిన్నారులకు అత్యున్నత స్థాయి మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా అన్ని వైద్యశాలల్లో ఫైర్ సేఫ్టీ, ముందస్తు భద్రతా చర్యలను పటిష్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.



