నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్‌పై ఆర్థిక యుద్ధాన్ని అమెరికా మరో స్థాయికి తీసుకెళ్లింది. రేపటి (సెప్టెంబర్ 23) నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థల సర్వీసులను నిలిపివేయనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ విమానాలకు ఏ దేశంలోనైనా, ఏ సంస్థ అయినా సాయం అందిస్తే, వారిని యూఎస్ డాలర్ ఆర్థిక వ్యవస్థ నుంచి వెలివేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థను మరింత ఒంటరి చేసే కీలక చర్యగా భావిస్తున్నారు.
యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సెప్టెంబర్ 21న సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. “సెప్టెంబర్ 23 నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇరానియన్ ఎయిర్‌లైన్స్‌ను మూసివేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. ఇది ప్రత్యక్ష నిషేధం కానప్పటికీ, ‘సెకండరీ ఆంక్షల’ రూపంలో అమలు చేయనున్నారు. దీని ప్రకారం, ఇరాన్ విమానాలకు ఇంధనం నింపినా, ల్యాండింగ్ సేవలు అందించినా, టికెట్లు విక్రయించినా, ఆయా ఎయిర్‌పోర్టులు, సంస్థలు డాలర్ లావాదేవీలకు అనర్హులుగా మారతాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఫిబ్రవరి 2026 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఆగస్టు 24న ప్రకటించిన ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ తన విమానయాన సంస్థలను ఆయుధాలు, సైనికులు, అక్రమ సామగ్రి రవాణాకు ఉపయోగిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 8న 27 ఇరాన్ విమానయాన సంస్థలను ఆంక్షల జాబితాలో చేర్చింది.


