నవతెలంగాణ-హైదరాబాద్ : డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. లోకేశ్ తన పదవికి రాజీనామా చేసి, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించే వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని జగన్ ఆరోపించారు. ఉపాధ్యాయుల ముసుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తనకు తానుగా క్లీన్ చిట్ ఇచ్చుకుంటే దానికి విలువ ఉండదని, చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు అంగీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లకు ఆయన సవాల్ విసిరారు.
“లక్షలాది మంది నిరుద్యోగ యువత ఏళ్ల తరబడి కష్టపడి చదువుకుంటూ, ఎంతో ఖర్చు చేస్తున్నారు. వారికి న్యాయం జరగాలంటే నియామక ప్రక్రియలో పారదర్శకత అత్యవసరం” అని జగన్ పేర్కొన్నారు. పోలీసు బారికేడ్లు, లాఠీఛార్జ్‌లు, అరెస్టులతో ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించలేరని, ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపడమే ఏకైక మార్గమని ఆయన తేల్చిచెప్పారు.



