Friday, May 9, 2025
Homeజాతీయంపోప్‌ ఎన్నికలో నలుగురు భారతీయుల భాగస్వామ్యం

పోప్‌ ఎన్నికలో నలుగురు భారతీయుల భాగస్వామ్యం

- Advertisement -

– వారిలో హైదరాబాద్‌ ఆర్చ్‌ బిషప్‌ ఆంథోనీ పూలా
న్యూఢిల్లీ:
పోప్‌ ఫ్రాన్సిస్‌ మరణంతో కాథలిక్‌ చర్చి ‘స్థానం ఖాళీగా ఉంది’ అనే స్థితికి చేరుకుంది. గుండెపోటు కారణంగా పోప్‌ తన కాసా శాంటా మాత్రా నివాసంలో కన్నుమూశారని వాటికన్‌ తెలిపింది. పోప్‌ చనిపోవడంతో కాథలిక్‌ చర్చి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రైవేటు సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుండి కార్డినాల్స్‌ (మతాధిపతులు) హాజరై తదుపరి పోప్‌ను ఎన్నుకుంటారు. ఎనభై సంవత్సరాల లోపు వయసున్న 135 మంది కార్డినాల్స్‌కు పోప్‌ను ఎన్నుకునే ఓటింగులో పాల్గొనే అర్హత ఉంది. సాధారణంగా పోప్‌ అంత్యక్రియలు ముగిసిన రెండు మూడు వారాల తర్వాత సమావేశం ప్రారంభమవుతుంది. క్రైస్తవ సమాజం యొక్క నూతన మత గురువును ఎన్నుకోబోతున్న 135 మంది కార్డినాల్స్‌లో నలుగురు భారతీయులు ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది. వీరిలో హైదరాబాదుకు చెందిన కార్డినాల్‌ కూడా ఉన్నారు. మన దేశానికి చెందిన గోవా-డామన్‌ ఆర్చ్‌బిషప్‌ ఫిలిప్‌ నేరీ ఫెర్రావో (72), తిరువనంతపురంకు చెందిన సైరో-మలంకర కాథలిక్‌ చర్చి అధిపతి బేస్లియస్‌ క్లీమిస్‌ (64), హైదరాబాద్‌ ఆర్చ్‌బిషప్‌ అంథోనీ పూలా (63), చెంగనాస్రెరీకి చెందిన జార్జ్‌ జాకబ్‌ కూవకడ్‌లు పోప్‌ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఆర్చ్‌బిషప్‌ పూలా కాథలిక్‌ చర్చికి కార్డినాల్‌ అయిన తొలి దళితుడు.
పోప్‌ ఎన్నిక ఇలా…
కార్డినాల్స్‌ అందరూ సిస్టిన్‌ ఛాపెల్‌లో సమావేశమై రహస్య ఓటింగ్‌ ద్వారా పోప్‌ను ఎన్నుకుంటారు. లాటిన్‌ భాషలో ‘నేను సుప్రీం మఠాధిపతిని ఎన్నుకుంటున్నాను’ అని రాసి ఉన్న కాగితంపై తాము పోప్‌గా ఎంచుకున్న వారి పేరును కార్డినాల్స్‌ రాస్తారు. ఎవరికైనా మూడింట రెండు వంతుల ఓట్లు వచ్చే దాకా కార్డినాల్స్‌ రోజుకు నాలుగు సార్ల వరకూ ఓటు వేయవచ్చు. ఛాపెల్‌ చిమ్నీ నుండి వచ్చే పొగను బట్టి మాత్రమే లోపల ఏం జరుగుతోందో బయటి వారు తెలుసుకుంటారు. పొగ నల్లగా ఉంటే నిర్ణయం జరగలేదని అర్థం. అదే తెల్లని పొగ వస్తే పోప్‌ ఎన్నిక జరిగిందని అర్థం. నిర్ణయం జరిగిన తర్వాత ‘మాకు ఓ పోప్‌ ఉన్నారు’ అనే మాటలు వినిపిస్తాయి. కొత్తగా ఎన్నికైన పోప్‌ సెయింట్‌ పీటర్స్‌ బాసిలికా బాల్కనీలోకి వచ్చి తొలి ఆశీర్వాదాలను అందజేస్తారు. పోప్‌ ఎన్నిక రహస్యంగా జరుగుతుంది కాబట్టి ఎవరు, ఎప్పుడు ఎన్నికవుతారో ఎవరికీ తెలియదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -