– వివరాలను వెల్లడించిన డీఎస్పీ నాగేశ్వర్రావు
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో యువకుడిని హత్య చేసిన నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపినట్ల దేవరకొండ డీఎస్పీ ఎం .నాగేశ్వరరావు తెలిపారు. శనివారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కట్టంగూరు మండలం దుగ్గినెల్లి గ్రామానికి చెందిన బొడ్డు సంతోష్(18), కొప్పోలు గ్రామానికి చెందిన 17 సంవత్సరాల బాలిక నల్లగొండలో చదువుతూ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఈనెల 25వ తేదీన అమ్మాయిని కలవడానికి గ్రామానికి వచ్చాడు. ఇరువురు కలిసి అమ్మాయి ఇంటిలో మాట్లాడుతుండగా తండ్రి ఆవుల మల్లయ్య వ్యవసాయ పనులు ముగించుకొని అదే సమయానికి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఇద్దరు మాట్లాడుకుంటూ కనిపించడంతో ఇంటి పక్కన ఉన్న తమ బంధువు ఆవుల నాగేష్, బాలిక నాయనమ్మ ఆవుల రాములమ్మలు ఎన్నిసార్లు మందలించిన వినకుండా అమ్మాయిని ప్రేమ వ్యవహారంతో కలుస్తున్నాడన్న కోపంతో అందుబాటులో ఉన్న రోకలి బండతో తలపై, కాళ్లపై, చేతులపై, ఇష్టం వచ్చినట్లు కొట్టి చంపినట్లు సమాచారం అందడంతో కొండమల్లేపల్లి సీఐ శ్రీనివాసు, గుర్రంపోడు ఎస్సై శివప్రసాద్‌లు సంఘటన స్థలానికి వెళ్లినట్లు తెలిపారు. గతంలో కూడా ప్రేమ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా షీ టీం ద్వారా ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. సంతోష్‌ని చంపిన అనంతరం భయంతో ముగ్గురు నిందితులు పారిపోయినట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కొప్పులు గ్రామానికి వచ్చినట్లు తమకు సమాచారం అందడంతో వారిని పట్టుకుని విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. శనివారం నల్లగొండ కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. ఈ సమావేశంలో కొండమల్లేపల్లి సీఐ శ్రీనివాస్, గుర్రంపోడు ఎస్సై శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.