సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
శాంతియుతంగా గత 42 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఐకేపీ వీఓఏలు చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాకు వెళ్తున్న వారిని ప్రభుత్వం ముందస్తుగా అరెస్టు చేయడం నిరంకుశ చర్యా అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. ఐకేపీ వీఓఏలు హైద్రాబాద్‌లో నిర్వహించే ధర్నాకు వెళ్తున్న సందర్భంగా ముందస్తు అరెస్టులను నిరసిస్తూ సోమవారం ఆయన స్థానికంగా మాట్లాడారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యను, నల్లగొండలో జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాసులు, తిప్పర్తి, చిట్యాల, మాడుగులపల్లి, అనేక చోట్ల వీవోఏలను హైదరాబాదు వెళ్లకుండా అడ్డుకొని ముందస్తు అరెస్టులు చేశారని తెలిపారు. సమస్యలను పరిష్కరించకుండా అక్రమ అరెస్టులతో ఉద్యమాలని అనచాలని చూడడం అవివేకమన్నారు. నిర్బంధాలను ఎదుర్కొని వేలాదిమంది హైదరాబాద్ చేరుకున్నారని, ఇందిరాపార్క్ ధర్నా విజయవంతమైందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఐకేపీ వీఓఏలతో చర్చలు జరిపి కనీస వేతనం రూ.26వేలు, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, అర్హత కలిగిన వారిని సీసీలుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనియెడల సమ్మెను మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు.