Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయందేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం

దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం

- Advertisement -

ప్రజా, కార్మిక సంఘాల నాయకుల పిలుపు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రయివేటీకరణ ఆపాలని, ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలంటూ జులై 9న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రజా, కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కార్మిక సంఘాలు ఫెడరేషన్‌, అసోసియేషన్‌లు మంగళవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హెచ్‌ఎంఎస్‌ నాయకులు అధ్యక్షత వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 11 ఏండ్లుగా బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్‌ అనుకూల, మతోన్మాద చర్యలను దూకుడుగా అమలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగాన్ని ధ్వంసం చేసిందన్నారు. జిల్లా సమావేశాలు, సమ్మె నోటీసులు, గేట్‌ మీటింగ్స్‌, గ్రూప్‌ మీటింగ్స్‌, జనరల్‌ బాడీలు, పారిశ్రామిక ప్రాంతాల్లో సభలు, సెక్టోరల్‌ సదస్సులు, బైక్‌ ర్యాలీలు, కరపత్ర ప్రచారం, పోస్టర్లు, సోషల్‌ మీడియా ప్రచారం తదితర రూపాల్లో కార్మికవర్గాన్ని చైతన్యపరిచి, కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలపై గట్టి ప్రతిఘటన ఇవ్వాలని కోరారు. ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి నర్సింహ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారాలు మోపి, కార్పొరేట్‌, గుత్త సంస్థలకు, పెట్టుబడిదారులకు వేల కోట్ల రాయితీలు ప్రకటిస్తోందని విమర్శించారు. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చే ఆర్థిక విధానాలను అమలు చేస్తున్నదన్నారు. ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షులు విజరుకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి కొట్టేందుకు కార్మికవర్గం పోరాటానికి సన్నద్ధం కావాలని సూచించారు. టీయూసీఐ నాయకులు సూర్యం మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల పేదరికం 17 శాతానికి పెరిగిందని, పేదల జీవితాలను కష్టాలపాలు చేస్తున్న మోడీ సర్కార్‌ విధానాలను కార్మికవర్గం ప్రతిఘటించాలని కోరారు. శివబాబు (ఐఎఫ్‌టీయు), పి.వెంకట్రామయ్య (బ్యాంకింగ్‌), జి.తిరుపతయ్య (ఇన్సూరెన్స్‌), రాజు భట్‌ (మెడికల్‌ రిప్స్‌), జె. వెంకటేష్‌, కుమారస్వామి (సీఐటీయూ), అంజాద్‌ (హెచ్‌ఎంఎస్‌) తదితరులు కార్యాచరణను బలపరుస్తూ వందన సమర్పణ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సోమన్న, ఏఐటీయూసీ నాయకులు నరసింహ, కిషన్‌, ఎంకె.బోస్‌ (టీఎన్‌టీయూసీ), భరత్‌ (ఏఐటీయూసీ), పి.వెంకట్రామయ్య (బెఫి) పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad