Sunday, July 6, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివిద్యుత్‌ ఒప్పందాలు-వినియోగదారులపై భారాలు

విద్యుత్‌ ఒప్పందాలు-వినియోగదారులపై భారాలు

- Advertisement -

రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాలో ప్రసార నాణ్యత రోజురోజుకూ పడిపోతోంది. వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతుంటే ఉత్పత్తి మాత్రం అందుకు అనుగుణంగా పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీని సమగ్ర నిర్వహణకు సర్కార్‌ రూపొందించిన ప్రణాళిక వ్యవస్థ కూడా నత్తనడకనే సాగుతోంది. సొంత ఉత్పత్తిపైన కేంద్రీకరణ లేకపోవడం వల్ల వినియోగదారులకు భారంగా పరిణమించింది. గత ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ను తీసుకొస్తామని చెప్పి వందల కోట్ల రూపాయలు వెచ్చించింది.అది ఒక్క మెగావాట్‌ను కూడా అందించక నిరాశపరిచింది. ప్రస్తుత ప్రభుత్వం హిమాచల్‌ ప్రదేశ్‌తో చేసుకున్న షరతులతో కూడిన ఒప్పందం వల్ల ప్రజలకు ఉపయోగం లేదనే వాదన వినిపిస్తున్నది. అప్పుడు, ఇప్పుడు ఈ తతంగంలో లాభపడింది కార్పొరేట్‌ శక్తులే. ఇది నష్టమని తెలిసినప్పటికీ ప్రయివేటు విధానాలనే మన పాలకులు అమలు చేస్తున్నారు. ఏపీలో స్మార్ట్‌మీటర్ల బిగింపు, యూనిట్‌ ధరల పెంపు నిర్ణయం అందులో భాగమే. తెలంగాణలో ఇప్పుడా పరిస్థితి లేకున్నా భవిష్యత్తులో ఇది మనకు ప్రమాదంగా మారనుంది. ఎందుకంటే, రాష్ట్ర విద్యుత్‌ను సవరణ ద్వారా కేంద్రం తమ ఆదీనంలోకి తీసుకుంది. రాష్ట్ర విభజన సమయంలో ఇస్తామన్న విద్యుత్‌ను కూడా ఇవ్వకపోవడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు శాపంగా మారింది. దానిపై నోరు మెదపకపోవడం, ప్రశ్నించకపోవడం పాలకుల ఉదాసీన వైఖరికి అద్దం పడుతున్నది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ వినియోగం 17,162 మెగావాట్ల రికార్డు స్థాయిలో ఈ ఏడాది మార్చివరకు నమోదైంది. రాష్ట్ర ఉత్పత్తి మాత్రం 7,285.26 మెగావాట్లు దాటలేదు. ఇందులో 4,842.50 మెగావాట్లు థర్మల్‌, 2,441.76 హైడల్‌ ద్వారా ఉత్పత్తి అవుతున్నది. ప్రస్తుతం యాదాద్రి థర్మల్‌ పవర్‌ 4వేల మెగావాట్లు 2025 జూన్‌ నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని సర్కార్‌ ప్రకటించింది. కానీ రెండు యూనిట్లు 8వందల మెగావాట్లు మాత్రమే అందుబాటులో వచ్చింది. మొత్తం ఐదు యూనిట్లలో ఇంకా మూడు 2026 జూన్‌ నాటికి పూర్తవుతాయని చెబుతున్నది. రూ.36,132 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పాలసీని ప్రవేశపెట్టి, 2030 నాటికి 31.5 జిబ్ల్యూయు మెగావాట్ల పునరుత్పాదక సాధిస్తామని పేర్కొంది. కుసుం పథకం కింద రైతులకు సొంత పొలాల్లో బావులకు 4వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాలి. ఇందిర మహిళా శక్తి గ్రూపులు వెయ్యి మెగావాట్లు ఉత్పత్తి చేయాలి. ప్రతి ఇంటి పైన ”సూర్యఘర్‌” కార్యక్రమం కింద సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలి. మోడల్‌ సోలార్‌ గ్రాములు, సోలార్‌ వీధి దీపాలు, సోలార్‌ హార్ట్‌ వాటర్‌ వ్యవస్థలు, అఫ్‌ గ్రీడ్‌ సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళిక అమలు ఆలస్యం జరుగుతుందన్న లక్ష్యంతో హిమాచల్‌ ప్రదేశ్‌- తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి ఒప్పందం కుదుర్చుకుంది. 2025 ఏప్రిల్‌ 2న కుదుర్చుకున్న ఈ ఒప్పందం కింద చీనాబ్‌ నది పైన సెలివద్ద 4 వందల వీయర్‌ వద్ద 120 మెగావాట్ల రెండు విద్యుత్‌ ప్లాంట్లును జెన్‌కో బాగస్వామ్యంతో నిర్మించాలి. ఒక్కో మెగావాటుకు రూ.11.92 కోట్లు పెట్టుబడి పెట్టాలి. నిర్మాణానికి రూ.6200 కోట్లు పెట్టుబడి పెట్టగా మొదటి పన్నేండేండ్లు హిమాచల్‌ ప్రదేశ్‌కు 12శాతం, రెండవ 18 సంవత్సరాలు 18శాతం, మూడవ పదేండ్లు 30శాతం విద్యుత్‌ ఇవ్వాలి. 40ఏండ్ల తర్వాత ప్లాంటును పూర్తిగా ఆ రాష్ట్రానికి ఇవ్వాలి. ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి రూ.93 కోట్లు ఇవ్వాలి. నిర్వాసితులకు నెలకు 100 యూనిట్లకు సమానమైన సొమ్మును సబ్సిడీ ఇవ్వాలి. ఈ ప్రాజెక్టు ఏడదిలో 9నెలలు పని చేస్తుంది, మూడు నెలలు నీరు గడ్డకడుతుంది. ఇలాంటి షరతులకు తలొగ్గి ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తులు చేయాలి. గత టీ(బీ)ఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లో వెయ్యి మెగావాట్లు కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకొని విద్యుత్‌ ఉత్పత్తి చేయకున్న రూ.700కోట్లు చెల్లించింది. ఆ దారినే కొత్త సర్కార్‌ కూడా నడుస్తున్నది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది రెండు కోట్లమంది వినియోగ దారులు. వీరికి 95,127 మిలియన్‌ యూనిట్లు అవసరం. కానీ మనకు లభ్యత 1,23,631 మి.యూ. అదనంగా 28,504 మి.యూ ఇతరులకు అమ్మాలి. అనవసరమైన ఒప్పందాలు చేసుకోవడం వల్ల వినియోగదారులపై భారాలు పడుతున్నాయి. 2025-26లో రూ.58,628 కోట్లు ఆదాయాన్ని విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ నిర్ణయించింది. కానీ డీస్కాంలు రూ.65,850 కోట్లు ప్రతిపాదనలు తెచ్చాయి. ఈ ప్రతిపాదనలను రెగ్యులేటరీ కమిషన్‌ తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆదాయం రూ.45,710 కోట్లు మాత్రమే టారీఫ్‌ ప్రకారం వస్తుంది. రూ. 13499.41కోట్లు లోటు ఉంటుంది. ఈ లోటును ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తానని ప్రకటించింది. పాత బకాయిలతో మొత్తం లోటు 20,151కోట్లు ఉంది. ఇందులో ప్రభుత్వ సంస్థల బాకీలు రూ.11,756 కోట్లు ఉన్నాయి. పంచాయతీరాజ్‌, లిప్ట్‌ పథకాలు, మిషన్‌ భగీరథ, మున్సిపాల్టీలు, హైదరాబాద్‌ మెట్రో సంస్థలు బాకీ ఉన్నాయి. వీరు బాకీలు చెల్లించకపోవడం వల్ల వినియోగ దారులపై భారం పడుతున్నది. ఒక వైపున ఉత్పత్తి కొరత, మరోవైపు డీస్కాం అసమర్థ నిర్వహణ వల్ల వినియోగదారులు వేల కోట్ల రూపాయల భారాన్ని భరించాల్సి వస్తున్నది. విద్యుత్‌ తలసరి వినియోగం ఎంత పెరిగితే అంతా అభివృద్ధి జరిగినట్లు గుర్తిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర తలసరి వినియోగం 2349 కిలోవాట్స్‌. దేశ తలసరి వినియోగం 1538 కిలో వాట్స్‌ మాత్రమే .అభివృద్ధి చెందిన దేశాల్లో 4800 కిలో వాట్స్‌ నుండి 600 వేల కిలో వాట్స్‌ వినియోగిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో, దళిత, గిరిజన పల్లెలు విద్యుత్‌ వినియోగానికి దూరంగా ఉన్నాయి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందశాతం వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నాయి. రానున్న 2033-34 వరకు రాష్ట్రంలో ఏర్పడ నున్న లోటుని గమనించి హిమాచల్‌ ప్రదేశ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు రెగ్యురేటరీ కమిషన్‌ చైర్మన్‌ నాగార్జున ప్రకటించారు. రాష్ట్ర విద్యుత్‌ శక్తి నిర్వహణ వ్యయం పెరుగుతున్నది. తొమ్మిది సంస్థలు పనిలో ఉన్నాయి. 1.ఎలక్ట్రికల్‌, ఇన్‌స్పెక్టరేట్‌ 2. ట్రాన్స్‌కో 3. దక్షిణడిస్కాం 4.ఉత్తర డిస్కాం 5.జెన్‌కో 6.రెన్యూవ్‌బుల్‌ ఏనర్జీ కార్పొరేషన్‌, 7. విద్యుత్‌ రెగ్యురేటర్‌ కమిషన్‌, 8.విద్యుత్‌ ఆర్థిక సంస్థ, లి. 9. సింగరేణి కాలరీస్‌ కంపెనీ సిఎండిల పెట్టి నిర్వహణ ఖర్చును పెంచాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 33 కె.వి సబ్‌స్టేషన్లు 3,276, ట్రాన్స్‌ఫార్మర్లు 9.17లక్షలు, 33.కె.వి లైన్‌లు 28,301 కి.మీ, 11కె.వి లైన్‌లు 2,24,125.కి.మీ ఉన్నాయి. ఎల్‌టి లైన్‌లు 4,42,792 కి.మీ ఉన్నాయి. 20ఏండ్లు గడిచిన తర్వాత కండక్టర్‌ను మార్చాలి. గతేడాది రూ.30వేల కోట్లు వ్యయం చేసిన కండక్టర్‌ను పూర్తిగా మార్చలేదు. ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ సక్రమంగా లేదు. అందువల్ల నిర్వహణ వ్యయం పెరిగి వినియోగదారులపై భారాలు పడుతున్నాయి. విద్యుత్‌ సంస్థలు అంతర్గత నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా లోటును తగ్గించుకోవాలి. ప్రభుత్వం మన అవసరం మేరకు ఉత్పత్తి చేయాలి. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ప్రభుత్వం 4వేల మెగావాట్లు ఉత్పత్తి చేసి ఉచితంగా ఇస్తానని చట్టంలో చెప్పింది. పదేండ్లయినా ఇంత వరకు 16వందల మెగావాట్లే ఇచ్చింది. గత ప్రభుత్వం విద్యుత్‌చ్చక్తి వ్యవస్థలో రూ.52వేల కోట్లు భాకీలు చేసింది. ఈ ప్రభుత్వం ఆ లోటును భర్తి చేయడానికి, నిర్వహణను మెరుగుపర్చాడానికి సబ్‌స్టేషన్‌ కమిటీలు వేసి దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్‌చ్చక్తి సంస్థను తమ ఆధీనంలోకి తీసుకుకోవడానికి 2003 చట్టానికి సవరణ తెచ్చింది. పార్లమెంట్‌లో చట్టం చేసింది. రాష్ట్ర హక్కులను కేంద్రం హరించింది. రెగ్యులేటరీ బాధ్యతలను కేంద్రమే నిర్ణయిస్తుంది. టారీఫ్‌ రేట్లను పెంచడంతో పాటు ఈ సంస్థలను బడాపెట్టుబడిదారుదైన ఆదానీకి అప్పగించడానికి పథకాలు తయారు చేసింది. సాంప్రదాయ విద్యుత్‌ 15శాతం వినియోగించాలని (సోలార్‌) నిర్ణయించింది. టారీఫ్‌ రేట్లు యూనిట్‌ రేట్‌ రూ.2.40లు నుండి రూ.6.50 పెంపుదలకు నిర్ణయించింది. ఇప్పటికే ఏపీ వినియోగదారులపై ఆదాని రూపంలో రూ.లక్షకోట్లు భారం పడింది. స్మార్ట్‌మీటర్లు పెట్టి ముందే టారీఫ్‌ రేట్లు వసూళ్లు చేసే పరిస్థితి వచ్చింది. ప్రధాని మోడీ తెలంగాణలో అమలు చేస్తే ప్రస్త్తుతం 200యూనిట్ల మాఫీ పొందుతున్న, రైతులు వేల కోట్లు టారీఫ్‌ చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల విద్యుత్‌ భారాలు తగ్గడానికి కేంద్ర జాబితా నుండి రాష్ట్ర జాబితాకు మార్చి డిస్కాం లోపాలను సరిచేయాలి. అప్పుడే విద్యుత్‌ వినియోగదారులను లాభం జరుగుతుంది. తలసరి విద్యుత్‌ వినియోగం పెరుగుతుంది.


సారంపల్లి మల్లారెడ్డి 9490098666

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -