డిప్యూటీ సీఎంతో ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు సంజీవరెడ్డి భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో విద్యుత్‌రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జీ సంజీవరెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారంనాడాయన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను ప్రజాభవన్‌లోని నివాసంలో కలిశారు. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (327) రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర కనీస వేతనాల సలహాబోర్డు చైర్మెన్ జనక్‌ప్రసాద్, ఐఎన్‌టీయూసీ జనరల్ సెక్రటరీ ఆర్డీ చంద్రశేఖర్ తదితరులు డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి విద్యుత్‌రంగ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఆర్టిజన్ కార్మికులకు గ్రేడ్ మార్చి, ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింపచేయాలనీ, 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 వరకు ఉద్యోగంలో చేరినవారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. విద్యుత్‌సంస్థల్లో మిగిలిఉన్న 6,500 మంది అన్‌మ్యాన్డ్, కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలనీ, సబ్‌స్టేషన్లలో ఖాళీలు భర్తీ చేయాలనీ, జేఎల్‌ఎం ఖాళీలు భర్తీ చేయాలనీ, విద్యార్హతతో సంబంధం లేకుండా ట్రాన్స్‌కో సీబీడీ గ్యాంగ్‌లో పనిచేస్తున్న ఆర్టిజన్లకు గ్రేడ్-1 జీతం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కారుణ్య నియమాకాల వయస్సును 46 ఏండ్లకు పెంచాలనీ, పదోన్నతులు ఇవ్వాలని కోరారు. దీనిపై డిప్యూటీ సీఎం స్పందిస్తూ విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విద్యుత్‌రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES