నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం పరిధిలోని భూదాన్ భూములకు సంబంధించిన వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల్లో అక్రమాలు జరిగాయని, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు జరపవద్దని స్పష్టం చేసింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వంతో పాటు ఈడీ, సీబీఐ, పిటిషన్‌లో పేర్కొన్న అధికారులు, వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. మహేశ్ అనే వ్యక్తి ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, భూదాన్ భూముల అక్రమాలపై ప్రభుత్వానికి, భూదాన్ బోర్డుకు గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ అంశంపై సమగ్ర విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. తక్షణమే వివాదాస్పద భూములపై ఎలాంటి క్రయవిక్రయాలు గానీ, ఇతర లావాదేవీలు గానీ చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను హైకోర్టు జూన్ 26వ తేదీకి వాయిదా వేసింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
- Advertisement -