– రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల ఆందోళన
యంత్రాంగం : వక్ఫ్ చట్టంలో చేసిన సవరణలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ ముస్లిం పర్సనల్‌లా బోర్డు జెఎసి పిలుపు మేరకు ముస్లిములు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సవరణ బిల్లును వెనక్కి తీసుకునే వరకు ముస్లింలంతా ఏకమై కేంద్రంతో పోరాడుదామని అన్నారు. గుంటూరు పాతబస్టాండ్ సెంటర్‌లో ముస్లిములు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఎం, సిపిఐ, వైసిపి, కాంగ్రెస్, టిడిపి నాయకులు మద్దతు తెలిపారు. స్థానిక టిడిపి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మద్దతు ఇవ్వటానికి రావడంతో అదే వేదికపై ఉన్న వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నూరి ఫాతిమా పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతు పలికి, ఇక్కడ ఎవరికి మద్దతు ఇవ్వటానికి వచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అప్పటికే వేదిక ముందు ఉన్న ప్రజల నుండి వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే రాజీనామా చేయాలనే డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చట్ట సవరణకు మద్దతు తెలిపిన టిడిపి నాయకులతో వేదిక పంచుకోలేమని సిపిఎం నాయకులు ముందుగానే వేదిక కిందకు దిగారు. నిర్వాహకు లు అందరికీ సర్ది చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరూ చట్ట సవరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ వ్యక్తిగతంగా తాను చట్ట సవరణను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి, సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్, ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు చిష్టీ, వివిధ సంఘాల నాయకులు ప్రసంగిం చారు. కర్నూలులోని వివిధ మసీదుల వద్ద ముస్లిములు మానవహారం నిర్వహించారు. ఆదోని మసీద్ కాలనీలో మతోన్మాద విధానాలను వ్యతిరేక ిస్తూ ఆందోళన చేశారు. బాపట్లలో అంజుమన్ ఎ ఇస్లామి యా ఆధ్వర్యంలో అంజు మన్ ఇస్లామియా మసీదు నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహిం చారు. జాతీయ జెండాలు, ఫ్లకార్డులు, ఫ్లెక్సీలతో ముస్లిము లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, సిపిఎం జిల్లా కార్యదర్శి గంగయ్య, సమాజ్‌వాదీ పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి గొర్ల శ్రీనివాసరావు పాల్గొని మద్దతు తెలిపారు. ఎన్‌టిఆర్ జిల్లా మైలవరంలో ర్యాలీ, ఏలూరు జిల్లా నూజివీడులో ధర్నా నిర్వహించారు. విశాఖలోని గాజువాకలో శాంతియుత నిరసనలు తెలిపారు.
