Tuesday, July 8, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఉపాధి కూలీలకు 'న్యాయం'

ఉపాధి కూలీలకు ‘న్యాయం’

- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో మూడేళ్లుగా నిలిపివేసిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి మళ్లీ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కోల్‌కతా హైకోర్టు బుధవారం తీర్పునివ్వడం హర్షణీయం. ‘ఉపాధి హామీ చట్టాన్ని ఎప్పటికీ నిలిపేసే హక్కు ఎవరికీ లేదు. ఇది చట్టబద్ధ హక్కు’ అని హైకోర్టు పేర్కొనడం కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించవచ్చు కానీ, లక్షల మంది పేద గ్రామీణ కార్మికులకు ఉపాధి హక్కు నిలిపివేయడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో అమలు చేస్తున్నప్పుడు ఎలాంటి చట్టవిరుద్ధ లేదా అక్రమాలు జరగకుండా నిరోధించడానికి కేంద్రం చర్యలు తీసుకోవచ్చునని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా అవినీతికి కళ్లెం వేసినట్టే! అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని, రికవరీలు కూడా జరిగాయని, ఈ మొత్తాన్ని పశ్చిమ బెంగాల్‌లోని ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌ రాష్ట్ర నోడల్‌ ఏజెన్సీ బ్యాంకు ఖాతాలో జమ చేసిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఉపాధి హామీని శాశ్వతంగా కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉంచడాన్ని ఊహించ లేమని, రాష్ట్రంలో కొనసాగించ డానికే కోర్టు ప్రయత్నం చేస్తుందని ధర్మాసనం పేర్కొనడం ప్రశంసార్హమైనది. ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టిన చందంగా అవినీతి చోటు చేసుకుందన్న పేరుతో కేంద్రం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టాన్ని గత మూడేళ్లుగా నిలిపివేసింది. ఆ కేసులో ఉన్నత న్యాయస్థానం సానుకూల తీర్పునిచ్చి గ్రామీణ పేదలకు న్యాయం చేసింది.
పనుల్లేక బెంగాల్‌ నుండి లక్షల మంది పేదలు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నా టీఎంసీ, బీజేపీ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం శోచ నీయం. స్వార్ధ రాజకీయ ప్రయో జనాల కోసం వేల కోట్ల రూపాయల వేతనాలు పేదలకు అంద కుండా మూడేండ్లుగా ద్రోహం చేశాయి. గత మూడేండ్లుగా గ్రామీణ పేదలు ఉపాధి కోసం పెద్దయెత్తున ఉద్యమాలు చేయడం, అందులో భాగంగా ఎఐఎడబ్ల్యుయు, ఎఐకెఎస్‌, సీఐటీయూ ఆధ్వర్యాన ఏప్రిల్‌ 20న లక్షల మందితో మార్చ్‌ టు బ్రిగేడ్‌ కార్యక్రమం నిర్వహించడం దేశానికి తెలుసు. న్యాయస్థానం రాజ్యాంగం, చట్టాలనుబట్టి తీర్పులివ్వడం సహజమే కానీ ఇటువంటి ఉద్యమాల ప్రభావం కూడా పడకమానదు. న్యాయమూర్తులు రోజూ మీడియాను పరిశీలిస్తుంటారు. గ్రామీణ పేదల బాధలకు స్పందిస్తుంటారు. ఇలాంటి అంశాలు వారిపై పరోక్ష ప్రభావాన్నయినా వేయక మానవు. ఏది ఏమైనా కోల్‌కతా హైకోర్టు తీర్పు ముమ్మాటికీ ప్రజల హక్కుల విజయానికి సంకేతం.
వామపక్షాల ఒత్తిడి ద్వారా సాకారమైన ఉపాధి హామీ చట్టం పట్ల బీజేపీకి తొలినుండీ కంటగింపే! అందుకే నరేంద్ర మోడీ అధికార పీఠాన్ని అధిష్టించినప్పటినుండీ కేంద్ర బడ్జెట్‌లో ‘ఉపాధి’ కేటాయింపులకు కోత పడుతూనే వుంది. కోవిడ్‌ బాధిత సంవత్సరాలు మాత్రమే అందుకు మినహాయింపు. ఈ ఏడాది కూడా కేటాయింపులకు కోత పెట్టారు. పైపెచ్చు ఏడాదికేడాది వేతన భాగం తగ్గించి మెటీరియల్‌కు, యంత్రాలకు కేటాయింపులు పెంచుతున్నారు. అన్నివిధాలుగా శ్రమజీవులు నష్టపోతున్న పరిస్థితి. చట్టం ప్రకారం ఏడాదిలో సాధారణంగా వంద రోజులు, కరువు ప్రాంతాల్లో నూట యాభై రోజులు పని కల్పించాలి. కానీ వాస్తవానికి అందులో సగం రోజులే పని కల్పిస్తున్నారు.
వేతన బకాయిలు షరా మామూలే! ఏడాదికి రెండువందల రోజుల పని కల్పించాలని, దినసరి వేతనం రూ.600కు పెంచాలని గ్రామీణ పేదలు కోరుతున్నవి ఎంతో న్యాయమైనవి. వాటిని అంగీకరించి అమలు చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ప్రజల కొనుగోలు శక్తి దిగజారిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో సైతం ఉపాధి చట్టాన్ని అమలు చేయడం అవసరం. కానీ కార్పొరేట్లకు లక్షల కోట్లు కట్టబెట్టే ప్రభుత్వాలు పేదలకు ఆమాత్రం ఇవ్వడానికి కూడా సిద్ధపడడం లేదు. కాబట్టి పేదలు తమ న్యాయమైన కోర్కెను సాధించుకోవడానికి ఉద్యమించడం తప్ప వేరే దారి లేదు. అటువంటి ఉద్యమాలకు సానుభూతి, సంఘీభావం తెలపడం, తోడ్పాటునందించడం అవసరం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -