జిల్లా నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట : జనతా ప్రజాతంత్ర విప్లవాన్ని సాధించడానికి ప్రస్తుతం ఉన్న సమాజాన్ని మరింత మెరుగైన సమాజంగా రూపొందించడానికి ఎన్నికల్లో పాల్గొంటూ మార్పు తేవడానికి కృషి చేసే ఏకైక విప్లవ పార్టీ సీపీఐ(ఎం) మాత్రమేనని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ నేతృత్వంలో మండలంలోని వినాయక పురం లో గల ఉమా చంద్ర ఫంక్షన్ హాల్ లో జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తూ గత రెండు రోజులు నుండి పార్టీ సాధారణ సభ్యులకు నిర్వహిస్తున్న మండల స్థాయి రాజకీయ శిక్షణా తరగతుల్లో రెండో రోజు శనివారం పుల్లయ్య “పార్టీ నిర్మాణం – పని పద్దతులు” అనే పాఠ్యాంశాన్ని బోధించారు.
పార్టీలోని ప్రతీ సభ్యుడు విప్లవ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన ఆవశ్యకతను,కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) క్షేత్రస్థాయి నుండి కేంద్ర స్థాయి నిర్మాణం, కార్యకర్తల క్షేత్ర స్థాయి విధులు,నాయకుల పని పద్ధతులు మొదలైన అంశాలు ను పార్టీ శ్రేణులకు సోదాహరణంగా వివరించారు. కార్యకర్తలను సమకూర్చుకోవడం,పార్టీ విస్తరించడం,నాయకులు సాధారణంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధిగమించాలి అనే అంశాలను విశదీకరించారు. కార్యకర్తల,నాయకుల కర్తవ్యాలను జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి వివరించారు. ఈ శిక్షణా తరగతుల్లో మండల కార్యదర్శి వర్గ సభ్యులు ముళ్ళగిరి గంగరాజు,మడిపల్లి వెంకటేశ్వరరావు,కారం సూరిబాబు,మండల కమిటీ సభ్యులు మడకం నాగేశ్వరరావు,మొడియం దుర్గారావు,వర్సా శ్రీ వేణు,కలపాల భద్రం,ఎట్టి కుమారి,మొడియం తిరుపతమ్మ,గడ్డం సత్యనారాయణ లు పాల్గొన్నారు.