తరగతి గది ముందెన్నడూ లేనంత నిశ్శబ్దం.
ఉత్కంఠగా పాఠం ఆలకిస్తున్న విద్యార్థులు. తెలంగాణా ఉద్యమాన్ని దశలవారీగా చిక్కుతీసి పిల్లల ముందు కుప్పపోస్తున్న.
ఇంతలోనే డోర్ దగ్గర అలికిడి. అందరం అటువైపు చూసాం.. నిశ్చలమైన నీటిలో గులకరాయిని విసిరినట్టు పాఠం మధ్యలో చిన్నపాటి తరంగాలు..
అటెండర్ ”అమ్మా… ప్రవల్లిక వాళ్ళ చుట్టాలెవరో వచ్చిండ్రు, ఆ అమ్మాయిని పంపించమని పెద్దసారు చెప్పిన్రు” అంటూ నాకేసి..
”ఎందుకూ..?” పాఠం మధ్యలో ఉన్నాం కదా.! కాసేపాగి పంపిస్తానని చెప్పేంతలోనే..
”కాదమ్మా.. ఏదో అర్జంటే ఉన్నట్లుంది.. జెర తొందరగా తోలుకరా అని ఎవరో వచ్చిన అబ్బాయి విచారంగనే కన్పించిండమ్మా ..!”
సరేలే..! ఏమైయుంటుందసలు.. తెలుసుకుందామని వచ్చిన ఆ అబ్బాయి వైపు వెళ్లిన.. జరక్కూడనిది ఏమైనా జరిగిందా.. వాళ్ళింటి దగ్గర ఏమన్నా గొడవలా.. ఏమయిందో తెలుసుకొని, వీళ్ళని పంపాలని.. తేల్చుకునేందుకే.. పాఠం ఆపి బయటకు వచ్చా..
కొత్త వ్యక్తితో అమ్మాయిని పంపాలంటే పూర్వాపరాలు తెలుసుకోవాల్సిందే..! అసలే రోజులు బాగాలేవు.
ఈ అమ్మాయే తరగతికంతా బాగా చదివే పిల్ల. పాఠం మిస్ అవుతుందనే బాధ లోంచి సంగతేంటో విచారించాలనుకున్నా..
అయితే వీళ్ళ నాన్న పొలం దున్నుతుంటే గట్టు మీంచి ట్రాక్టర్ అతని మీదే బోర్లాపడి ప్రమాదం జరిగిందట..
పైగా ఆశ లేదంట.. దుఃఖాన్ని దిగ మింగుతూ ఆ అబ్బాయి..
అది వింటూనే ”హా.! నాన్న కేమైందన్నా..? ఇప్పుడెట్లున్నడు..” అంటూ ఏడుపు లంకించుకుంది ప్రవల్లిక.
”అయ్యో! అవునా.. ఆరోదిల పావని వాళ్ళ చిన్నమ్మాయి కదా..! రాములూ ఆమెను కూడా తీసుకురాపో..”
పైకి మాత్రం ప్రవల్లికకి ”ధైర్యంగా ఉండు ఏం కాదులే.. చిన్న ప్రమాదమట.. వెళ్లిన తర్వాత సంగతేమిటో కాల్ చెరు..”
లోపలేదో కీడు శంకిస్తున్నా పైకి కనబడనీకుండా తొందరగా వెళ్ళండని పంపించాం.
పాపం పెద్ద ప్రమాదమే.. అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసిండంట..
అయితే ప్రవల్లిక వాళ్ళ అమ్మ అరుణ మాకు సుపరిచితమైన పేరెంట్. ప్రతీ పేరెంట్స్ మీటింగుకి తప్పకుండా వస్తుంది. పిల్లల చదువు పట్ల బాగా శ్రద్ధ కనబరిచే.. మంచి తల్లి. ఇంటి దగ్గర నోట్స్ చూడటం రాయించడం, చదివించడం మూలానే.. ఆ ఇద్దరమ్మాయిలూ ఈ స్కూల్లో టాప్.. స్టూడెంట్స్..!
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని అందుకే అంటారు..
వీళ్ళ ఊరు.. రేగొండ. బడికి సరిగ్గా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీళ్ళది రైతు కుటుంబం.. వ్యవసాయమే ప్రధాన ఆధారం.
అరుణ పది వరకు చదివిందట. జాగా భూమి ఉన్నందువల్లే.. చదువు తక్కువున్నప్పటికీ మేనబావకిచ్చి పెళ్లి చేశారని చెప్పేది.
అన్నట్లు.. ఇక్కడి పేరెంట్స్ అరకొరా చదివినవాళ్ళు.. పేదవాళ్లు, పనులకు వెళ్లందే పూట గడవని వాళ్ళు. వీళ్ళల్లో అరుణ మాత్రమే పిల్లలను పట్టించుకొని చదివించే పేరెంట్.
మా స్టాఫ్ అందరితో కలిసి పిల్లల చదువు సంధ్యలను తెలుసుకుంటూ కలివిడిగా ఉండేది కావడం వల్ల అందరికీ బాగా దగ్గరయ్యింది. వాళ్లని ఓదార్చాలని వెహికల్ మాట్లాడుకుని రేగొండకి బయలెళ్ళాం..!
మమ్మల్ని చూడగానే పిల్లలూ అరుణా పట్టుకొని బోరున ఏడ్చిండ్రు.
నలభై ఏండ్లన్నా నిండని అరుణది ఇక ఒంటరి పోరే.. ఆమె తేరుకోవడం కష్టమే.. పైగా ఇద్దరూ ఆడపిల్లలే. పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత ఆమెపైనే.
ఎన్నోరకాలుగా.. ధైర్య వచనాలు చెప్పి తిరిగి వచ్చామన్న మాటే గానీ.. నా మనసంతా ఆ పిల్లల చుట్టే తిరుగుతుంది.
తండ్రివియోగం వల్ల ప్రవల్లిక ఎక్కడ చదువులో వెనక బడుతుందో!
అసలే బోర్డ్ ఎగ్జామ్స్. అవీ దగ్గరకొచ్చినరు. పుట్టెడు దు:ఖంలో ఉన్న అరుణను ఎవరు ఓదార్చాలో.
ఓ పక్క ఎప్పుడో కాలం చేసిన అత్త, పక్షవాతం వచ్చి మంచానపడ్డ మామ. ఇద్దరమ్మాయిలను చూసుకునే బాధ్యత!
అవును.. ఏదో ఒకటి చెయ్యాలి. అరుణను మళ్లీ నిలబెట్టాలి. తను పట్టుదల గల మనిషి.
కర్మకాండ.. పదోరోజు కార్యక్రమాలు ముగిసిన తర్వాత… మళ్ళీ కలిసి పిల్లలను బడికి పంపమని, మధ్యలో ఆగిన వ్యవసాయాన్ని కొనసాగించమనీ, కొందరి జీవితాలను ఉదహరిస్తూ.. అరుణను తిరిగి మేల్కొల్పడం.. నావంతు బాధ్యతే అయ్యింది.
”అరుణా.. ఇప్పటినుండి వీళ్లకు తల్లివీ తండ్రివీ నువ్వే. ప్రతిభావంతులైన ఈ పిల్లలిద్దరినీ నిలబెట్టే బాధ్యత నీదే. నువ్వు డీలా పడితే ఆ ప్రభావం వీళ్లకు శాపంగా మారుతుంది.
నువ్వు భూమితల్లిని నమ్ముకో. నీకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో శిక్షణ ఇప్పిస్తా. మీకు నీళ్ల సౌకర్యం, కూలీలు బాగానే దొరుకుతారు కదా” అంటూ తనని తిరిగి జనజీవన స్రవంతిలో కలిసేటట్లు ఒప్పించిన.
ఎప్పటికప్పుడు పలకరిస్తూ అవసరమైన సలహాలిస్తూ మంచీ చెడూ తెలుసుకుంటూ తనని తిరిగి నిలబెట్టడం సామాజిక ఉపాధ్యాయురాలిగా నా బాధ్యత. నేనూహించినట్టుగానే అరుణ తిరిగి మామూలు మనిషై పిల్లల చదువు పట్లా, వ్యవసాయ పనులపట్ల శ్రద్దకనబరచింది.
అంతలోనే ప్రవల్లిక పది జిపిఏ సాధించి మా బడికే కాదు, కోహెడ మండలంలోనే ప్రథమురాలిగా ఉత్తీర్ణురాలయ్యింది.
ప్రతిష్టాత్మకమైన త్రిబులైటికి సెలెక్ట్ అయ్యింది. ఇక చిన్నమ్మాయి పావని కూడా అక్క బాటలోనే నడుస్తూ బాగా చదువుతోంది.
ఇక అరుణ సేంద్రియ వ్యవసాయంలోని మెళకువలు తెలుసుకొని, కొత్త కొత్త వంగడాలనుపయోగించి అధిక దిగుబడిని సాధిస్తుంది.
ఇప్పుడు అందరూ కోరుకుంటున్న చిరుధాన్యాలని పండించి లాభాలను గడిస్తుంది. తన దగ్గరున్న ట్రాక్టర్, హార్వెస్టర్ ద్వారా ఇంకొందరికి ఉపాధి కల్పిస్తూ మిశ్రమ వ్యవసాయం, పంటమార్పిడి ద్వారా ముందుకెళుతుంది.
నిజమే.. నేర్పూ పట్టుదలా ఉన్నట్లయితే ఎవ్వరైనా కఠినమైన పనుల్లో కూడా విజయం సాధించవచ్చని ఈమె జీవితమే నిరూపిస్తుంది.
మేలురకం విత్తనాలు పండించే రైతుగా అరుణ అంతెత్తుకు ఎదిగింది. రసాయనిక ఎరువులూ, పురుగు మందులూ వాడకుండా సేంద్రియ ఎరువులతో ఎక్కువ పంట దిగుబడి తీసిన అరుణను ఆ సంవత్సరం కేంద్ర వ్యవసాయశాఖ వారు ‘ఉత్తమ మహిళారైతు’గా ఎంపిక చేసి సత్కరించారు.
ఆవిధంగా తనకు ఆత్మవిశ్వాసం అంచెలంచెలుగా పెరిగి విత్తనశుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేసుకుంది. ఎందరికో ఉపాధిని కల్పిస్తున్న అరుణను చూస్తే నాకు నిజంగా గర్వంగా ఉంటుంది.
ప్రవల్లిక ఐటి శాఖలో మేనేజర్‌గా, పావనినేమో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదిగి దేశానికి సేవలందిస్తున్నారు.
నవ్విన నాపచేనే పండినట్లుగా.. కష్టపడి ఎదిగిన అరుణని.. ఈ రిపబ్లిక్ డే రోజు ముఖ్య అతిథిగా పాఠశాలకు ఆహ్వానించి సత్కరించాం..!
పట్టుదల, సంకల్పమూ, అంకితభావం ఉన్నట్లయితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన అరుణోదయానికి జయహో..!!
– నాంపల్లి సుజాత, 9848059893
అరుణోదయం
- Advertisement -
- Advertisement -