ఏ క్షణాన ప్రాణం పోతుందో తెలియదు. ఎటువైపు నుండి ముష్కరులు దాడి చేస్తారో తెలియదు. చావు తనకు అతి సమీపంలో ఉందని తెలుసు. కానీ ఆమె మరణానికి భయపడలేదు. అయితే తన మరణం మాత్రం విశ్వమంతా వినిపించాలని బలంగా కోరుకుంది. ఆమే ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన పాలస్తీనా యువ ఫొటో జర్నలిస్ట్ ఫాతిమా హస్సౌనా. గాజాలో జరుగుతున్న మారణ హోమాన్ని ప్రపంచానికి చూపెట్టేందుకు తన ప్రాణాన్నే త్యాగం చేసిన ఆమె పరిచయం క్లుప్తంగా…
వైమానిక దాడికి గురికాక ముందు ఆ యువ జర్నలిస్ట్ చివరి కోరిక ‘నా మరణం విశ్వమంతా వినిపించాలి’. పాలస్తీనా ఫొటో జర్నలిస్ట్ అయిన 25 ఏండ్ల ఫాతిమా.. గర్భవతి అయిన తన అక్కతో సహా 10 మంది కుటుంబ సభ్యులతో పాటు ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు. మరికొద్ది రోజుల్లో పెండ్లి కూతురు కావల్సిన ఆమె శవంగా మారిపోయింది. నేటికీ గాజాలో కొనసాగుతున్న సంఘర్షణలో కోల్పోయిన లెక్కలేనన్ని జీవితాలలో ఈమె ఒకటి. అయితే ఆమె మరణం ప్రపంచాన్ని ప్రశ్నిస్తోంది.
ప్రపంచం ముందు నిలబడాలి
‘నేను చనిపోతే ఆ మరణం విశ్వమంతా వినిపించాలి’ అని ఆమె ఒకసారి సోషల్ మీడియాలో రాసుకున్నారు. ‘నేను కేవలం బ్రేకింగ్ న్యూస్‌గా లేదా సమూహంలో ఒక సంఖ్యగా ఉండాలనుకోవడం లేదు. నా మరణం ప్రపంచానికి వినిపించేదిగా ఉండాలి, కాలగర్భంలో కలిసిపోకుండా కాలంతో పాటు నిలిచి ఉండి ప్రజల్లో చైతన్యం నింపాలి. కేవలం సమాధిలో ఉండిపోకుండా కలకాలం ప్రపంచం ముందు నిలబడే చిత్రం నాకు కావాలి’ అన్నారు అంటే ఆమె ధైర్యం నిజంగా నేటి తరానికి స్ఫూర్తిదాయకం. యుద్ధాన్ని పెంచిపోషిస్తున్న సామ్రాజ్యవాదులకు ఒక చెంపపెట్టులా ఆమె నిలిచింది.
డాక్యుమెంటరీగా ఆమె జీవితం
అక్టోబర్ 7 దాడి తర్వాత వివాదం ప్రారంభమైనప్పటి నుండి 51,000 మందికి పైగా మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బాధితుల్లో సగానికి పైగా మహిళలు, పిల్లలు ఉన్నారు. మార్చి కాల్పుల విరమణ విఫలమైన తర్వాత ఇజ్రాయెల్ తన వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. ఏప్రిల్ 18వ తేదీ జరిగిన దాడిలో సుమారు 30 మంది మరణించారు. అయితే ఇజ్రాయెల్ సైనికులు, పౌరులపై దాడుల్లో పాల్గొన్న హమాస్ సభ్యుడిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం అంటుంది. ఫాతిమా మరణానికి 24 గంటల ముందు ఇజ్రాయెల్ దాడి సమయంలో గాజాలో ఫాతిమా జీవితం గురించి ఒక డాక్యుమెంటరీ కేన్స్‌తో పాటు జరిగే ఫ్రెంచ్ స్వతంత్ర చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడుతుందని ప్రకటించారు. మరణం తర్వాత డాక్యుమెంటరీని ప్రదర్శించే కేన్స్ యాసిడ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆమెకు హృదయపూర్వక నివాళిని ప్రకటించింది. ‘ఆమె చిరునవ్వు ఆమె పట్టుదల ప్రపంచ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి వుంటాయి. గాజాలోని మారణహోమంలో వినిపిస్తున్న బాంబుల శబ్దాలు, పసిపిల్లల ఆర్తనాథాలు, తల్లుల దు:ఖం, ఆకలి ప్రతీది ఆమె ప్రపంచం ముందు పెట్టారు. మేము ఆమె కోసం భయపడ్డాము’ అంటూ ఫిల్మ్ ఫెస్టివల్ పంచుకుంది.
ప్రమాదం వెన్నంటే ఉన్నా…
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం దురాగతాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఏడాదిన్న పాటు ఆమె అక్కడే గడిపారు. ఆగ్రహించిన ఇజ్రాయెల్ ఆమెపై వైమానిక దాడికి పాల్పడింది. ఆ ముష్కరులు ఆమె ఇంటిని కూల్చివేశారు. అంతటితో ఆగకుండా పది మంది కుటుంబ సభ్యులను కిరాతకంగా చంపేశారు. ప్రమాదం తన వెన్నంటే ఉన్నప్పటికీ ఫాతిమా తన లెన్స్ ద్వారా గాజా కథను ప్రపంచానికి చెప్పడానికే నిర్ణయించుకుంది. మరణం ఎల్లప్పుడూ దగ్గరలో ఉందని ఆమెకు తెలిసినా కానీ ఆమె కథ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని నిశ్చయించుకుంది.
‘నా మరణం విశ్వమంతా వినిపించాలి’.
- Advertisement -
- Advertisement -