– 2 నుంచి 4 శాతం పెరుగుదల
– ఇప్పటికే పట్టణాల్లో పడిపోయిన నిర్మాణ రంగం
– తాజా ధరల పెరుగుదలతో మరింత ప్రభావం
– ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్
– వ్యవసాయం లాభసాటి అయితేనే గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సి’మంట’తో నిర్మాణ రంగం కుదలయ్యే అవకాశముందని రియల్టర్లు అంటున్నారు. గతేడాది నిర్మాణ రంగం పెద్దగా పుంజుకోలేదు. ఈ ఆర్థిక సంవత్సరమైనా కాస్త ముందడుగేస్తుందని భావించిన వేళ సిమెంట్ ధరల పెరగనున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో బస్తాపై భారీగా ధర పెంచి అమ్ముతుండటంతో ఇండ్ల నిర్మాణాలు కుంటుపడే అవకాశముం దంటున్నారు. పట్టణాల్లో కుదేలైన నిర్మాణ రంగం మరింత మందగించడం తప్ప పుంజుకునే అవకాశాలుండనే చర్చ కూడా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణంపై సిమెంట్ ధరలు ప్రభావం పడటం వల్ల ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్దిదారులైన పేదలపై నిర్మాణ వ్యయం పెరిగే ప్రమాదముంది. 2025-26 ఆర్థిక సంత్సరంలో దేశీయ మార్కెట్‌లో సిమెంట్ ధరలు 2-4 శాతం వరకు పెరగనున్నాయి. ఈ ప్రభావంతో బస్తాపై రూ.15 నుంచి 20 వరకు పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కానీ.. రిటైల్ మార్కెట్‌లో మాత్రం బస్తాపై రూ.60 వరకు పెంచుతారనంటున్నారు. ఈ ఆర్థిక సంత్సరంలో సిమెంట్ డిమాండ్ 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరిగే అవకాశముందని అంచనా వేశాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ ఇండిస్టీ వృద్ధిరేటు 4.5 నుంచి 5.5 శాతం మాత్రమే ఉంది. కానీ.. ఈ సంవత్సరంలో రోడ్ల నిర్మాణం, రైల్వేలు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణ మౌలిక సదుపాయాల కల్పన పెరిగే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు. దాంతో సిమెంట్ వినియోగం కూడా పెరిగే అవకాశముందంటున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం ధరల పెరుగుదల వల్ల అభివృద్ధి, గృహ నిర్మాణం పనులు కుంటుపడతాయంటున్నారు.
సిమెంట్ బస్తా ధర రూ.380పైనే
తాజా మార్కెట్ ధరల్ని పరిశీలిస్తే… వివిధ సిమెంట్ కంపెనీలకు చెందిన బస్తా ధర సగటున రూ.380 వరకు పలుకుతుంది. నిర్మాణ రంగంలో పట్టిషత కోసం పిల్లర్స్, స్లాబ్, బేస్‌మెంట్ కాంక్రీట్ పనులకు ఉపయోగించే అల్ట్రాటెక్ సిమెంట్ బస్తా ధర పది రోజుల క్రితం రూ.330 వరకు ఉంది. ప్రస్తుతం ధర రూ.380 నుంచి 390 వరకు ధర పలుకుతుంది. గోడలు, ఇతర కట్టడాలకు ఉపయోగించే కంపెనీల సిమెంట్ బస్తా ధర రూ.320 నుంచి రూ.330 వరకు ఉంది. వీటి ధరలు కూడా పది రోజుల క్రితం రూ.260 వరకు ఉండేది. మార్కెట్‌లో అల్ట్రాటెక్, అంబుజా, దాల్మియా భారతి, ఓరియంట్, సాగర్, రామ్‌కో, చెట్టినాడు, ఎన్‌సీఎల్, శ్రీ సిమెంట్, నాగార్జున, ప్రియా, మహా, ఎసీసీ వంటి కంపెనీలకు చెందిన సిమెంట్ ధరలు మార్కెట్‌లో మండిపోతుండటంతో ఇండ్ల నిర్మాణ ఖర్చులు పెరుగుతున్నాయని వినియోగదారులు బాధపడుతున్నారు.
నిర్మాణ రంగంలపై ధరల ప్రభావం
సిమెంట్ ధరల పెరుగుదల వల్ల నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇండ్లు, అపార్ట్‌మెంట్స్ నిర్మాణాలతో పాటు పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం వంటి పనులు ఊపందుకోవాల్సిన అవసరముంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి పనుల్లో సిమెంట్ వినియోగం ఎంతో కీలకమైంది. తాజాగా పెరిగిన ధరల ప్రభావం వల్ల అన్ని రకాల నిర్మాణ పనులు మందగించే అవకాశము ందంటున్నారు. హైదరాబాద్ ప్రాంతానికి సమీపంలో ఉన్న పటాన్‌చెరు, సంగారెడ్డి, తెల్లాపూర్, ఇస్నాపూర్ మొదలు జహీరాబాద్ నుంచి బీదర్ నిర్మాణ రంగం పుంజుకుంటున్న వేళ.. సిమెంట్ ధరలు పెరగడంతో నిర్మాణం జరిగినా వాటి కొనుగోళ్లు మందగిస్తాయని రియల్‌ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా త్రిపుల్ ఆర్ నిర్మాణం పుంజుకుంటే సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, షాద్‌నగర్, చౌటుప్పల్, భువనగిరి ప్రాంతాల్లో భారీ ఎత్తున వాణిజ్య, నివాసాలకు సంబంధించిన నిర్మాణాలు వస్తాయని బావిస్తున్న వేళ సిమెంట్, ఐరన్ ధరలు పెరగడం వల్ల నిర్మాణ సంస్థలు వెనకడుగేస్తాయని చెబుతున్నారు. మరో పక్క ఐరన్ ధరలు టన్నుకు ఆరేడు వేల వరకు పెరిగింది.
పెరగనున్న ఇందిరమ్మ ఇండ్లు, అభివృద్ధి పనుల నిర్మాణ వ్యయం
సిమెంట్‌తో పాటు ఐరన్ ధరలు కూడా పెరిగాయి. ఇప్పటికే పలు చోట్ల రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ మండలాలను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్ని చేపట్టింది. వాటి నిర్మాణం పూర్తయ్యాక అన్ని గ్రామాల్లోనూ ఎంపిక చేసిన లబ్దిదారులు ఇండ్లను నిర్మించుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ ఆర్థిక సంత్సరంలో 40 వేల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాల్సి ఉంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు మాత్రమే చెల్లిస్తామని చెప్పింది.
ఇంటి నిర్మాణ పనుల్ని మూడు దశల్లో పరిశీలించి పేమెంట్ చేస్తామని చెప్పారు. లబ్దిదారులే ఇంటిని నిర్మాణం చేసుకోవాలి. సిమెంట్ బస్తాపై రూ.60 పైన, ఐరన్ టన్ను ధర రూ.52 వేల నుంచి రూ.60 వేలకు పెరిగినందున పేదలపై నిర్మాణ భారం పడనుంది. అందుకే ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌ను ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేయాలని లబ్దిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సబ్సిడీ ధరలపై హౌసింగ్ శాఖ ద్వారా సిమెంట్‌ను అందజేసింది. ఇప్పుడు కూడా ధరలు పెరిగినందున ప్రభుత్వమే సిమెంట్‌ను ఇవ్వాలని కోరుతున్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సింగూర్ ఎడమ కాల్వకు లైనింగ్, సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం, గౌరవెల్లి పెండింగ్ పనుల వంటి సాగునీటి ప్రాజెక్టుల్ని చేపట్టాలి. సిమెంట్, ఐరన్ ధరల పెరుగుదల వల్ల కాంట్రాక్టర్లు వెనకడుగేస్తారంటున్నారు. ఇప్పటికే పంచాయతీల్లో చేపట్టిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా గ్రామాల్లో సీసీ రోడ్లు, జీపీ, అంగన్వాడీ, స్కూల్ భవనాల నిర్మాణ పనుల్ని చేయడానికి కూడా కాంట్రాక్టుర్లు ఆసక్తి చూపడంలేదు. ప్రభుత్వ పనులకు అవసరమైన సిమెంట్‌ను కూడా సబ్సిడీ ఇవ్వాలనే చర్చ మొదలైంది. ఇండ్ల నిర్మాణ పనులు మందగిస్తే భవన నిర్మాణ కార్మికుల ఉపాధి కూడా దెబ్బతినే అవకాశముంది. ఇప్పటికే అడ్డాలపై ఎదురు చూసిన కూలీల్లో సగం మందికి కూడా పనులు దొరికే పరిస్థితిలేదు.