– తెలుగు భాషా పరిరక్షణ రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
హైదరాబాద్ : తెలుగు భాషను ఒకటో తరగతి నుంచి డిగ్రీదాకా ప్రథమ భాషగా బోధించాలని, అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో బోధించే సంస్కృతాన్ని దేవనాగరి లిపిలోనే పరీక్ష రాసేలా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసేలా పౌర సమాజం, తెలుగు భాషాభిమానులు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని తెలుగు భాష పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశ ఉద్దేశ్యాన్ని ప్రొ. కాశీం వివరిస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తెలుగుకు గండికొట్టే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయని, అన్ని కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశ పెట్టేందుకు అవసరమైన సవివర నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. ఇదే జరిగితే ఇంటర్‌లో తెలుగు పూర్తిగా కనుమరుగవుతుందని కాబట్టి విద్యావేత్తలుగా, తెలుగు భాషాభిమానులుగా తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌లో సంస్కృతాన్ని తెలుగులో, ఇంగ్లీష్ లో బోధించడానికి, పరీక్ష రాయడాన్ని చూస్తే భవిష్యత్ లో తెలుగును కూడా ఇంగ్లీష్ లో బోధించమని ఆదేశించేలా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ సంస్కృతాన్ని ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రాస్తున్నారని అలా కాకుండా దేవనగరి లిపిలో మాత్రమే రాయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు. తెలుగును కాపాడంతో పాటు ఇంటర్మీడియేట్ సంస్కృత వాచకాన్ని తెలుగు వాచకంతో సమానంగా ప్రామాణికంగా రూపొందించాలని అన్నారు.
తెలుగు భాష పరిరక్షణకు ఒక కమిటీ వేయాలని సూచన చేశారు. తెలుగు భాష కోసం దీర్ఘకాలిక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇంగ్లీష్, సంస్కృతం నుంచి తెలుగు భాషకు తక్షణ నష్టం ఉందని అన్నారు. సంస్కృత పాఠ్యాంశాలు తెలుగు పాఠ్యంశాలతో సమానంగా ఉండాలని అన్నారు. తెలుగు ప్రజలకు తెలుగులోనే సేవలు అందించాలని అన్నారు. మన భాష మన హక్కు పేరుతో ఉద్యమించడమనేది ఆత్మగౌరవ సమస్య అని అన్నారు. తెలంగాణలో సుమారు పది లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ లో సంస్కృతం చదువుతున్నారని వీరికి కేవలం విద్యా సంవత్సరం చివరలో ఒక నెల మాత్రమే నామ్‌కే వాస్తేగా సంస్కృతాన్ని బోధిస్తారని అన్నారు. వెంటనే తెలుగు అకాడమి డైరెక్టర్ ను, తెలుగు అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. తెలుగు నేల మీద తెలుగు వద్దని అనడం భాషా దండయాత్రతో సమానమని అన్నారు. మాతభాషలో ఆలోచిస్తే, పరిశోధనలు చేస్తే విజ్ఞానం అభివద్ధి అవుతుందని అన్నారు. విద్యా వ్యాపారీకరణ పెరిగిన తరువాత సంస్కృతం గోల ఎక్కువైందని తద్వారా తెలుగుకు అపారమైన నష్టం కలుగుతుందన్నారు. అందువల్ల ఈ కుట్రను ప్రజలు, విద్యావేత్తలు గమనించాలని అన్నారు. తెలుగుకు అడ్డంకులు సష్టించేవారు అధికశాతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తన్న ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అఖిల భారతీయ సర్వీసు(యూపీఎస్సీ) వారేనని అన్నారు.
ఇక ముందు అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మేధో సంపన్న దేశాలన్నీ మాత భాషలోనే విద్యా బోధన చేస్తున్నాయని అన్నారు. పాలనా భాషగా ఏ భాషను అమలు పరుస్తున్నారో దాని వెనుక రాజకీయ, పాలనా దక్పథాలు ఉంటాయని దాన్ని గమనించాలని అన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి ఆచార్య చింతకింది కాశీం సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రొ. కోదండరాం, డా. నందిని సిధారెడ్డి, ప్రొ. గారపాటి ఉమామహేశ్వర రావు, ప్రొ. పులికొండ సుబ్బాచారి, ప్రొ. బన్న ఐలయ్య, ప్రొ. సిల్మా నాయక్, ప్రొ.లావణ్య, డా. సంగిశెట్టి శ్రీనివాస్, డా. పసునూరి రవీందర్, డా. సంగి రమేష్, డా. వెల్దండి శ్రీధర్, డా. మోతుకూరు నరహరి, కందుకూరి శ్రీరాములు, అనంతోజు మోహన్ కష్ణ, డా. ఇమ్మిడి మహేందర్, డా. చంద్రయ్య, మాతభాష పరిరక్షణ సమితి, తెలుగు భాషాభిమానులు, పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కమిటీ
ఈ సందర్బంగా తెలుగు భాషా పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి నూతన కమిటీని ఎన్నుకున్నారు.
కన్వీనర్లు: ఆచార్య సి. కాశీం, డా. వెల్దండి శ్రీధర్ , డా. సంగి రమేశ్
సభ్యులు: డా. సిల్మా నాయక్, డా. నర్సింహులు, డా. మాలతి, డా. మాణిక్యం
సలహాదారులు: డా. నందిని సిధారెడ్డి, డా. బన్న ఐలరు, డా. ఉమా మహేశ్వర్ రావు, తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల తెలుగు శాఖాధిపతులు
తీర్మానాలు
1. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసి, అమలు చేయాలి.
2. ప్రాథమిక విద్యలో తెలుగు బోధించే ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించాలి.
3. అన్ని రకాల ద్వితీయ భాషల సిలబస్ లకు ఏకరూపత ఉండాలి.
4. ఒక ప్రాంత సంస్కృతి, జీవన విధానం, ఆ ప్రాంత మాత భాషలో వ్యక్తం అవుతుందనే సూత్రాన్ని ప్రభుత్వం, పౌర సమాజం గుర్తించాలి.
5. ప్రయివేటు కళాశాలల్లో తప్పనిసరిగా తెలుగు ద్వితీయ భాషగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
6. తెలుగు చదివిన వారికి పోటీ పరీక్షలలో బోనస్ మార్కులు ఇవ్వాలి.
7. సంస్కృత భాషా బోధన, పరీక్షా నిర్వహణ సంస్కృతంలో దేవనాగరి లిపిలోనే ఉండే విధంగా ప్రభుత్వం జీవోను జారీ చేసి అమలు చేయాలి. సంస్కృతాన్ని ఇంగ్లీషులో రాయడాన్ని నిషేధించాలి.
8. టెట్ పరీక్షలో ఉపాధ్యాయులు ఎంపిక కోసం నిర్వహించే సమయంలో ఆంధ్రప్రదేశ్ వలె తెలంగాణలో కూడా పేపర్ 3లో తెలుగు సిలబస్ ఉన్న పేపర్ ను ప్రవేశపెట్టాలి.
9. తెలుగు పండిత శిక్షణ కళాశాలలను తిరిగి ప్రారంభించాలి.
తెలుగు భాషను కాపాడుకుందాం
- Advertisement -
RELATED ARTICLES