Monday, April 28, 2025
Navatelangana
Homeట్రెండింగ్ న్యూస్ఎర్రకోటపై జెండా ఎగరేయాలి

ఎర్రకోటపై జెండా ఎగరేయాలి

- Advertisement -

–  దళిత సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జేబీ రాజు
– కారల్‌ మార్క్స్‌, అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి
– పోగొట్టుకున్న హక్కును సాధించాలంటే నిరంతరం పోరాడాలి : ఏపూరి సోమన్న
– కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో పూలే, అంబేద్కర్‌ జన జాతర
– పట్టణంలో భారీ ర్యాలీ
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
లాల్‌, నీల్‌ కలవాలని, ఎర్రకోటపై జెండా ఎగరవేయాలని, అప్పటి వరకు నిరంతర పోరాటం నిర్వహించాలని దళిత సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జేబీ రాజు అన్నారు. కారల్‌ మార్క్స్‌, అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలన్నారు. పోగొట్టుకున్న హక్కును సాధించాలంటే నిరంతర పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్‌ చౌరస్తాలో కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ‘పూలే, అంబేద్కర్‌ జన జాతర’ నిర్వహించారు. ముందుగా పట్టణంలో పూలే, అంబేద్కర్‌ భారీ చిత్రాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జన జాతరలో ప్రజా గాయకులు ఏపూరి సోమన్న, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేబీ రాజు మాట్లాడుతూ.. కారల్‌ మార్క్స్‌, అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలన్నారు. సామాజిక పోరాటం వర్ధిల్లాలని, అందుకు కేవీపీఎస్‌ కీలక పాత్ర పోషించాలని తెలిపారు. అన్ని కుల, ప్రజా సంఘాలను కేవీపీఎస్‌ ఒకే వేదిక మీదకు తెచ్చిందన్నారు. భారతీయ సామాజిక విప్లవాన్ని రగిల్చిన యోధులు పూలే, అంబేద్కర్‌ అని చెప్పారు. 90 శాతం ప్రజలకు చదువులేని రోజుల్లో పాఠశాలను స్థాపించిన ఘనత పూలేదని అన్నారు. పూలే ఆశయాలతో భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ తెచ్చారని, ఇప్పుడు దాన్ని తొక్కుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం లేకుంటే మను ధర్మ శాస్త్రం కొనసాగేదన్నారు. మన బిడ్డలు ఐఏఎస్‌, ఐపీఎస్‌ కొలువులు వచ్చేవా అని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన చేసే వారినే తరమివేయాలని తెలిపారు. ఏపూరి సోమన్న మాట్లాడుతూ.. మనువాదుల చేతుల్లో దేశం ప్రమాదంలో పడిందన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు బహుజనులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. పూలే, అంబేద్కర్‌, మార్క్స్‌ను ప్రేమించే వారు ప్రశ్నించే గొంతుకలు కావాలన్నారు. ఏకం చేయాల్సిన బాధ్యత కేవీపీఎస్‌పై ఉందన్నారు. 400 సీట్లు కాదు, భారత రాజ్యాంగం జోలికి వస్తే 400 అడుగుల పాతాళంలోకి తొక్కుతామని బీజేపీని హెచ్చరించారు. మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకుపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోడ సామెల్‌, ప్రకాష్‌ కారత్‌, మాజీ జడ్పీటీసీ పగడాల యాదయ్య, వివిధ ప్రజాసంఘాల నాయకులు అరుణ్‌కుమార్‌, ఆలంపల్లి నర్సింహ, కిషన్‌, సీహెచ్‌ జంగయ్య, ఎల్లేష్‌, ఆనంద్‌, వీరేష్‌, బండి సత్తన్న, కందుకూరు జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు