Thursday, July 3, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'రుణ'పాశం

‘రుణ’పాశం

- Advertisement -

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 77 ఏండ్ల తర్వాత కూడా భద్రమైన జీవితం గడపడం కన్నా కూడా సామాన్యుడికి అప్పు తీర్చడమే జీవిత లక్ష్యంగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కొరత, ప్రభుత్వ ఆర్థిక విధానాల వైఫల్యంతో వెంటాడే ద్రవ్యోల్బణం సామాన్యుడిని ఆర్థిక దిగ్బంధనం చేస్తోంది. 2023 మార్చిలో ఒక్కో భారతీయుడిపై సగటు అప్పు రూ. 3.9లక్షలుగా ఉండగా, 2025 మార్చి నాటికి అది 4.8 లక్షల రూపాయలకు చేరింది. అంటే రెండేండ్లలోనే దాదాపుగా 23 శాతం పెరుగుదల! ఇది ఆర్థికంగా సామాన్యులు ఎలా చితికిపోతున్నారనడానికి నిలువెత్తు నిదర్శనం. గృహ నిర్మాణం కోసం తీసుకుంటున్న అప్పులు గతేడాది జీడీపీలో 23.1 శాతంగా ఉండగా, ఈ ఏడాదికి 23.9 శాతానికి చేరాయి. మరోవైపు నికర పొదుపు కరోనాకు ముందు 19 శాతం ఉండగా, 2024 నాటికి అది 13.1శాతానికి పడిపోయింది. ఆదాయాన్ని మించుతున్న ఖర్చుల కోసం అప్పుల మీద ఆధారపడాల్సి రావడం అన్నది దేశ వ్యాప్తంగా ఒక ధోరణిగా మారుతోంది.

ఆహారం, విద్య, వైద్యం, నివాసం వంటి ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రిటైల్‌లోన్లలో 91శాతం వరకు వ్యక్తిగత రుణాలే కావడం గమనార్హం. వీటిలో 55 శాతం వినియోగ ఖర్చులే! అంటే, ఏ నెలకానెల బతకడానికి కూడా బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీల మీద ఆధారపడాల్సిన స్థితి ఏర్పడుతోంది.


సామాన్యుడి అప్పులు పెరిగిపోవడానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదనుకుంటే పొరపాటే. నిజానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రతి దశలోనూ సామాన్యుల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు 2016లో నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేసింది. పెద్దసంఖ్యలో చిన్న వ్యాపారాలు దెబ్బతినడం, అసంఘటిత రంగం తీవ్రంగా ప్రభావితం కావడం, ఉద్యోగాలు పోయి, మరోమార్గం లేక అప్పుల మీద ఆధార పడాల్సిరావడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.

ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2022-23 నాటికి ఉత్పత్తి రంగంలో ఉన్న చిన్నాచితక పరిశ్రమల సంఖ్య (అసంఘటిత రంగం) 9.3శాతానికి తగ్గింది. ఈ పరిశ్రమల్లోని 15 శాతం కార్మికులు ఉపాధి కోల్పో యారు. కరోనా ముందునాటి గణాంకాల ప్రకారం ప్రతిఏడాది దేశంలో ఈ తరహా పరిశ్రమలు సంవత్సరానికి 20లక్షల దాకా కొత్తగా ఏర్పాటయ్యేవి. ఆ మేరకు ఉపాధి అవకాశాలను దేశం కోల్పోయింది. మోడీ ప్రభుత్వం అట్ట హాసంగా చెప్పిన నల్లధనం బయటపడింది లేదు.


కానీ, ఈ ప్రక్రియ కాకులను కొట్టి గద్దలకు వేసిన విధంగా మారింది! ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ విధానం కూడా లక్షలాది వ్యాపారాలను, వాటి మీద ఆధారపడిన ప్రజలను తీవ్రంగా దెబ్బతీసింది. అదే సమయంలో అప్పులతో ఆర్థిక చక్రాన్ని నడిపించే వ్యూహానికి ప్రభుత్వం తెరతీసింది. ఫలితంగా ఊరూరా మైక్రోఫైనాన్స్‌ కంపెనీలు, మొబైల్‌ ఫోన్‌లో లోన్‌యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ‘ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌’ పేరిట జరిగిన ఈ ప్రక్రియలో సామాన్యులే సమిధలుగా మారారు. 2023 నాటికి ఈ రంగంలో రుణ గ్రహీతల సంఖ్య ఆరు కోట్లకు చేరింది. మొత్తం రుణభారంలో వీటి వాటా 15 నుండి 20శాతం ఉంటుందని అంచనా. రుణాలు వసూలు చేయడానికి ఈ తరహా సంస్థలు అమలు చేస్తున్న విధానాలు తరచూ వివాదాస్పదమౌతుండటం, అప్పులు చేసిన వారు ఆత్మహత్యలే శరణ్యం అనే పరిస్థితికి తీసుకు వస్తుండటం కళ్లముందు జరుగుతున్నదే.


అప్పులు తీర్చలేక సామాన్యుడు ఒకవైపు ఆత్మహత్యల బారిన పడుతుంటే, మరోవైపు కార్పొరేట్లకు భారీ మొత్తంలో రాయితీలు లభిస్తున్నాయి. 2014-24 మధ్య కాలంలో కార్పొరేట్లకిచ్చిన రుణాల్లో 16.61 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులు రద్దు చేశాయి.
2024వ సంవత్సరంలో 11.39 లక్షల కోట్ల రూపాయల పారు బకాయిల్లో 69 శాతాన్ని బ్యాంకులు రద్దు చేశాయి.

కార్పొరేట్లకు లక్షల కోట్లు కట్టబెడుతున్న ప్రభుత్వానికి సామాన్యులు ఏమాత్రం పట్టడం లేదు. ఇప్పటికైనా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు, అప్పులను రద్దు చేసి పేదలను రుణవిముక్తులను చేయాలి. కార్పొరేట్లపై సంపద పన్ను విధించి పేదల అభివృద్ధికి ఖర్చు చేయాలి.అప్పుడే సామాన్యుడికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -