ప్రభుత్వాలు మారుతున్నాయి. విద్యా సంవత్సరాలూ మారుతున్నాయి. కమిటీలు వేస్తున్నారు, కమిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ప్రయివేటు స్కూల్స్, జూనియర్ కాలేజీలకు సంబంధించి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురాకపోవడం పాలకుల అసమర్ధతకు నిదర్శనం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ ఛైర్మన్‌గా తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. విద్యావ్యవస్థలో గతంలో తెచ్చిన, ఇచ్చిన చట్టాలు జీవోలు అధ్యయనం చేసి, కొంత వరకు క్షేత్రస్థాయి పర్యటనలు చేసిన ఆ కమిషన్ 21 మార్చి 2025న ”తెలంగాణ ప్రయివేటు స్కూల్స్, జూనియర్ కాలేజెస్ రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ 2025” ముసాయిదా బిల్లు విడుదల చేసింది.
ఏప్రిల్ మాసంలో స్కూల్స్, జూనియర్ కాలేజీల యజమాన్య ప్రతినిధులకు ముసాయిదా బిల్లు అందజేసి అభిప్రాయాలు కోరింది. ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు. విద్యార్థి సంఘాలతో, పేరెంట్స్ అసోసియేషన్‌తో కమిషన్ సంప్రదించినట్లు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖను చూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఈ బిల్లును చట్ట రూపం తీసుకురావడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటికే విద్యాశాఖ ఇచ్చి ఉన్న జీవో 91 (ప్రధానంగా డీ.ఎఫ్.ఆర్సి ఏర్పాటుకు), జీవోనెంబర్ ఒకటి (ప్రధానంగా ఫీజు స్ట్రక్చర్స్‌కు సంబంధించి) వివిధ సందర్భాల్లో ఇచ్చిన మెమోలు, ప్రొసీడింగ్స్ అమలు చేయడానికి పాలకులకు చిత్తశుద్ధి లేదు.
అధికారులలో అలసత్వం కొనసాగుతున్నది. రొటీన్‌గా జూన్ 2న జూనియర్ కాలేజీల, జూన్ 12న పాఠశాలల విద్యా సంవత్సరం ప్రారంభమైంది. షరా మామూలుగానే ప్రయివేటు స్కూల్స్, జూనియర్ కాలేజీల యాజమాన్యాల ఫీజుల వడ్డింపులు, ప్రచారహోరు, నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ యాజమాన్యాలే పుస్తకాలు, బ్యాగులు, షూస్, యూనిఫామ్స్ అమ్మకాలు చేస్తున్నారు. విద్యాశాఖ అనుమతి లేని పాఠశాలు, బ్రాంచీల ప్రారంభం, వరల్డ్, ఇంటర్నేషనల్, ఈ టెక్నో, డిజిటల్ తోక పేర్లు యధావిధిగా కొనసాగాయి.ప్రభుత్వ నియంత్రణ కరువైంది. పేద, మధ్యతరగతికి పిల్లల చదువు భారమైంది.
వైద్య విద్య, ఇంజనీరింగ్, సాధారణ డిగ్రీ విద్యా తదితర కోర్సులకు ప్రభుత్వం నిర్దిష్టమైన ఫీజు స్ట్రక్చర్ నిర్ణయించింది. కానీ పాఠశాల విద్యకు, ఇంటర్ విద్యకు నిర్దిష్టమైన ఫీజు నియంత్రణ విధానం లేదు. ఊరడించిన ”తెలంగాణ ప్రయివేటు స్కూల్స్, జూనియర్ కాలేజెస్ రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ 2025” ముసాయిదా బిల్లు చట్టరూపం దాల్చలేదు. 24 పేజీలు 8 చాప్టర్లు 31 సెక్షన్లు కలిగిన ఈ బిల్లులో ప్రధానంగా కమిషన్ ఏర్పాటు, డిస్టిక్ ఫీ రెగ్యులేటర్ కమిటీ, పేరెంట్, టీచర్స్ అసోసియేషన్ కమిటీ ఏర్పాటు, అధిక ఫీజుల నియంత్రణ, విద్యాసంస్థ ఉన్న లొకేషన్, కలిగి ఉన్న ల్యాండ్, మౌలిక వసతులు తదితర అంశాల ఆధారంగా పాఠశాలలను, జూనియర్ కాలేజీలను కేటగిరీలుగా విభజించి ఫీజు నిర్ణయించడంపై విధివిధానాలు చేర్చారు.
డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొన్న ప్రకారం..2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణలోని 33 జిల్లాల్లో 39 వేలా116 ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 60 లక్షల 68 వేల 626 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 24 లక్షల 25వేల 517 (40శాతం), ప్రయివేటు స్కూళ్లలో 36 లక్షల 43 వేల 109 (60శాతం) విద్యనభ్యసిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన బిల్లును చట్ట రూపం తీసుకురావడంలో పాలకుల నిర్లక్ష్యం, కార్పొరేట్ విద్యాసంస్థల పట్ల వారికున్న మక్కువను తెలియజేస్తున్నది.
స్పష్టత లేని డ్రాప్ట్ బిల్లు
డ్రాప్ట్ బిల్లులో డి.ఎఫ్.ఆర్.సి ఏర్పాటు, ఫీజుల వసూలు, ఆదాయ, వ్యయం సంబంధించి ఇదివరకు ఉన్న జీవోలు, మెమోల్లో ఉన్నంత స్పష్టత లేదు. జీవో 91 ప్రకారం జిల్లా కలెక్టర్ లేదా తాను సిఫార్సు చేసిన అధికారి, జిల్లా విద్యాధికారి, జిల్లా ఆడిట్ అధికారులతో కూడిన డిస్ట్రిక్ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేయాలి. స్కూల్ గవర్నింగ్ బాడీ ప్రతిపాదించిన ఫీజు స్ట్రక్చర్‌ను, తల్లిదండ్రుల విన్నపాన్ని పరి గణలోకి తీసుకోని డీఎఫ్‌ఆర్సీ ఫీజులను ఫైనల్ చేయాలి. ఇది నిర్ణయించిన ఫీజులనే ప్రతి ప్రయివేటు స్కూల్ యాజమాన్యం వసూలు చేయాలి. తెలంగాణ విద్యాశాఖ మెమో 6986 ద్వారా ఆగష్టు 2023లో పేర్కొన్న అంశాలు చాప్టర్ నాలుగులో పేర్కొన్న అంశాల్ని చూస్తే విద్యార్థుల నుండి వసూలు చేసే ఫీజు ఆదాయంలో స్కూల్ యజమాన్యం ఐదు శాతం మాత్రమే లాభాలు తీసుకోవాలి. బిల్డింగ్ రెంట్, కరెంటు, వాటర్ బిల్లులు, లైబ్రరీ బుక్స్, ల్యాబ్, కెమికల్స్, ఆడిట్, ఆఫీసు తదితర నిర్వహణ ఖర్చులకు 15శాతం మాత్రమే వినియోగించాలి. మరొక 15శాతం స్కూల్ అభివృద్ధికి అదనపు రూమ్ నిర్మాణం, ల్యాండ్ కొనుగోలు, కొత్త కోర్సులు, సెక్షన్స్ కోసం వినియోగించుకునే వీలుంది.విద్యార్థుల నుండి వసూలు చేసే ఫీజుల్లో యాభైశాతం టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌నకు వేతనాలు చెల్లించాలి.15శాతం ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యూటీ, గ్రూప్ ఇన్సూరెన్స్ తదితరాలకు వినియోగించాలి. బోధన, బోధనేతర సిబ్బందిని ”స్టాఫ్ సెలక్షన్ కమిటీ” ద్వారా నియమించాలి. పోస్టుల వివరాలు సర్క్యులేషన్ అధికంగా ఉన్న కనీసం రెండు తెలుగు దినపత్రికల్లో ప్రకటనలివ్వాలి. పోస్టుల భర్తీకి సంబంధిత విద్యాధికారి అనుమతి తీసుకోవాలి. ఈ అంశాలను డ్రాఫ్ట్ బిల్లులో యధాతధంగా చేర్చాల్సిన అవసరం ఉన్నది.
ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలల ఇష్టారాజ్యం
వైద్య విద్య ప్రయివేట్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ క్యాటగిరి ‘ఏ’ (కన్వీనర్ కోటా), క్యాటగిరి ‘బి’ (మేనేజ్‌మెంట్ కోటా) కేటగిరి ‘సి’ (ఎన్‌ఆర్‌ఐ కోటా) సీట్లను కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ద్వారానే భర్తీ చేస్తున్నది. ఇదే విధానంలో ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ‘బి’ క్యాటగిరి సీట్లను క్యాటగిరి బీ, సీ కింద విభజించి, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ద్వారానే భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు అనేక ఆందోళనలను చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకాల ప్రకారం ప్రయివేటు అన్‌ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలో క్యాటగిరి ‘ఏ’ కన్వీనర్ కోటాలో టీజీఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా 70 శాతం సీట్లను, ఎంసెట్ ర్యాంక్/మెరిట్, రిజర్వేషన్స్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. కన్వీనర్ కోట సీట్ల ఫీజులు (2024-25 సం.) ఆయా కాలేజీలను బట్టి రూ.45వేల నుండి లక్షా 60వేలవరకు ఉన్నాయి. ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల సగటు ఫీజు ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ‘ఏ’ క్యాటగిరి సీట్ల ఫీజు రూ.60వేల కన్నా ఎక్కువగానే ఉన్నాయి.
అయినప్పటికీ ఫీజులు పెంచాలని ప్రభుత్వం పైన, ఉన్నత విద్యామండలిపైన ప్రయివేటు ఇంజ నీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. క్యాటగిరి ‘బి’ (మేనేజ్‌మెంట్) కోటాలో గల 30 శాతం సీట్లలో 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్స్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. ఈ 15శాతం సీట్లకు ఆయా కాలేజీలకు టిఎఫ్‌ఆర్సీ కన్వీనర్ కోటా విద్యార్థులకు నిర్ణయం చేసిన ఫీజులే వర్తిస్తాయి. ఫీజు రీయంబర్స్‌మెంట్ వర్తించదు. రిజర్వేషన్లు వర్తింపజేయడం లేదు. అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఈ కేటగిరీలో సీట్లు పొందే అవకాశం ఉంటుంది. కానీ టాప్ 20గా చెప్పబడుతున్న ప్రయివేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రధానంగా కంప్యూటర్ బేస్డ్ కోర్సులకు రూ.15 లక్షలనుండి 20 లక్షలు, ఆపైన ఫీజులు వసూలు చేస్తున్నాయి. మిగతా 15 శాతం ఎన్నారై పిల్లలు లేదా ఎన్నారై స్పాన్సర్ కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 5వేల అమెరికన్ డాలర్లకు మించకూడదు. ఈ పద్ధతిలో భర్తీ చేయగా మిగిలిపోయిన సీట్లను టీఎస్ ఎంసెట్ ర్యాంక్/ మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. అయినా సీట్లు మిగిలితే ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి.
గైడ్‌లైన్స్ ఫాలో కాని కళాశాలలు
ఉన్నత విద్యామండలి గైడ్‌లైన్స్ ప్రకారం క్యాటగిరి ‘బి’ సీట్ల భర్తీ కోసం ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో, సర్క్యులేషన్ అధికంగా ఉన్న కనీసం ఒకో పత్రికలో నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆయా కాలేజీల వెబ్‌సైట్లలో నోటిఫికేషన్ డిస్‌ప్లే చేయాలి. మూడు, నాలుగు కాలేజీలు మినహా అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నత విద్యా మండలి గైడ్‌లైన్స్ ఫాలో కావడం లేదు. క్యాటగిరి ‘బి’ సీట్ల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ గౖెెడ్‌లైన్స్‌నే ఉన్నత విద్యామండలి ప్రయివేటు యాజమాన్యాలకు సహకరించే ధోరణి కనబడుతోంది. నిర్దిష్టమైన తేదీలోపు క్యాటగిరి ‘బి’ సీట్లు భర్తీ చేయాలని ఉన్నది తప్ప, క్యాటగిరి ‘బి’ కింద వచ్చిన దరఖాస్తుల వివరాలు వెంటనే ఉన్నత విద్యామండలి తీసుకోవడం కానీ, యాజమాన్యాలు పారదర్శకంగా నోటీస్ బోర్డులో లేదా వెబ్‌సైట్లలో డిస్‌ప్లే చేస్తున్నాయా లేదా అనే పర్యవేక్షణ లేదు. భర్తీ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సీట్లు పొందిన అభ్యర్థుల వివరాలు ఇవ్వాలనే ఈ విధానమే లోపభూయిష్టంగా ఉంది. ఇదే ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలలకు ఆయాచితవరంగా మారింది.
‘బి’ కేటగిరి సీట్లు అంటే మేనేజ్‌మెంట్ సీట్లు అనీ, వాటిని ఎంతకైనా అమ్ముకోవచ్చనే వాతావరణం కాలేజీ యాజమాన్యాలు కల్పించాయి. విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో ఉన్నత విద్యామండలి పూర్తిగా విఫలమైంది. ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల అక్రమ వసూళ్లను అరికట్టడానికి, పారదర్శకత పెంపొందించడానికి, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్న విధంగా ఉన్నత విద్యామండలి ద్వారానే ‘బి’ కేటగిరి సీట్ల భర్తీకి ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే కాలేజీ యాజమా న్యాలకు చెల్లించాలి. ఫీజు రీయంబర్స్‌మెంట్ రాలేదనే పేరుతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులను ఆయా మేనేజ్‌మెంట్లు వేధిస్తున్నాయి. డబ్బులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తున్నాయి.అందుకే ఫీజుల విషయమై సమగ్రంగా చర్చించి బిల్లును చట్టరూపంలో తీసుకురావడమే సర్కార్ తక్షణ కర్తవ్యం.
గీట్ల ముకుంద రెడ్డి
94900 98857