రేట్లు పెంచనున్న క్యాబ్ సంస్థలు
ప్రయివేటు మోటార్ సైకిళ్లకు కేంద్రం అనుమతి
న్యూఢిల్లీ : రద్దీ సమయాల్లో ఇకపై క్యాబ్ సర్వీసులను బుక్ చేసుకుంటే బిల్లు తడిసి మోపెడు కానుంది. యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ర్యాపిడో, ఉబర్, ఓలా తదితర వంటి సంస్థలు రద్దీ సమయాల్లో రేట్లు పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ బుధవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ నూతన గైడ్‌లైన్స్ ప్రకారం నామమాత్రంగా రద్దీ ఉన్న సమయాల్లో బేస్ ఛార్జీల్లో సగం సర్‌చార్జీ కింద పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఒకవేళ రద్దీ విపరీతంగా ఉంటే 200 శాతం పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అంతకుముందు ఈ వెలుసుబాటు 150 శాతంగా ఉండేది. మూడు కిలోమీటర్ల లోపు ప్రయాణానికి ఎలాంటి అదనపు చార్జీలు విధించకూడదని నిబంధన పెట్టింది. యాప్ ద్వారా రైడ్‌ను అంగీకరించిన తర్వాత సరైన కారణం చెప్పకుండా డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే చార్జీలో 10 శాతం లేదా రూ.100 మించకుండా జరిమానా పడుతుంది. దానిని డ్రైవర్, అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్ చెరి సమానంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ, సరైన కారణం చెప్పకుండా ప్రయాణికులు రైడ్ క్యాన్సిల్ చేసినా ఇదే జరిమాన వర్తిస్తుంది. అదే విధంగా అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లతో అనుబంధంగా ఉన్న ప్రతి డ్రైవర్‌కు కనీసం రూ.5లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల మేర టర్మ్ బీమా కవరేజ్‌ను తప్పనిసరిగా అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
రద్దీ వేళల్లో ప్రయాణం తడిసి మోపెడు
- Advertisement -
- Advertisement -