Friday, July 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసంక్షేమం పేదల గుడిసెల వరకు చేరాలి

సంక్షేమం పేదల గుడిసెల వరకు చేరాలి

- Advertisement -

– ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి అమలు బాధ్యత కలెక్టర్లదే : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

”సంక్షేమ పథకాలు పేదల గుడిసెల వరకు చేరాలి. ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి అమలు బాధ్యత కలెక్టర్లదే” అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో నిర్మల్‌, నారాయణపేట్‌, జోగులాంబ గద్వాల్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, వనపర్తి జిల్లాల కలెక్టర్లతో భూభారతి, ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో భూభారతి, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టామనీ, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. చట్టాన్ని రూపొందించడం వరకే పరిమితం కాకుండా, అది అర్హులందరికీ అందేలా పని చేయాలని కోరారు. ”భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. రెవెన్యూ కార్యాలయానికి వచ్చే సామాన్యుడు సైతం సంతోషపడేలా యంత్రాంగం పనిచేయాలి. ఇందిరమ్మ ఇండ్లకు ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నాం. లబ్దిదారుల ఎంపిక, ఇండ్ల మంజూరు, నిర్మాణ పనులను పకడ్బందీగా పర్యవేక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన ఈ రెండు పధకాలు పక్కదారి పట్టకుండా నిఘా పెట్టాలి. అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్నా రద్దు చేయడానికి వెనుకాడొద్దు. ప్రతి ఇల్లు అర్హులకే అందాలి. ఒక్కో ఇంటికి 40 మెట్రిక్‌ టన్నుల ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలి. నిర్మాణానికి అవసరమైన స్టీల్‌, సిమెంట్‌ ఇటుకల కోసం మండల స్ధాయిలో ధరల కమిటీలు ఏర్పాటు చేయండి” అని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

దేశానికే మోడల్‌గా తెలంగాణ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌
దేశానికే రోల్‌ మోడల్‌గా ఉండేలా విపత్తు నిర్వహణ వ్యవస్ధను రూపొందించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో గోదావరి, కృష్ణా నదీ పరివాహక జిల్లాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో చీఫ్‌ సెక్రెటరీ కె. రామకృష్ణారావు, విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌తో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల ఆకస్మికంగా వచ్చే వరదలు, వర్షాల సమాచారాన్ని ఐఎండీతో సమన్వయం చేసుకుని పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ”వరద ఉధృతి వస్తే ముంపునకు గురయ్యే గ్రామాల సమాచారాన్ని నీటిపారుదల శాఖ ముందుగానే అందించాలి.
ఇతర రాష్ట్రాల్లో వచ్చే వరద వివరాలు, స్ధానికంగా కురిసిన వర్షం, ఎంత నీటిని విడుదల చేశారనే విషయాలు సవివరంగా ఉండాలి. నదీ పరివాహక ప్రాంతాల్లోని నివాసితులను వరదలు వచ్చిన ప్రతిసారీ సురక్షిత ప్రాంతాలకు తరలిం చడం కంటే వారికి శాశ్వత నివాసం కల్పించాలి. ఇందుకు సంబంధించి నివాసితుల వివరాలను గుర్తించండి. అదనపు కోటా కింద ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తాం” అని పొంగులేటి తెలిపారు. భారీ వర్షాలు, వరదల సమయంలో వాగులు, చెరువుల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎయిర్‌ లిఫ్ట్‌ మెకానిజాన్ని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఆ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల గతేడాది పాలేరులో చిక్కుకున్న బాధితులను రక్షించు కోలేకపోయామని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్‌ లిఫ్ట్‌ మెకానిజం ఏవిధంగా ఉండాలి? విపత్తు సంభవించిన ప్రాంతానికి ఏవిధంగా చేరుకోవాలి? వంటి అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -