Friday, July 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'శిశువిహార్‌' ఆయమ్మల వెతలు

‘శిశువిహార్‌’ ఆయమ్మల వెతలు

- Advertisement -

ఆరు నెలలుగా వేతనాలు రాక అవస్థలు
ఈఎస్‌ఐ, పీఎఫ్‌ఐ చెల్లింపుల్లోనూ అలసత్వం..
ఏజెన్సీల నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో

స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే శిశువిహార్‌లో ఆయమ్మల పాత్ర కీలకమైంది. వారు లేకపోతే వాటి నిర్వహణ కష్టం. కానీ వారికి ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదు. చాలామంది ఒంటరి మహిళలు, భర్త చనిపోయిన వారే ఎక్కువగా ఉండటంతోపాటు కిరాయి ఇండ్లు కావడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీల నిర్లక్ష్యంతోపాటు అధికారులు పట్టించుకోకపోవడంతో వారు అనేక బాధలు పడుతున్నారు. సకాలంలో వేతనాలు ఇప్పించాలని సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సీఐటీయూ హైదరాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేసి వినతిపత్రాలు అందజేసినా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం శోచనీయం.
హైదరాబాద్‌ నగరంలోని అనాధ పిల్లల సంరక్షణ కేంద్రం శిశువిహార్‌లో అయ్యప్ప ఏజెన్సీ, శ్రీమిత్ర అసోసియేట్స్‌, జగదీష్‌ అను మూడు ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల పరిధిలో సుమారు 130 మంది ఆయమ్మలు పనిచేస్తున్నారు. ప్రతినెలా వేతనం వస్తేగానీ కుటుంబం గడవని పరిస్థితి వారిది. వీరికి ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 6 నెలల వేతనాలు ఇవ్వలేదు. ఇంటి కిరాయి కట్టకపోవడంతో యజమానులు ఇల్లు ఖాళీ చేయిస్తున్నారని పలువురు వాపోతున్నారు. పిల్లల స్కూల్‌ ఫీజులు కట్టలేని పరిస్థితి. అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని కుటుంబాలను వెల్లదీస్తున్నారు. బకాయి వేతనాలు ఇవ్వాలని కోరుతూ స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కలెక్టర్‌తోపాటు ప్రగతి భవన్‌కు వెళ్లి విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్ట్‌ తీసుకున్న ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు సైతం వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు పట్టించుకోకపోవడంతో ఆయమ్మలు వేతనాలందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే వేతనాలు చెల్లించేలా చూడాలని వారు కోరతున్నారు.
అసలే తక్కువ వేతనాలు.. అపై కోతలా?
వాస్తవానికి మొదట్లో జీవో 60 ప్రకారం ఆయమ్మలకు రూ15,600ల వేతనం చెల్లించారు. ఆ తర్వాత చెప్పాపెట్టకుండా రూ.14,500కు తగ్గించారు. ఈ వేతనాన్ని మూడేండ్ల నుంచి ఇస్తున్నారు. బకాయి వేతనాలు అడితే.. శిశువిహార్‌ సెంట్రల్‌ గవర్నమెంట్‌ స్కీం అయిన మిషన్‌ వాత్సల్య కిందకు వస్తుందని, ఆ ప్రకారం ఆయమ్మలకు రూ.7,500 మాత్రమే దేశవ్యాప్తంగా ఇస్తున్నారని.. ఇక్కడా అదే అమలు చేస్తామని అధికారులు అంటున్నారని ఆయమ్మలు ఆందోళనకు గురవుతున్నారు.
ఏజెన్సీలపై చర్యలేవీ..?
శిశు విహార్‌లో పనిచేస్తున్న ఆయమ్మలకు చట్ట ప్రకారం ప్రతినెలా 7వ తేదీ లోపు వేతనాలతోపాటు పే-స్లిప్‌ తప్పనిసరిగా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అమలు చేస్తున్న జీవో 60 ప్రకారం శిశువిహార్‌ ఆయమ్మలకు కూడా రూ15,600 వేతనం చెల్లించాలి. అందుకనుగుణంగా సర్క్యులర్‌ జారీ చేయాలి. 2025 జనవరి నుంచి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సక్రమంగా కట్టకపోవడం కారణంగా ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వైద్యం అందని పరిస్థితి. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సరిగా కట్టని కాంట్రాక్టు ఏజెన్సీలపై చర్యల్లేవు. చట్ట ప్రకారం ఆయమ్మలకు నెల వేతనం 26 రోజులకు లెక్కించి ఇవ్వాలి.. కానీ ప్రస్తుతం ఇస్తున్న రూ14,500 వేతనాన్నే 30 రోజులకు లెక్కించి ఇస్తున్నారు. దాని వల్ల ఒక ఆయమ్మ డబుల్‌ డ్యూటీ చేసినా రోజుకి రూ.74 తక్కువగా వస్తోంది. దీని ప్రకారం ఇప్పటివరకు ఆయమ్మలకు వేల రూపాయల నష్టం జరిగింది.
వెంటనే వేతనాలు చెల్లించాలి
శిశువిహార్‌లో పనిచేసే ఆయమ్మలకు వెంటనే ఆరు నెలల వేతనాలు చెల్లించాలి. సకాలంలో వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి. ప్రతినెలా ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సక్రమంగా చెల్లించేలా చూడాలి. అంగన్‌వాడీ హెల్పర్స్‌ మాదిరిగా ఆయమ్మలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నాం.
– ఆర్‌. అశోక్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, శిశు విహార్‌
వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -