Friday, July 4, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిరక్త పిపాసి అమెరికా

రక్త పిపాసి అమెరికా

- Advertisement -

”సామ్రాజ్యవాదం అంటే యుద్ధం” అంటాడు లెనిన్‌ మహాశయుడు. మనుషుల శవాల గుట్టలపై, ఎముకల కుప్పలపై, రక్త ప్రవాహాలపై రాజ్యపాలనని సుస్థిర పరుచుకునే దుష్ట లక్ష్యంతో దోపిడీ పాలకవర్గాలు కృత్రిమ యుద్ధాలు సృష్టిస్తాయని, రెండు దేశాలు లేదా రెండు కూటముల మధ్య జరిగే యుద్ధాలు సారాంశంలో తమ సొంత దేశ పేద వర్గాలపై సాగే యుద్ధాలు అని లెనిన్‌ చాలా స్పష్టంగా చెబుతాడు. సామ్రాజ్యవాదుల రక్త పిపాసి, పెట్టుబడి లాభాపేక్ష లేకుండా మనవాళి చరిత్రలో జరిగే యుద్ధాలు దాదాపు అరుదు. ఈ యుద్ధ జ్వాలల్లో సామాన్యులే సమిధలవుతారు. తాజా పశ్చిమ ఆసియా పరిణామాలు కూడా దీనికి మినహాయింపు కాదు. పన్నెండు రోజులపాటు జరిగిన యుద్ధం అటు ఇరాన్‌లోను, ఇటు ఇజ్రాయిల్‌లోనూ వందలాదిమంది మరణించారు. వీరిలో స్వప్నాలు చిధ్రమై , బతుకులు అస్తవ్యస్తమై ,శిధిలమై రోడ్డున పడ్డ బాధితులెందరో! ఇంత జరిగినా తర్వాత కూడా మానవాళికి ముప్పు తొలగిందా అంటే లేదనే చెప్పాలి సామ్రాజ్యవాద బరితెగింపే దీనికి కారణం.


ఇజ్రాయిల్‌ అమెరికా అండతో పాలస్తీనాలో రక్తం పారించి, నిష్కారంగా ఇరాన్‌ మీద యుద్ధం ప్రకటించింది. 2023 అక్టోబర్‌ నుండి ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ మధ్య ప్రాచ్యంలోని వివిధ దేశాలపై 42 వేల దాడులు చేసినట్లు ఒక అంచనా. పాలస్తీనా, లెబ నాన్‌, సిరియా, ఇరాన్‌, యెమెన్‌లపై సాగిన ఈ దాడుల్లో వేలాదిమంది మరణించారు. ఒక్క పాల స్తీనాలోనే 60 వేలమంది మృత్యుఒడికి చేరారు. సామ్రాజ్య వాద నెత్తుటి దాహాన్ని అర్థం చేసుకోవటానికి ఈ వివరాలు చాలు. అమెరికా గత 132 సంవత్సరాలుగా ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ ‘వస్తాదు’గా తయారైంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని, ఆ దేశాల్లో తమను వ్యతిరేకించే పాలకులను తొలగించటంతో పాటు, ఆ దేశాల్లో కల్లోలాలు సృష్టించింది.

1893లో హవారు లో రాచరికాన్ని కూలదోయడం మొదలు 2003లో ఇరాక్‌ లో సద్దాంహుస్సేన్‌ను తొలగించి చంపటం, ఆప్ఘన్‌ పరిణామాలు, నేటి సిరియా, పాలస్తీనా ఉద్రిక్తతలు మొత్తంగా అమెరికా ఇతర దేశాలలో సైనిక జోక్యం చేసుకున్నా సందర్భాలు 150కి పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా కన్ను పశ్చిమాసియాపై పడింది. అక్కడ ఉన్న చమురు ,ఇతర వనరులు దోచుకోవటం లక్ష్యంగా పెట్టుకొని, పశ్చిమా సియాలో తన కీలుబొమ్మ దేశంగా పాలస్తీనా భూభాగాలను ఆక్రమించి 1948లో ఇజ్రాయిల్‌ను అక్రమంగా ఏర్పాటు చేసింది. అప్పటినుండి పశ్చిమాసియాలో రక్తపాతం సృష్టిస్తు న్నది. పాలస్తీనాలో జాతి హనానికి కూడా కారణమైంది.


పశ్చిమాసియాలో ఆయిల్‌, ముడి చమురు, ఖనిజ వనరులు, మంచి రవాణా మార్గాలు, అటవీ సంపదల కారణంగా ఈ ప్రాంతం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మార్కెట్‌. ఎగుమతి దిగుమతులకు, ప్రపంచ వాణిజ్యానికి ఆయుపట్టు. ఈ దేశాల ద్వారా తన రాజకీయ, ఆర్థిక అవసరాలు తీర్చుకోవటం కోసమే ఈ మారణకాండ. అమెరికా ప్రభుత్వం విదేశాల్లో తనకు ఏమాత్రం అధికారం లేనిచోట తన అవసరాల కోసం తనకు అనుకూల దేశాలను సృష్టించుకోని, అమెరికా ప్రభుత్వాలు పరాయి దేశాల మీద, ప్రభుత్వ నేతల మీద ,ఆ దేశ ప్రజల మీద ,ప్రజా సంస్కృతుల మీద దాడులు, యుద్ధాలు చేస్తున్నది. అలాగే ఆయా దేశాల సామాజిక, ఆర్థిక రాజకీయ వ్యవస్థలను చిన్నాభిన్నం గావిస్తున్నది. అసలు అమెరికా పాలకుల విదేశాంగ నీతే అది.

ఇతర దేశాలు ప్రాంతాలు తమ రాజకీయ, ఆర్థిక అవసరాలు తీర్చాలని అనుకునే విదేశాంగ నీతి. ఇదంతా బహుళజాతి సంస్థల సామ్రాజ్యవాదం రాజకీయ ప్రయోజనాలు కాపాడే వ్యూహం. ప్రపంచంలో మరే దేశము ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదు. ప్రపంచంలోని సకల వనరులు, సంపద మొత్తం అమెరికన్‌ బడా బాబులకు దక్కాలి. భూగోళం ఏ మూలైన మనిషి నెత్తురు, చెమట డబ్బుగా మారి అది డాలర్‌గా వారి చెంతకు చేరాలనేదే అమెరికా కుటిల రాజనీతి. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం మూడు దశాబ్దాల్లో కూలిపోయిందేమో గాని, ఎప్పటికీ కూలిపోని రవి అస్తమించని అమెరికన్‌ కార్పొరేట్‌ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, కాపాడాలి. ఇదే అమెరికా లక్ష్యం. అందుకోసం ప్రపంచమ్మీద ఎంత ఆకలిని, రోగాన్ని, దు:ఖాన్ని, అసమానతలను, దోపిడీని, పీడనను, హింసను రుద్దిన అదంతా విదేశాంగ నీతి అవుతుంది. ఇదే అమెరికా విదేశాంగ విధానం. ఈ దుర్మార్గం కోసం అమెరికా పాలకులు ఎంతో ఖర్చు చేస్తారు.


నిజానికి అమెరికా ఎంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొం టున్నది. కనుచూపుమేరలో ఆ దేశాన్ని కబళించ నుంది. అయినా సరే యుద్ధాల కోసం ఖర్చు చేస్తున్నది. ప్రపంచాన్ని గాయపరుస్తున్నది. ఆయుధాలు అమ్ముకుంటారు. పేద ప్రజల రక్తంతో హోలీ ఆడుకుంటారు. ఇంత నీచమైన ఈ అమెరికన్‌ ప్రవృత్తి సామ్రాజ్యవాదం విష సంస్కృతిలో భాగమని మనం గ్రహించాలి. నేడు పాలస్తీనాలో ప్రతి అంగుళం ప్రజల రక్తం, కన్నీరుతో తడిసింది. పాలస్తీనా ప్రజలు తమ జన్మభూమిలో నిర్వాసితులుగా మారి, వారి మాతృభూమి కోసం పోరాడు తున్నారు. ఈ పాపం అమెరికాదే. పాలస్తీనా జాతి హననంపట్ల ప్రపంచ పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న లెక్కచేయకుండా రక్తపాతం పారిస్తున్నది అమెరికా. ఇంతటి విధ్వంసానికి కారణమైన సామ్రాజ్యవాదం నశించాలి. అందుకే సోషలిస్టు ఆర్థిక పోరాటాలు పెరగాలి. సోషలిస్ట్‌ ఆర్థిక వ్యవస్థలు ఏర్పడాలి. మానవాళి విముక్తికి సరైన మార్గమిదే.
– షేక్‌. కరీముల్లా, 9705450705

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -