అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో క్వాడ్ అనే చతుష్టయ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. అది ఆమోదించిన ప్రకటన చూస్తే ఒక పిట్టకథ గుర్తుకు వస్తున్నది. ఒక సత్రంలో కొందరు సాధువులు రాత్రికి ఒక చోట చేరి ప్రతి రోజూ గంజాయిదమ్ము కొట్టేవారు. అది తలకు ఎక్కగానే తెల్లవారిన తర్వాత అది చేయాలి ఇది చేయాలి, ఈ బతుకు ఎంతకాలం? అంటూ ప్రగల్భాలు పలికేవారట. తెల్లారేసరికి దమ్ముదిగి ఎవరి కర్రా బుర్రా తీసుకొని వారు ఊరు మీదకు వెళ్లేవారు. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన చతుర్ముఖ భద్రతా వ్యవహారాల సంప్రదింపుల కూటమి(క్వాడ్) 2007లో ఉనికిలోకి వచ్చింది. తర్వాత పదేండ్ల పాటు దాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు. 2017 నుంచి క్రమం తప్పకుండా సమావే శాలు, ప్రకటనలు చేస్తున్నారు. 2021 నుంచి ఏటా ఒక సభ్యదేశంలో కూటమి అగ్ర నేతల సమావేశాలు, దానికి ముందు విదేశాంగ మంత్రుల సన్నాహక సంప్రదిం పులు జరుపుతున్నారు. ఆరుసార్లు అధినాయక సభలు జరగ్గా రెండుసార్లు వీడియో కాన్ఫరెన్సులు, రెండుసార్లు జపాన్‌లో, మరో రెండుసార్లు అమెరికాలో నిర్వహించారు. ఏడవ సమావేశం ఈడాది చివరిలో మనదేశంలో జరగనుంది.
జూన్30 నుంచి జూలై రెండవ తేదీ వరకు కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం వాషింగ్టన్‌డిసిలో ఏర్పాటు చేశారు. చైనా పేరు పెట్టకుండా దాన్ని ఉద్దేశించి ఆర్థిక బలవంతం, ధరల తిమ్మినిబమ్మిని, సరఫరా వ్యవస్థల విచ్చిన్నం, అక్రమ మార్కెట్ పద్ధతులు, కీలకమైన ఖనిజాల ఉత్పత్తి మీద కేంద్రీకరణ వంటి చర్యలకు పాల్పడుతున్న దేశాలంటూ ధ్వజమెత్తుతూ ఒక తీర్మానం చేశారు. దక్షిణ చైనా సముద్రంలో నౌకల స్వేచ్ఛా రవాణాకు ఆటంకం కలిగించకూడదనే పాతపాటనే మరోసారి పాడారు. ఇంతవరకు ఆ మార్గంలో చైనా ఒక్కనౌకను కూడా అడ్డుకొని మలేసిన ఉదంతం లేదు. షాంఘై సహకార సంస్థ సమావేశం ఉగ్రదాడిని, దానికి పాల్పడిన దేశం పేరు లేకుండా ఉగ్రవాదాన్ని ఖండిస్తూ తయారు చేసిన ప్రకటనపై మన రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ సంతకం చేయకుండా నిరసన తెలిపారు. వాషింగ్టన్ చతుర్ముఖ సమావేశంలో మన దేశాన్ని సంతుష్టీకరించేందుకు పాకిస్తాన్ పేరెత్తకుండా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఎవరి ఒత్తిడికి లొంగి దాన్ని మనదేశం ఎలా అంగీకరించిందో తెలియదు.
నాలుగు దేశాల నేతలు సమావేశమై నపుడు పరోక్షంగా చైనా మీద మాటల దాడిలో ఊగిపోతారు, ఇప్పుడూ అదే జరిగింది. చిత్రం ఏమిటంటే చైనా నుంచి తలెత్తిన ముప్పు పేరుతో చేస్తున్న ప్రచారానికి దానితో సంబంధాలకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. అలాంటి దేశంతో లావాదేవీలు తగ్గించుకోకపోగా ఇంకా పెంచుకొనేందుకు ప్రతిదేశమూ విడివిడిగా ప్రయత్నాలు చేస్తున్నది. గాల్వన్ ఉదంతాల తర్వాత చైనాను మనకాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలంటే దిగుమతులు నిలిపివేయాలంటూ కాషాయ అలగాజనం వీధుల్లో వేసిన వీరంగం తెలిసిందే.మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఐదేండ్ల పాటు నిలిపివేసిన చైనా పెట్టుబడులకు ఎర్రతివాచీ పరచి ఇప్పుడు స్వాగతం పలుకుతున్నది. దిగుమతుల్లో మన్మోహన్ సింగ్‌నే కాదు, మోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకున్నారు. ఏటా వంద బిలియన్ డాలర్ల మేర విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని పూలల్లో పెట్టి చైనాకు సమర్పిస్తున్నారు.చైనాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించుకోవాలని రక్షణ మంత్రి బీజింగ్‌లో ప్రతిపాదిస్తారు, చైనా నుంచి మన రక్షణకు ముప్పు ఉందంటూ పరోక్షంగా వాషింగ్టన్‌లో విదేశాంగమంత్రి ప్రకటనలు చేస్తారు. ఇదేమి రాజనీతో అర్థం కాదు.
చైనాను అది చేస్తా ఇది చేస్తా అని వీరంగం వేసే అమెరికా అధ్యక్షులు పులిలా గాండ్రించి పిల్లిలా బీజింగ్‌తో ఒప్పం దాలు చేసుకుంటారు. చేసుకున్న దాన్ని ఉల్లంఘించటంతో విలువైన ఖనిజాల ఉత్పత్తులను చైనా బంద్ చేయటంతో తిరిగి కాళ్లబేరానికి రావటాన్ని చూశాము. ఆస్ట్రేలియాలో లోవీ సంస్థ నిర్వహించిన సర్వేలో చైనా మనకు ఆర్థిక భాగస్వామితప్ప ముప్పుదేశం కాదని మెజారిటీ అభిప్రాయపడినట్లు తేలింది. చైనా అనేక దేశాలతో వాణిజ్య మిగులులో ఉంటే ఆస్ట్రేలియా ఎగమతులు ఎక్కువగా ఉన్నందున అది చైనాతో తగాదాకు ఏమాత్రం సిద్ధపడటం లేదు. ఉత్తర కొరియాను చూసి జపాన్ భయపడుతున్నది తప్ప చైనాతో వాణిజ్యాన్ని వదులుకొనేందుకు సిద్ధంగా లేదు. అమెరికా కనుసన్నల్లో నడిచే దక్షిణ కొరియా పరిస్థితి అంతే. ఇలాంటి వైఖరి వలన చైనా దగ్గర చులకన అవుతామన్న స్పృహ ఆయాదేశాల నేతలకు లేదా!
చైనాతో క్వాడ్ దెబ్బలాట – ముద్దులాట!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES