Friday, July 4, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుటెన్త్‌, ఇంటర్‌కు ఒకేబోర్డు!

టెన్త్‌, ఇంటర్‌కు ఒకేబోర్డు!

- Advertisement -

ఎస్‌ఎస్‌సీ బోర్డులో ఇంటర్‌ బోర్డు విలీనం?
రాష్ట్రంలో ఎన్‌ఈపీ అమలు దిశగా అడుగులు
సీబీఎస్‌ఈ మోడల్‌ అమలు చేయాలన్న కేంద్రం
జాతీయస్థాయిలోనే సిలబస్‌, ప్రశ్నాపత్రాల రూపకల్పన
అన్ని రాష్ట్రాల్లోనూ ఏకీకృత విధానం
9 నుంచి 12 తరగతులపై అధ్యయనం చేయాలన్న సీఎం

రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌కు వేర్వేరుగా బోర్డులు ఎందుకుండాలనే దిశగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాలోచన చేస్తున్నది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏకీకృత విధానం అమలు చేయాలని భావిస్తున్నది. అందులో భాగంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్‌కు ఒకే బోర్డు ఉండాలని ప్రతిపాదించింది. రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో కేంద్ర విద్యాశాఖ బుధవారం సమావేశాన్ని నిర్వహించింది. అందులో కీలకమైన ప్రతిపాదనలను అధికారుల ముందుంచింది. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ-2020) అమల్లో భాగంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. 5+3+3+4 విద్యావిధానాన్ని అమలు చేయాలని కోరింది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి. 20 రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌కు ఒకే బోర్డు ఉన్నది. కానీ ఎనిమిది రాష్ట్రాల్లో వేర్వేరుగా బోర్డులున్నాయి. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ వంటివి ఉన్నాయి. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. పదో తరగతి, 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే వార్షిక పరీక్షలను నిర్వహిస్తున్నది. 2024-25 విద్యాసంవత్సరం వరకు ఏడాది ఒకే సారి వార్షిక పరీక్షలను నిర్వహించింది. 2025-26 విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి, 12వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది.


సిలబస్‌, ప్రశ్నాపత్రాల రూపకల్పన కేంద్రీకృతం
పదో తరగతి, 12వ తరగతి సిలబస్‌తోపాటు ప్రశ్నాపత్రాల రూపకల్పన కూడా జాతీయ స్థాయిలోనే ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. అదే విషయాన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారుల దృష్టికి తెచ్చింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సిలబస్‌, ప్రశ్నాపత్రాల రూపకల్పన పూర్తిగా కేంద్రీకృతం అవుతుంది. రాష్ట్రాల హక్కులు హరించబడతాయి. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది. కానీ మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటున్నది. ఎన్‌ఈపీ అమలు పేరుతో రాష్ట్రాలకు హక్కుల్లేకుండా కేంద్రం నిర్ణయాలే అమలయ్యే విధంగా వ్యవహరిస్తున్నది.


ఇంటర్‌ విద్యావ్యవస్థ ఉండదు…
పదో తరగతి, ఇంటర్మీడియెట్‌కు వేర్వేరుగా బోర్డులు అవసరం లేదన్న అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. అది అమల్లోకి వస్తే బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌ (ఎస్‌ఎస్‌సీ)లో ఇంటర్‌ బోర్డు విలీనం అయ్యే అవకాశమున్నది. అదే జరిగితే రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ విద్యావ్యవస్థ ప్రత్యేకంగా ఉండదు.


ఇంటర్‌ విద్య వల్ల ప్రయోజనాలు
తెలంగాణలో ఇంటర్మీడియెట్‌ విద్యావ్యవస్థ ప్రత్యేకంగా ఉండడం వల్ల రాష్ట్రానికి, విద్యార్థులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు ప్రత్యేకతను చాటుతున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ), ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)లో తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు. మెరుగైన ర్యాంకులను సాధిస్తున్నారు. కార్పొరేట్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులతోపాటు గురుకుల విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు కూడా మంచి ర్యాంకులను పొందుతున్నారు. దీంతో తెలంగాణకు చెందిన ఎక్కువ మంది విద్యార్థులు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, మెడికల్‌ కాలేజీల్లో సీట్లు పొందుతున్నారు. ఇంటర్‌ విద్యావ్యవస్థ ఉండకపోతే ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులు సాధించే అవకాశం ఉండకపోవచ్చని పలువురు విద్యావ్తేత్తలు అభిప్రాయపడుతున్నారు.


రాష్ట్రంలో ఎన్‌ఈపీ అమలుకే మొగ్గు…
తెలంగాణలో ఎన్‌ఈపీని అమలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపిస్తున్నట్టు అర్థమవుతున్నది. ‘ఇతర రాష్ట్రాల్లో తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటుందనీ, అక్కడ డ్రాపౌట్స్‌ సంఖ్య తక్కువగా ఉంటుందనీ, పదో తరగతికికి, ఇంటర్మీడియట్‌కు బోర్డులు వేర్వేరుగా, 12వ తరగతి వరకు ఒకే బోర్డుగా ఉన్న రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేసి ఈ విధానంపై సమగ్ర నివేదిక సమర్పించాలి’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖ అధికారులను బుధవారం ఆదేశించారు. దీన్ని బట్టి రాష్ట్రంలో ఎన్‌ఈపీ అమలు దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తున్నది. కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతున్నది.


కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లు, గురుకులాల్లో 12వ తరగతి
రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ, పంచాయతీరాజ్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పదో తరగతి వరకు ఉన్నది. కానీ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), మోడల్‌ స్కూళ్లు, గురుకుల విద్యాసంస్థల్లో 12వ తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలల్లోనూ 12వ తరగతి వరకు విద్యనందిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి కేంద్రం వచ్చింది. అందుకే పాఠశాల విద్యలో ఇంటర్‌ విద్యను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు తెలిసింది.

ఒకేషనల్‌ విద్యకు ప్రాధాన్యత
దేశవ్యాప్తంగా ఒకేషనల్‌ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. తెలంగాణలో పదో తరగతి వరకు ఒకేషనల్‌ విద్య అందుబాటులో లేదు. ఇంటర్మీడియెట్‌ స్థాయిలో విద్యార్థులు ఒకేషనల్‌ కోర్సుల్లో చేరేందుకు అవకాశమున్నది. ఎన్‌ఈపీలో భాగంగా ఎనిమిదో తరగతి నుంచే ఒకేషనల్‌ విద్యను అభ్యసించే వెసులుబాటును కల్పిస్తామని కేంద్రం అంటోంది. నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ)కు అనుసంధానమై ఒకేషనల్‌ కోర్సులను చేస్తే విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇస్తారనీ, అవి దేశమంతా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్రాల ప్రమేయమే లేకుండా చేస్తున్నది.


కేంద్రం ప్రతిపాదనను పరిశీలిస్తాం : నవీన్‌ నికోలస్‌
పదో తరగతి, ఇంటర్మీడియెట్‌కు ఒకే బోర్డు ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్‌ నికోలస్‌ గురువారం తనను కలిసిన విలేకర్లతో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరిస్తామని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -