Friday, July 4, 2025
E-PAPER
Homeక్రైమ్సిగాచి దుర్ఘటనలో లభించని 10 మంది ఆచూకీ

సిగాచి దుర్ఘటనలో లభించని 10 మంది ఆచూకీ

- Advertisement -

– నాలుగు రోజులుగా వెతుకులాట
– తమ వాళ్ల కోసం కుటుంబీకుల ఆందోళన
– కంపెనీ వద్దకు రావద్దు.. మృతదేహం దొరికితే ఇస్తామంటూ యాజమాన్యం గెంటివేత
– సమస్య చెప్పుకోకుండా మీడియా పాయింట్‌ ఎత్తివేత
– ప్రమాద ఘటనపై నిపుణుల కమిటీ విచారణ
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

సిగాచి కెమికల్‌ పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదంలో 10 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు నాలుగు రోజులుగా తమ వారి కోసం వెతుకుతూనే ఉన్నారు. మృతదేహాలను గుర్తించడంలో జాప్యం జరగడంతో మార్చురీ వద్ద పడిగాపులు కాస్తున్నారు. పాశమైలారం కంపెనీ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నప్పటికీ ఆచూకీ లేని తమ వాళ్ల కోసం ఎదురు చూస్తున్న కుటుంబీకులు, బంధువులను అక్కడ ఉండకుండా గురువారం కంపెనీ యాజమాన్యం గెంటి వేసింది. దీంతో బాధిత కుటుంబీకులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. తమ వాళ్ల ఆచూకీ కోసం కంపెనీ వద్ద ఎదురు చూడటం, హెల్ప్‌లైన్‌ వద్ద సమాచారం అడిగినా అధికారులు, కంపెనీ ప్రతినిధుల నుంచి సరైన సమాచారం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీడియా వాళ్లకైనా తమ గోసను వెల్లడించేందుకు యత్నించగా కంపెనీ వద్ద ఏర్పాటు చేసిన మీడియా పాయింట్‌ను పోలీసులు ఎత్తేశారు. అయితే ఘటన జరిగిన ప్రాంతం పక్కనే మీడియా ఉండటం వల్ల ఆచూకీి లేని వారి సమస్యను ఎక్స్‌పోజ్‌ చేస్తున్నారన్న నెపంతో మీడియా వాళ్లను ప్రమాదం జరిగిన కంపెనీ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వట్లేదు. కాగా శిథిలాల తొలగింపులో కొన్ని శరీర భాగాలు దొరికాయి. అయితే అవి ఎవరివనేది ఫోరెన్సిక్‌ పరీక్షలు చేశాక నిర్థారించాల్సి ఉంది. తమ వాళ్లు బతికున్నారా? లేక చనిపోయారా? సమాచారం చెప్పకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిల్లో బంధువులు పడిగాపులు కాస్తున్నారు. చనిపోతే కనీసం మృతదేహాలైనా అప్పజెప్పాలంటూ వేడుకుంటున్నారు.


ప్రమాదంపై నిపుణుల కమిటీ విచారణ
సిగాచి కెమికల్‌ పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదంలో ఇప్పటి వరకు 42 మంది చనిపోవడం, 10 మంది ఆచూకీ లభించకపోవడంతో ప్రభుత్వ విచారణ కోసం నిపుణుల కమిటీ వేసిన విషయం విధితమే. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం కమిటీ చైర్మెన్‌ వెంకటేశ్వర్‌రావు, కమిటీ సభ్యులు ప్రతాప్‌్‌, సూర్యనారాయణ, సంతోష్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల పరిస్థితుల్ని పరిశీలించారు. కారణాలను విశ్లేషించడంతో పాటు కార్మికుల భద్రతకు నిబంధనలు పాటించారా..? లేదా అనే విషయాలపై ఆరా తీశారు. పేలుళ్లకు గల కారణాలేమిటీ..?

ఇలాంటి భారీ ప్రమాదం పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన నివేదికను నెల రోజుల్లో ఇవ్వాల్సి ఉంది. కాగా, బృందం రెండు గంటల పాటు ఘటనా స్థలంలో శాంపిళ్లను సేకరించింది. ప్రమాదం గురించి అధికారులతో మాట్లాడింది. కంపెనీలో కలియ తిరిగిన కమిటీ.. బాయిలర్‌లో ఒత్తిడితో ప్రమాదం జరిగిందా..? అన్న కోణంలో దర్యాప్తు చేసింది. ప్రమాదం తీరు, ప్రమాదానికి గల కారణాలకు సంబంధించిన విషయాలను అన్వేషించింది. డ్రయ్యర్‌, రియాక్టర్‌కు సంబంధించిన అంశంలో ఏమైనా లోపాలు జరిగాయా..? సాంకేతిక కారణాలేమైనా ఉన్నాయా..? అనేది పరిశీలించడం కోసం కొన్ని ఆధారాల్ని సేకరించినట్టు తెలుస్త్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -