Friday, July 4, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ప్రాథమిక హక్కుల రక్షణకు పోరాటాలు

ప్రాథమిక హక్కుల రక్షణకు పోరాటాలు

- Advertisement -

నాలుగు లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలి కేంద్రం కార్పొరేట్‌ అనుకూల, మతోన్మాద చర్యలు వీడాలి
రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయని బీజేపీ
సార్వత్రిక సమ్మెలో కార్మికవర్గం కదం తొక్కాలి :తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక సదస్సులో తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-సూర్యాపేట

ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ప్రజాపోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం చెప్పారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పొరేట్‌ అనుకూల, మతోన్మాద చర్యలను విడనాడాలని డిమాండ్‌ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లువెంకట నరసింహారెడ్డి భవన్‌లో గురువారం తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని ప్రసంగిస్తూ.. కార్మికవర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాల్లో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందన్నారు. వాటిని అమలు చేసి కార్మికవర్గ హక్కులను హరించే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2025 -26 బడ్జెట్‌లో కార్పొరేట్‌ అనుకూల విధానాలకు అనుగుణంగానే కేటాయింపులు చేసిందని వివరించారు.


ఉద్యోగాలపై మోడీ శ్వేత పత్రం విడుదల చేయాలి
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ పదకొండేండ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ భారతదేశంపై ఆంక్షలు విధిస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహిస్తున్నారని విమర్శించారు. ట్రంప్‌ చర్యల మూలంగా దేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజానీకం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్‌ మల్లు నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు, నాయకులు కోలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ములకలపల్లి రాములు, మట్టిపెళ్లి సైదులు, కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ చెరుకు ఏకలక్ష్మి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకటరెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


మద్దతు ధరల చట్టం చేయాలి
భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కార్మికవర్గం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని తమ్మినేని పిలుపునిచ్చారు. రైతు పండించిన పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెస్‌ స్వామినాథన్‌ సిఫారసులను అమలు చేయడంలో ఎన్డీఏ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఢిల్లీలో రైతులు పోరాటం చేసిన సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తోందన్నారు. వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి సమగ్ర శాసన చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న ఏడాదికి రూ.12,000 ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచి 16 రకాల నిత్యావసర వస్తువులను పేదలందరికీ అందించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -