Friday, July 4, 2025
E-PAPER
Homeబీజినెస్లక్ష మంది టెకీలపై వేటు

లక్ష మంది టెకీలపై వేటు

- Advertisement -

ఆరు నెలల్లోనే కోతలు
– ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన
వాషింగ్టన్‌:
టెక్నాలజీ రంగంలోని కంపెనీలు భారీ లాభాలను గడిస్తున్నప్పటికీ.. మరింత ఆదాయాల కోసం పొదుపు చర్యలకు దిగుతు న్నాయి. ఈ క్రమంలోనే వేలాది మంది ఉద్యోగుల కు ఉద్వాసన పలుకుతున్నాయి. కేవలం ఆరు నెలల సమయంలోనే లక్ష మంది పైగా ఉద్యోగుల పై వేటు వేశాయని రిపోర్టులు వచ్చాయి. గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో వేలాది మందిని రోడ్డున పడేసిన కంపెనీలు.. తాజాగా కృత్రిమ మేధను బూచీగా చూపి, అదే విధంగా పునర్‌ వ్యవస్థీకరణ పేరుతో వేటు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఇప్పటికే లక్ష మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. అత్యధికంగా సిబ్బందిపై వేటు వేసిన వాటిలో మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, మెటా, ఇంటెల్‌ వంటి సంస్థలున్నాయి.


టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 4 శాతానికి సమానమైన 9,100 మందిని తొలగిస్తున్నట్లు ఈ వారంలోనే తెలిపింది. ఈ ఏడాదిలో తొలగింపులు నాలుగో సారి కావడం ఆందోళనకరం. జనవరిలో 1 శాతం మందిని తొలగించగా.. మేలో 6,000 మందిని, జూన్‌లోనూ 300 మంది సిబ్బందిపై వేటు వేసింది. గతేడాది కూడా ఈ కంపెనీ దాదాపు 10,000 మందిని అర్ధంతరంగా తొలగించింది.


ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్‌ ఇప్పటికే జర్మనీలోని ఆటోమోటివ్‌ చిప్‌ యూనిట్‌ ను మూసేసి అందులోని మొత్తం సిబ్బందిని తొలగించింది. కంపెనీ హెడ్‌ క్వార్టర్స్‌లోనూ దాదాపు 100 మందికి ఎసరు పెట్టింది. జులై మధ్యలో కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం సిబ్బందిలో 20శాతం మందిని ఇంటికి పంపించే పనిలో ఉంది. అమెజాన్‌ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగు సార్లు ఉద్వాసనలు చేపట్టింది. ఆయా దశల్లో మొత్తంగా 14,000 మంది పైగా సిబ్బందిపై వేటు వేసింది. రానున్న రోజుల్లోనూ మరింత ఎక్కువ తొలగింపులు ఉండొచ్చని సంకేతాలు ఇచ్చింది. ఐబిఎం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 8.000 మందిని తొలగించింది. భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్‌ ఇటీవల 240 మంది ఎంట్రీ లెవల్‌ ఉద్యోగులను తొలగించింది. ఫిబ్రవరిలోనూ 300 మంది ప్రెషర్స్‌ను ఇంటికి పంపించింది. గూగుల్‌ వరుస ఉద్వాసనలకు పాల్పడినప్పటికీ స్పష్టమైన సంఖ్య బయటికి రాలేదు. మెటా దాదాపు 3600 మంది సిబ్బందిని రోడ్డున పడేసింది. హెచ్‌పి 2000 మందిని తొలగించింది. టిక్‌టాక్‌ తన డబ్లిన్‌ కార్యాలయంలో 300 మందిపై వేటు వేసింది. ఓలా ఎలక్ట్రిక్‌ వెయ్యి మందికి పైగా ఉద్యోగులకు కోత పెట్టింది. సేల్స్‌ఫోర్స్‌, బ్లూఆర్జిన్‌ సంస్థలు 1000 మంది చొప్పున తొలగించాయి. ఈ పరిణామాలు టెకీలను బెంబేలెత్తిస్తున్నాయి. తమ ఉద్యోగం ఎప్పుడు ఊడుతోందోననే భయాందోళనలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -