– నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్
– గోడపత్రిక ఆవిష్కరణ
నవతెలంగాణ-హిమాయత్ నగర్
కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని ఈ నెల 9న కార్మిక సంఘాలు తలపెట్టిన జాతీయ సార్వత్రిక సమ్మెకు వామపక్ష యువజన సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనాలని నిర్ణయించాయి. సమ్మె గోడ పత్రికను ఏఐవైఎఫ్, డీవైఎఫ్‌ఐ, పీవైఎల్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఎన్.సత్య నారాయణరెడ్డి భవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడ్‌లను రద్దు చేయాలని తలపెట్టిన సమ్మెకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ.. కేంద్రంలో మూడోసారి నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక యువతకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. ప్రధానంగా ఉపాధి, ఉద్యోగ నిలయాలైన ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా మూసివేసి, కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ వేశారని విమర్శించారు. ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రయివేటీకరణ, మూసివేతతో లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారని, దీని ప్రభావం వల్ల కోట్లాది మంది ప్రజలు ప్రత్యక్షంగా నష్టపోయారని తెలిపారు. పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు కె.ఎస్.ప్రదీప్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, రానున్న రోజుల్లో దేశంలోని యువత మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలన్నారు. సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా యువజనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, పీవైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.రవికుమార్ పాల్గొన్నారు.
సమ్మెకు వామపక్ష యువజన సంఘాల మద్దతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES