– హైదరాబాద్‌లో దుర్భర స్థితిలో రోడ్లు
– పద్మవ్యూహం మాదిరి ట్రాఫిక్
– మూసుకుపోయిన వరద దారులు
– పొంచి ఉన్న ముంపు ముప్పు..?
– ప్రతి వర్షాకాలం అస్తవ్యస్తమేనా..
– పాదచారుల కోసం ఏర్పాటు చేసిన రోడ్లూ ఆక్రమణ
గ్రేటర్‌లో చినుకు పడితే చాలు చిత్తడవుతోంది.. చిన్నపాటి వర్షం వచ్చినా పలు కాలనీలు నీట మునుగుతున్నాయి.. గట్టి వర్షం పడితే రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ పద్మవ్యూహంగా మారుతోంది. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ఇరుక్కుపోవాల్సిందే.
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ పరిధిలో ప్రతి వర్షాకాలం అస్తవ్యస్తమౌతుంది. చాలా ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరుతోంది. గడిచిన మూడు నాలుగేండ్లలో భారీ వర్షాలు నగరవాసులను రోజుల తరబడి మురుగు నీటిలో ఉండేలా చేశాయి. అయినా జీహెచ్‌ఎంసీ అధికారుల తీరు ఆశించినంతగా మార్పు లేకపోవడంతో నగర వాసులు ఈ వర్షాకాలం గట్టెక్కేదెలా? అని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే రెండ్రోజుల నుంచి నగరంలో కురుస్తున్న వర్షాలకు అతలాకుతలం అవుతోంది. ఇక వర్షాలు భారీగా పడితే పరిస్థితి ఎంటని నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
జోరుగా అక్రమ నిర్మాణాలు
నగరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. పార్కులు, ఖాళీ స్థలాలు, గుట్టలు, నాలాలను, చివరకు ఆలయా లను సైతం కబ్జా చేస్తున్నారు. దీనికి తోడు హైదరాబాద్‌లో వరదనీరు బయటకు పోయేందుకు సరైన ఏర్పాట్లు లేవు. ఈ విషయం చాలా సర్వేల్లో తేలింది. నిజాం పాలకులు హైదరా బాద్‌లో రెయిన్‌వాటర్ మేనేజ్‌మెంట్‌ని చేపట్టారు. నీళ్లు చెరువు ల్లోకి, కుంటల్లోకి పోయేలా రోడ్ల పక్కన డ్రెయిన్లు కట్టించారు. నగరంలో 9వేల కిలోమీటర్ల రోడ్లలో 5వేల కిలో మీటర్ల ప్రధాన రోడ్లుండగా, దాదాపు 10వేల కిలోమీటర్ల మేర వర్షం నీటి డ్రైన్లు అవసరం ఉంది. కానీ గ్రేటర్లో వెయ్యి కిలో మీటర్లే వర్షం నీటి డ్రైన్‌లున్నాయి. అయితే, భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాలకు గురవడం, మరో వైపు రోడ్లును విస్తరిస్తున్న క్రమంలో డ్రెయిన్ వాటర్ లైన్లు కనిపించకుండా పోతున్నాయి. ఇక అభివృద్ధి పేరుతో అపార్ట్‌మెంట్లు, కాంప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్ ఇలా వాణిజ్య వ్యాపార భవంతులు వెలుస్తుండటంతో చినుకు పడితే నగరంలోని రోడ్లన్నీ చెరువు లను తలపిస్తున్నాయి. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన రోడ్లు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. మంత్రులు, ప్రజాప్రతిని ధులు, అధికారుల కండ్లెదుట ఆక్రమణలు కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
ఇంకా కండ్లముందే ఆ దృశ్యాలు
2020, 2021, 2022, 2023లో వచ్చిన భారీ వర్షాలతో గ్రేటర్ పరిధిలో చాలా ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరి రోజుల తరబడి నిలిచిపోయిన విషయం తెలిసిందే. వందలాది కాలనీలు నిటమునిగి, బురదమయంగా మారాయి. చాలా ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బందాలు రంగంలోకి దిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2020లో 1500కు పైగా కాలనీలు, బస్తీలు, 2021లో 1500 నుంచి 2000 కాలనీలు, బస్తీల్లో వరదలు వచ్చాయి. 2022లో 100 వరకు కాలనీలు, బస్తీలు ముంపు బారిన పడ్డాయి. 2023, 2024లో సైతం వరదలు గ్రేటర్‌ను ముంచెత్తాయి. నాటి బాధ లు అనుభవించిన వారికి ఇప్పటికి ఆ దృశ్యాలు కండ్ల్ల ముందు కదలాడుతు న్నాయి. గంటలో రెండు సెంటిమీటర్లకు మించి వర్షం పడిందంటే చాలు నాలాలు, డ్రయినే జీలు పొంగిపోర్లుతాయి. ఎన్నేండ్లు గడి చినా వరద సమస్యలకు చెక్ పడటం లేదు.
ఇప్పటికీ అదే పరిస్థితి
నగరంలో భారీ వర్షం వస్తే ఎన్ని ప్రాంతాలు సేఫ్ అంటే బల్దియాలో ఏ అధికారీ చెప్పలేని పరిస్థితి. గ్రేటర్లో ఉన్న నాలాల్లో పూడిక తీత పనులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ విషయాన్ని గత బల్దియా సమావేశంలో కార్పొరేటర్లే ప్రశ్నించారు. వర్షాలు ప్రారంభమైనా ఇంకా 25 శాతం నాలాల పూడిక తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా నాలాలు కొట్టుకుపోయిన సంఘటనలు న్నాయని, నాలా ప్రమాదంలో మహిళలు, బాలికలు, వృద్ధులు మృతిచెందిన విషయాన్ని కార్పొరేటర్లు గత సమావేశంలో ప్రస్తావించారు. నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నాలాల పరిస్థితి అలానే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కొద్ది రోజులు హడావుడి
జంట నగరాల్లో కొన్ని రోజుల కిందట పలువురు ప్రజాప్రతినిధులు నీట మునిగిన ప్రాంతాల వాసులను పరామర్శించేందుకు వెళితే ప్రజలు నిలదీశారు. వర్షాకాలం రావడానికి ముందే అవసరమైన మరమ్మతులు చేసి.. రోడ్లతోపాటు పలు ఏరియాల్లో నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకుంటే బాగుండేదని పలువురు కోరుతున్నారు. కానీ సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో విమర్శలకు తావిస్తోంది. తీరా వర్షాకాలం వచ్చిన తర్వాత చాలా చోట్ల గుంతలను, రోడ్లును మరమ్మతు చేస్తుండటం గమనార్హం. అయితే, పేదలు ఉంటున్న చోట నీరు నిలుస్తున్నా పట్టించుకోవడం లేదు. మురికి నీరు, డ్రయినేజీ నీరు రోడ్లపై నిలిచి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. మంచి నీరు కలుషితం అవుతోంది. జనం రోగాల పాలవుతున్నారు. ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.
ప్రత్యేక డ్రయినేజీ వ్యవస్థ ఎక్కడా?
గ్రేటర్‌లో భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. దానికితోడు గొలుసుకట్టు చెరువులు చాలా వరకు వాటి విస్తీర్ణాన్ని కోల్పోయాయి. ప్రతి రోడ్డుపై స్ట్రామ్ వాటర్ డ్రైన్ తప్పనిసరి కానీ గ్రేటర్ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికి వర్షం నీరు వెళ్లేందుకు ప్రత్యేక డ్రయినేజీ వ్యవస్థ లేదు. నాలాలు ఆక్రమణలకు గురవుతున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.