Friday, July 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాజ్యాంగం రద్దుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కుట్రలు

రాజ్యాంగం రద్దుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కుట్రలు

- Advertisement -

– బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై పెరిగిన దాడులు
– 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు : కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌ బాబు
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ

రాజ్యాంగం రద్దుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని, బీజేపీ విధానాలను ప్రజలు ప్రతిఘటించాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు పిలుపునిచ్చారు. ములుగు జిల్లా ఏటూర్‌నాగారం మండల కేంద్రంలో కేవీపీఎస్‌ నాయకులు అంబాల మురళి అధ్యక్షతన నిర్వహించిన ములుగు జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోతున్నాయన్నారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఇద్దరు దళిత యువకులు ఆవు దూడలను తీసుకెళ్తుండగా గోరక్షక దళాల ముసుగులో ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద గుండాలు వారిపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఆ ఇద్దరు దళితులకు అరగుండు కొట్టించి బలవంతంగా మురుగునీటిలో ముంచి మోకాళ్లపై ఊరిలో నడిపించి గడ్డి తినిపించడం వంటి చిత్రహింసల పాలు చేసినట్టు చెప్పారు. గోరక్షక దళాలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాయని అన్నారు. గోరక్షక దళాలను తక్షణమే నిషేధించి, ఆ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గోరక్షక దళాలు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రోత్బలంతోనే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ కింద 19 వేల మంది దళిత విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.154 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని, రైతాంగ పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని. వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పిస్తూ రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా జులై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌, జిల్లా అధ్యక్షులు ఎండీ దావుద్‌, కేవీపీఎస్‌ జిల్లా నాయకులు రత్నం ప్రవీణ్‌, గుగ్గిళ్ల దేవయ్య, వ్యాసం రమేష్‌, దేవేందర్‌, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -