డాబర్ చ్యవన్‌ప్రాస్‌పై పతంజలికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : డాబర్ చ్యవన్‌ప్రాస్‌పై ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాపార ప్రకటనలు చేయవద్దని ఢిల్లీ హైకోర్టు పతంజలిని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాబాహుళ్యం కలిగిన తన ఉత్పత్తి గురించి పతంజలి సంస్థ అవమానకరమైన ప్రకటనలు చేస్తోందని ఆరోపిస్తూ డాబర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మిని పుష్కర్న ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయుర్వేద గ్రంథాలు, ప్రాచీన ఇతిహాసాల ప్రకారం తాము మాత్రమే చ్యవన్‌ప్రాస్‌ను తయారు చేస్తున్నామని పతంజలి ప్రకటనలు ఇచ్చింది. దాబర్ వంటి ఇతర బ్రాండ్లకు ప్రామాణిక పరిజ్ఞానం లేదని చెప్పింది. దీనిపై దాబర్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రకటనలపై తక్షణమే స్టే ఇవ్వాలని అభ్యర్థించింది. తన బ్రాండ్ ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు రెండు కోట్ల రూపాయల పరిహారం ఇప్పించాలని కూడా కోరింది.
పతంజలి చ్యవన్‌ప్రాస్ మాత్రమే నిజమైన ఉత్పత్తి అని అర్థం వచ్చేలా తప్పుడు ప్రకటన ఇచ్చారని దాబర్ తన పిటిషన్‌లో తెలిపింది. తమ చ్యవన్‌ప్రాస్ ‘ఆర్డినరీ’ నలభై వనమూలికలతో తయారైందని కూడా పతంజలి ఆ ప్రకటనలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇలాంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తాయని, కఠినమైన నియంత్రణ ప్రమాణాలతో తయారైన ఉత్పత్తులపై విశ్వాసాన్ని తగ్గిస్తాయని దాబర్ తన పిటిషన్‌లో తెలిపింది. తప్పుడు ప్రకటనలపై నిషేధాన్ని విధించిన ఢిల్లీ హైకోర్టు కేసు తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. పతంజలి ప్రకటనలపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన కేసు విషయంలో కూడా కోర్టు పతంజలిపై మొట్టికాయలు వేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులపై తప్పుడు ప్రకటనలు ఇవ్వబోమని బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ హామీ ఇవ్వడంతో కోర్టు ధిక్కరణ చర్యలను నిలిపివేసింది.
తప్పుడు ప్రకటనలు ఆపండి
- Advertisement -
- Advertisement -