జిల్లా కలెక్టర్ హనుమంతరావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ తెలిపారు. శుక్రవారం రోజు జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్దంతి , కొణిజెటి రోశయ్య జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దొడ్డి కొమురయ్య, కొణిజెటి రోశయ్య చిత్రపటాలకు కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో నేల రాలిన తొలి అమరుడని అన్నారు.
నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగుర వేసేందుకు ప్రాణాలు పణంగా పెట్టిన గొప్ప యోధుడు కొమురయ్య అని తెలిపారు. ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైయస్సార్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారని అన్నారు. ఆర్థిక శాఖ తోపాటు రోడ్లు భవనాలు రవాణా శాఖ మంత్రిగా హౌసింగ్ శాఖ మంత్రిగా విద్యుత్ శాఖ మంత్రిగా హోమ్ మినిస్టర్ వైద్య ఆరోగ్యం, విద్యాశాఖ మంత్రిగా కూడా కొంతకాలం తన సేవలు అందించారని తెలిపారు.
వైయస్సార్ హఠాన్మరణం తర్వాత ముఖ్యమంత్రిగా కొంత కాలం సేవలు అందించారని, అనంతరం తమిళనాడు గవర్నర్ గా పని చేసారని తెలిపారు. మహనీయులను ఒక కులానికో, ఒక వర్గానికో పరిమితం చేయకుండా.. ఆయన ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి యాదయ్య, ఈడి ఎస్సీ కార్పొరేషన్ అధికారి శ్యామ్ సుందర్, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి జగన్ మోహన్ ప్రసాద్, కలెక్టరెట్ సిబ్బంది పాల్గొన్నారు.