కలెక్టరేటులో నామమాత్రంగా దొడ్డి కొమురయ్య వేడుకలు…
జయంతి, వర్ధంతులను ప్రతి గ్రామంలో అధికారికంగా నిర్వహించాలి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : వీర తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వీర గాధను పాఠ్యాంశాల్లో చేర్చి భవిష్యత్ తరాలకు అందించాలని జి.ఎం.పి.యస్. జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెపురం రాజు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సందర్భంగా భువనగిరి జగదేవ్పూర్ చౌరస్తాలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి జిఎంపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఆనాడు తెలంగాణ ప్రాంతంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకీరీ నుండి విముక్తి కోసం కుల, మతాలకు అతీతంగా మట్టి మనుషులు సైతం ఆయుధాలు పట్టుకొని సాయుధ పోరాటంలో పాల్గొని ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు కులం తోకలు, మత రంగులు పులిమి తమ రాజకీయ ప్రయోజనాల కోసం పాలకవర్గాలు వాడుకుంటున్నాయని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమానికి సామాజిక ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలను పిలవకుండా అవమానించి నామమాత్రంగా నిర్వహించారని ఆరోపించారు.
భవిష్యత్తులో జరుగబోయే మహనీయుల జయంతి వర్ధంతి ఉత్సవాలు ప్రతి గ్రామంలో జరిగేలా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని, జిల్లా కేంధ్రంలో ఎకరం భూమి కేటాయించి దొడ్డి కొమురయ్య కాస్య విగ్రహం, విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దయ్యాల నర్సింహ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బుడుమ శ్రీశైలం, మద్దెపురం బాల నర్సింహ్మ, జిల్లా కమిటీ సభ్యులు ర్యాకల శ్రీనివాస్, జెట్ట చిరంజీవి, దేవనూరి బాలయ్య, పాక జహాంగీర్, క్యాసాని నవీన్, పర్వతి దశరథ, అశోక్, ఆంజనేయులు, బుడుమ సురేష్, తోటకూర రవీందర్, ఐతరాజు నాగరాజు పాల్గొన్నారు.