Saturday, July 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రాజెక్టులకు బీటలు

ప్రాజెక్టులకు బీటలు

- Advertisement -

ప్రజాప్రతినిధుల వైఫల్యం వల్లే సాగునీటి సమస్య
నిధులు కేటాయించి..పనులు పూర్తి చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌
జూరాల గేట్లను పరిశీలించిన పార్టీ బృందం
నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి/ జోగులాంబ గద్వాల

సీఎం సొంత జిల్లాలో నిధుల్లేక.. పనులు సాగక.. నిర్వహణ లేక ప్రాజెక్టులు బీటలు బారుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ముఖ్యమంత్రిగా మహబూబ్‌నగర్‌ జిల్లా వాసి ఎనుముల రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా ప్రాజెక్టులకు ఒరిగిందేమీ లేదనీ, నిర్వహణ లోప భూయిష్టంగా ఉందని తెలిపారు. శుక్రవారం జూరాల గేట్ల నిర్వహణను సీపీఐ(ఎం) నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, గద్వాల జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, నారాయణపేట జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. అనంతరం మాట్లాడుతూ.. నిధులు లేక ప్రాజెక్టుల నిర్వహణ భారంగా మారిందని, ప్రతి ఏటా వేసవిలో రోప్‌లకు గ్రీస్‌ పెట్టాల్సి ఉండగా డాంబర్‌తో సరి పెట్టడం అత్యంత దారుణమని చెప్పారు. గ్రీస్‌ పెట్టకపోవడం వల్లే తుప్పు పట్టి రోప్‌లు తెగిపోతున్నాయని తెలిపారు.


జూరాల ప్రాజెక్టు విషయంలో అధికారులు, కాంట్రాక్టర్ల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న మరమ్మతులపై నిర్లక్ష్యం వహిస్తే పెనుముప్పు తప్పదని హెచ్చరించారు. పాలమూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి ఈ జిల్లా ప్రాజెక్టులను వేగవంతం చేస్తారని అందరూ భావించారన్నారు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి నిధుల కేటాయింపులు అరకొరగానే ఉన్నాయన్నారు. నిర్లక్ష్యం కారణంగానే మూడు నెలల కిందట ఎస్‌ఎల్బీసీలో ప్రమాదం జరిగి 8 మంది చనిపోయారని, వారి మృతదేహాలు కూడా బయటపడలేదని అన్నారు. ఇంతలోనే జూరాల గేట్ల రోప్‌వేల మొరాయింపుపై ఆందోళన వ్యక్తం చేశారు.
పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. జిల్లాకు రావాల్సిన 175 టీఎంసీల నీటిని ఎందుకు ఉపయోగించుకోవడం లేదని ప్రశ్నించారు. జూరాలలో పూడిక పేరుకుపోవడం వల్ల 9.896 టీఎంసీలకు కేవలం 5 టీఎంసీలే వాడుకుంటున్నామన్నారు. ఐదేండ్లకోసారి మార్చాల్సిన రోప్‌లను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. నిధుల కొరత, నిర్వహణ లోపం వల్ల ఏటా రెండు టీఎంసీల నీరు వృథాగా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టులో పేరుకుపోయిన మట్టిని తొలగించి పూర్తిస్థాయిలో సాగునీరందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి రైతులకు పరిహారం చెల్లించి జూరాల సామర్థ్యాన్ని పెంచాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -