Saturday, July 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురైతు రాజ్యం పైచర్చకు సిద్ధం

రైతు రాజ్యం పైచర్చకు సిద్ధం

- Advertisement -

మోడీ- కేసీఆర్‌ ఎవరొచ్చినా రెడీ
పార్లమెంటు, అసెంబ్లీ ఎక్కడైనా సరే…
సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రైతు రాజ్యం ఎవరిదో తేల్చుకునేందుకు చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. అటు పార్లమెంట్‌, ఇటు అసెంబ్లీలో ఎక్కడికైనా సరే, ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్‌ ఎవరొచ్చినా చర్చకు తాము సిద్ధమని తేల్చిచెప్పారు. రైతు భరోసా పథకం ఎప్పుడు విఫలమవుతుందోనని కొందరు గోతికాడి నక్కల్లా ఎదురు చూశారని అన్నారు. కానీ కేవలం 9 రోజులల్లోనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు.


శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సమరభేరి సభలో ఆయన మాట్లాడారు. కల్వకుంట్ల కోటలను కాంగ్రెస్‌ కార్యకర్తలు బద్దలు కొట్టారని అన్నారు. కార్యకర్తల కష్టం ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇదే ఎల్బీ స్టేడియంలో ఇంది రమ్మ రాజ్యం ఏర్పడిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం మూణ్ణాళ్ల ముచ్చటేననీ, సంక్షేమ పథకాలు ఎక్కువ రోజులు అమలు చేయలేరం టూ విమర్శలు చేశారని తెలిపారు. కాంగ్రెస్‌ వాళ్లు కలిసి ఉండలేరనీ, వాళ్లలో వాళ్లే కొట్టుకుం టున్నారని ప్రచారం చేశారనీ, కానీ నవ్వినోడి ముందే తలెత్తుకునేలా పాలన చేస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే కుల గణన చేసి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణలో దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు. కలిసికట్టుగా ముందు కెళ్తూ అందరి అపోహలు పటాపంచలు చేశామని తెలిపారు. తెలంగాణలో తమకు తిరుగులేదని విర్రవీగిన బీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టామని చెప్పారు.


గొర్రెలు, బర్రెలు కాచుకోవాలా?
వందలాది మంది బలిదానంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యువత ఉద్యోగాలు అడిగితే కేసీఆర్‌ గొర్రెలు, బర్రెలు పెంచుకోమన్నారని ఆవేదన వ్యక్తం చేవారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. అందులో ఒక్కటి తప్పినా తాను వారి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతానన్నారు. ఉద్యోగ నియామకాలపై చర్చకు వచ్చేందుకు కేసీఆర్‌, కిషన్‌రెడ్డికి దమ్ముందా? అని సవాల్‌ విసిరారు. పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే కొందరు రాద్ధాంతం చేస్తున్నారనీ, ఆమె గొప్పతనం వారికి తెలిసేలా చెప్పాల్సింది కాంగ్రెస్‌ కార్యకర్తలేనని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, సన్న బియ్యం వంటి అనేక హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల కష్టాలు, ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు.


బీఆర్‌ఎస్‌పై యుద్ధమే..
కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, చేస్తున్న అభివృద్ధిపై తాము విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యకర్తలు ఆపని చేయాలని దిశానిర్దేశం చేశారు. దుబారు నుంచి బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో ఆ పార్టీపై యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాడండి
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పోరాడాలని చెప్పారు. వారిని గెలిపించే బాధ్యత తనదేనన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలకు అన్ని పదవులు దక్కే వరకు విశ్రమించబోనని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ సీట్లు 119 ఉన్నాయనీ, నియోజకవర్గాల పునర్విభజనతో సీట్ల సంఖ్య 153కు పెరుగుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 100 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందులో ఒక్కటి తగ్గినా తనదే బాధ్యత అనీ, ప్రజాసేవలో ఉన్న వారికే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయనీ, దీనివల్ల వారికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో 15 పార్లమెంట్‌ స్థానాలను దక్కించుకుంటామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -