Saturday, July 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమోడీవన్నీ అబద్ధాలే..

మోడీవన్నీ అబద్ధాలే..

- Advertisement -

42 దేశాల్లో పర్యటించినా మణిపూర్‌ వెళ్లే ధైర్యం లేదు
ఉగ్రవాదంపై అఖిలపక్షానికి ప్రధాని ఎందుకు రాలేదు?
పాక్‌పై యుద్ధంలో ట్రంప్‌ వ్యాఖ్యల్ని ఖండించలేదు
హైదరాబాద్‌కు కేంద్రం చేసిందేం లేదు
మోడీ, అమిత్‌షా ఢిల్లీ నుంచి పారిపోయే రోజులు వస్తారు : సామాజిక సమరభేరిలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రధాని నరేంద్రమోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయన చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతనే ఉండదని తీవ్రంగా విమర్శించారు. ఉగ్రవాదంపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 42 దేశాల్లో పర్యటించిన ఆయనకు స్వదేశంలోని మణిపూర్‌ రాష్ట్రాన్ని సందర్శించే తీరిక, ధైర్యం లేవని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలను రోడ్ల పాలు చేసి విదేశీ నాయకులను కౌగిలించుకు ంటున్న మోడీ, కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా ఢిల్లీ వదిలి పారిపోయే రోజు వస్తుందని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమరభేరి సభలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు.


ప్రతిపక్ష పార్టీలతో సహా యావత్‌ దేశం ఒక్కటిగా నిలబడిప్పటికీ ఆపరేషన్‌ సిందూర్‌ను మధ్యలో ఎందుకు ఆపారని ప్రశ్నించారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదాన్ని అంతం చేస్తామంటూ పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించిన సర్కార్‌ వెనుకడుగు వేసిందన్నారు. భారతదేశం, పాకిస్తాన్‌ మధ్య యుద్ధాన్ని మధ్యవర్తిత్వం ద్వారా తానే ఆపానని అమెరికా అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించుకుంటే ప్రధాని ఆ వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించలేదని తప్పుపట్టారు. ప్రధాని మోడీకి బీహార్‌ ఎన్నికల ప్రచారంపై ఉన్న ఆసక్తి దేశాన్ని కాపాడటంలో లేదని విమర్శించారు. పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేసిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీది అనీ, ఆమెపై ఎన్ని వత్తిళ్లువచ్చినా లొంగకుండా బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం అందించారని గుర్తుచేశారు. దేశభక్తి అంటే ఇందిరాగాంధీ చూపించిన తెగువేనన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం, అనంతరం దేశ నిర్మాణం కోసం కాంగ్రెస్‌, గాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేసిందని తెలిపారు.

నాడు, నేడు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు దేశం కోసం ఏం త్యాగాలు చేశాయని ప్రశ్నించారు. రాజ్యాంగంలో సోషలిజం, సెక్యులరిజం పదాలు లేకుండా చేస్తామనీ బీజేపీ బీరాలు పలుకుతున్నదనీ, వాటి జోలికొస్తే కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. మోడీ సర్కార్‌ విదేశీ విధానం శత్రువులను పెంచే విధంగా ఉందనీ, ఇప్పటికే చైనా, పాకిస్తాన్‌తో శత్రుత్వం ఉందన్నారు. ప్రస్తుతం నేపాల్‌ కూడా భారతదేశానికి దూరంగా జరుగుతున్నదని చెప్పారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్‌కు 50కి పైగా ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థలను తీసుకొచ్చిందనీ, ఈ నగరానికి బీజేపీ ఏ చేసిందో స్పష్టం చేయాలని అన్నారు. మణిపూర్‌లో ప్రజలకు ధైర్యాన్ని కల్పించేందుకు రాహుల్‌గాంధీ ఆ రాష్ట్రంలో పర్యటించారని గుర్తు చేశారు. మోడీ ఎందుకు ఆ రాష్ట్రంలో కాలుపెట్టలేక పోతున్నారని ప్రశ్నించారు. భారత దేశ ప్రజాస్వా మ్యాన్ని కాపాడేందుకు అందరం ఒక్కటిగా ముందుకు కదులుదామని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూలదో యడం అసాధ్యమనీ, బీజేపీ బలపడుతుందే తప్ప కాంగ్రెస్‌కు అవకాశం లేదన్న పరిస్థితులను హస్తం కార్యకర్తలు తారుమారు చేశారని కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే ఆత్మ అని అన్నారు. అర్థబలం ఉండి, స్థిరంగా పాతుకుపోయినట్టు కనిపిం చిన గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను, కేంద్రంలో అప్పటికే అధికారంలో ఉన్న బీజేపీని కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలి పించారనీ, ఈ విజయంలో కార్యకర్త ల కష్టం ఉందని చెప్పారు. రాష్ట్రంలో పేదలు, రైతు లు, యువత, మహి ళలు అన్ని వర్గాల కోసం అనేక సంక్షేమ, ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలు అమలు చేస్తు న్నామని వివరించారు.

కాంగ్రెస్‌ చెప్పిందే చేస్తుందనీ, దానిలో భాగంగానే గిగ్‌ వర్కర్ల కోసం చట్టం రూపొందించామని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం బాగా పని చేస్తున్నదని ప్రశంసించారు. రాష్ట్రంలో కులగణన చేయటం ద్వారా దేశంలో అనివార్యంగా కులగణన చేసే పరిస్థితిని కాంగ్రెస్‌ సృష్టించిందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్‌ పోరాడుతుంద న్నారు. పార్టీకి మరింత బలాన్నిచ్చి, సామాజిక న్యాయ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. సభకు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షత వహించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌, రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -