ఇక నుంచి అధికారికంగా ఆయన వర్థంతి, జయంతి : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడి
మాజీ సీఎం విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య నేటి తరానికి ఆదర్శనీయమని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. ఇక నుంచి ప్రభుత్వం అధికారికంగా ఆయన వర్థంతి, జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని లక్డీకాఫూల్ చౌరస్తాలో రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఎ.రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం రవీంధ్రభారతిలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ, రోశయ్య మెమోరియల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో రోశయ్య 92వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును సన్మానించారు. ఈ సందర్భంగా చాగంటి .రోశయ్యతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు.
శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు లక్డీకాపూల్‌లో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా ఆయన పేరొందారన్నారు. ఆయన ఏనాడూ పదవులను కోరుకోలేదనీ, పదవులే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయని గుర్తుచేశారు. 16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మామూలు విషయం కాదన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ..రోశయ్య పరిపాలనా దక్షతగల నాయకుడనీ, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టకుండా జాగ్రత్తగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన మహనీయుడని కొనియాడారు. మాజీ ఎంపీ కేవీపీ. రామచందర్‌రావు మాట్లాడుతూ…రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. సచివాలయంలో ఒక సందర్భంలో పథకాల ప్రకటన విషయంలో రోశయ్య-వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మధ్య మధ్యవర్తిత్వం వహించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ…నేడు రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందనీ, ముఖ్యంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రాజకీయాలు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీల యువనేతలు రోశయ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితాన్ని అధ్యయనం చేయాలని సూచించారు.
అప్పులు చేయకుండా బడ్జెట్ రూపొందించడంలో రోశయ్య దిట్ట : శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
దేశ చరిత్రలోనే 16 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకే దక్కుతుందనీ, అప్పులు చేయకుండా ప్రజాయుత బడ్జెట్‌ను రూపొందించడంలో ఆయన దిట్ట అని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కొనియాడారు. ఆయన మంచి వాగ్దాటి, ఆజాత శత్రువు అని చెప్పారు. యువ రాజకీయ నాయకులు రోశయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు.
ప్రభుత్వాలపై మోయలేని భారంగా సంక్షేమ పథకాలు : శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
ప్రభుత్వాలపై సంక్షేమ పథకాల అమలు భారంగా మారిందని శాసనమండలి చైర్మెన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలుగువాళ్లను ఒకరినొకరు గౌరవించుకోవడంలో భాగంగానే మాజీ సీఎం రోశయ్య విగ్రహాన్ని హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రేమాభిమానాలు తెలంగాణ ప్రజలకు ఎక్కువన్నారు. మనిషిని మనిషిగా గౌరవించుకుంటూ ముందుకు పోవడం శ్రేయస్కరమని చెప్పారు. ఏ రాష్ట్రమైనా ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉంటే అభివృద్ధి పథంలోకి ముందుకెళ్లడానికి, నాలుగు మంచి పనులు చేయడానికి దోహదపడుతుందని వివరించారు. కానీ, అధికారం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేడు ప్రభుత్వాలకు భారంగా మారుతున్నాయని చెప్పారు. ప్రజలను ఉచితాలతో కూర్చోబెట్టడం కాకుండా వారిని కూడా పనుల్లో నిమగం చేసి దేశం, రాష్ట్రం ముందుకుపోవడంలో తమ వంతు పాత్ర పోషించేలా ప్రభుత్వ విధానాలుండాలని గతంలో రోశయ్య పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే దామోదర్, ఎమ్మెల్సీ బి.దయానంద్, మాజీ కేంద్ర మంత్రి సి.వేణుగోపాలచారి, తెలంగాణ సాంస్కృతిక కళా సారథి చైర్మెన్ వెన్నెల గద్దర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత, తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్‌పర్సన్ అలేఖ్య పుంజాల, ఆర్యవైశ్య మహాసభ నాయకులు అమరావతి లక్ష్మీనారాయణ, రోశయ్య మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ కొణిజేటి శివసుబ్బారావు, పర్యాటక కార్పొరేషన్ మాజీ చైర్మెన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్త తదితరులు పాల్గొన్నారు.