Saturday, July 5, 2025
E-PAPER
Homeజాతీయంకూల్చివెతలు

కూల్చివెతలు

- Advertisement -

కాషాయ ప్రభుత్వాల బుల్డోజర్‌ రాజకీయాలు
ఇబ్బందుల పాలవుతున్న సాధారణ ప్రజలు
మైనారిటీ కుటుంబాల ఇండ్లు, నిర్మాణాలే టార్గెట్‌
సుప్రీంకోర్టు ఆదేశాలనూ లెక్క చేయని వైనం
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు
న్యూఢిల్లీ :
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్‌ రాజకీయాలు ప్రజలను భయపెట్టిస్తున్నాయి. పాలనను పక్కనబెట్టిన అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్రమణల పేరుతో ఇండ్లు, ఇతర నిర్మాణాల కూల్చివేతలకు పాల్పడుతున్నాయి. బుల్డోజర్‌ చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఈ విధానంపై కొన్ని మార్గదర్శకాలనూ రూపొందించిం ది. న్యాయస్థానం తీర్పు తర్వాత కూడా బుల్డోజర్లు బాధితుల ఇండ్ల పైకి వెళ్లాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 15 రోజుల ముందస్తు నోటీసు అనేది తప్పనిసరి. అంతేకాదు.. కూల్చివేత ప్రక్రియకు సంబంధించి వీడియోగ్రఫీ, పారదర్శకత కోసం డిజిటల్‌ పోర్టల్‌ అనేవి నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, బీజేపీ ప్రభుత్వాలేవీ ఇవి పట్టించుకున్న దాఖలాలే లేవు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరిస్తూ కాషాయపార్టీ ప్రభుత్వాలు పలు కూల్చివేతలు జరిపాయి.


బీజేపీ పాలిత రాష్ట్రాల ఉల్లంఘనలు
ఆక్రమణ పేరుతో పేరుతో యూపీలో దశాబ్దాల కాలం నాటి మద్నీ మసీదులోని కొన్ని భాగాలను అక్కడి యోగి సర్కారు కూల్చివేసింది. స్థానిక అధికార యంత్రాంగం తమకు 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వలేదని మసీదు మేనేజ్‌మెంట్‌ ఆరోపించింది. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి 9న జరిగింది. ఆ తర్వాతి నెలలో మహారాష్ట్రలోని అక్కడి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ఫహీం ఖాన్‌ అనే వ్యక్తి ఇంటిలోని కొన్ని పోర్షన్లను కూల్చేసింది. అలాగే, సింధూదుర్గ్‌లో మరొక ముస్లిం వ్యక్తి ఇల్లు, షాప్‌ కూల్చివేత, రారుగఢ్‌లో 55కు పైగా కుటుంబాలుండే నివాస సముదాయాల కూల్చివేతల విషయంలోనూ అధికార యంత్రాంగా లు ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. గుజరాత్‌లో ఆక్రమణల పేరుతో ద్వారక జిల్లాలో 250కి పైగా ఇండ్లు, ప్రార్థనా స్థలాల కూల్చివేతలు జరిగాయి. అణగారిన వర్గాల ప్రజలే టార్గెట్‌గా ఈ ప్రక్రియ సాగింది. అప్పటి వరకూ లేని ఆక్రమణల కూల్చివేతలు.. నేరపూరిత చర్యకు పాల్పడ్డారంటూ వారి ఇంటి వద్దకు బుల్డోజర్‌ వచ్చి చేరుతుంది. వెంటనే కూల్చివేతలు జరుపుతుంది. మతాన్ని, వ్యక్తులను టార్గెట్‌గా చేసుకుంటూ ఈ బుల్డోజర్‌ రాజకీయాలు నడిచిన తీరుతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఇందులో బాధితులుగా మిగిలింది మాత్రం అణగారిన వర్గాలే. ముఖ్యంగా, ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటూ బీజేపీ ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి.


షురూ చేసిన యోగి సర్కారు
యూపీలోని యోగి సర్కారు ఈ బుల్డోజర్‌ రాజకీయాన్ని తీసుకొచ్చింది. తర్వాత అది క్రమంగా ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలకూ పాకింది. ఇండ్లను నేల మట్టం చేయటం, ప్రార్థనా స్థలాలు, ఇతర నిర్మాణాలను పడగొట్టటం వంటి చర్యలు ఇందులో కనిపించాయి. ఢిల్లీలోని మురికివాడల సమూహం నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌ వరకు, యూపీలోని మొహల్లాల నుంచి అసోంలోని నదీ తీరాల వరకు.. నయా-ఫాసిస్టు ప్రభుత్వాలు కొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాయని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


‘గోడి మీడియా’ విపరీత ప్రచారం
ఈ బుల్డోజర్‌ కూల్చివేతల దృశ్యాలకు ‘గోడి మీడియా’ విపరీత ప్రచారాన్ని కల్పించింది. ముఖ్యంగా, యూపీలో యోగి సర్కారు చర్యలను సమర్ధించేలా కథనాలు, వార్తలను ప్రసారం చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి కూల్చివేతల ఘటనలు బ్రిటీషు వలసకాలం నాటి రోజులను గుర్తు చేస్తున్నదని మేధావులు చెప్తున్నారు. మురికివాడల్లోని ప్రజలను అక్కడి నుంచి తరలించి, కూల్చివేతలు జరిపేవారనీ, అది ఇప్పుడు బీజేపీ పాలనలో కనిపిస్తున్నదని అంటున్నారు. అయితే, ఈ కృత్రిమ దృశ్యం వెనుక ఒక నిరంకుశ రాజకీయ ఆర్థిక వ్యవస్థ దాగి ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు. అభివృద్ధి, సుందరీకరణ పనులు, మురికివాడల్లోని ప్రజలకు ఇండ్ల నిర్మాణాలు.. ఇలా పలు కారణాలను చూపుతూ బుల్డోజర్లను బీజేపీ ప్రభుత్వాలు రంగంలోకి దింపుతున్నాయి.


కూల్చివేతలు, మత రాజకీయ సంబంధం
బీజేపీ ప్రభుత్వాలు జరిపే ఈ బుల్డోజర్‌ కూల్చివేత రాజకీయాలు మతంతో ముడిపడి ఉంటున్నాయి. ఢిల్లీ, గుజరాత్‌, యూపీ వంటి రాష్ట్రాల తర్వాత ఇతర బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కూల్చివేత కార్యక్రమాలను చేపట్టాయి. అయితే, ఈ కూల్చివేతలు అధికంగా ముస్లిం మెజారిటీ ప్రాంతాలు, సాంస్కృతిక మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ముఖ్యంగా, ముస్లింల ఇండ్లు, దర్గాలు, మసీదులు వంటి వారి ప్రార్థనా, పవిత్ర ప్రదేశాలపై ఈ బుల్డోజర్‌ కదిలింది. వీటికి సంబంధించిన వీడియోలకు కొన్ని పాటలను జోడిస్తూ సోషల్‌ మీడియాలో హిందూత్వ శక్తులు ప్రజలను తప్పుదోవ పట్టించాయి. వీటికి ‘గోడి మీడియా’ కూడా తోడైంది. బీజేపీ ప్రభుత్వాల ఈ నయా ఫాసిస్టు ముఖ్య ఉద్దేశం ముస్లింలు, ఇతర మైనారిటీలను భౌగోళికంగా దూరం చేయటమేనని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ వైఖరిపై ప్రజల నుంచి కూడా తిరుగుబాటు ఎదురైంది. నగరాల్లోని శ్రామిక ప్రజలు బహిష్కరణలకు వ్యతిరేకంగా సంఘటితమయ్యారు. వీధుల్లో తీవ్ర నిరసనలు తెలిపారు. కోర్టులలో పిటిషన్లు వేశారు. నివసించే హక్కుపై జవాబుదారీతనాన్ని కోరారు. ప్రజాస్వామ్య ఉద్యమాలు కనిపించాయి. ఎట్టకేలకు బుల్డోజర్‌ అన్యాయంపై న్యాయస్థానంలో ప్రజలు విజయం సాధించారు. అయినప్పటికీ, బీజేపీ ప్రభుత్వాలు అవేమీ పట్టించుకోకుండా విధానపరమైన ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. కూల్చివేతలకు ముందు నోటీసులు ఇవ్వకపోవటం, పునరావాస ప్రణాళికలు కనిపించకపోవటం వంటివి ఇందులో ఉంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -