నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలోని టెక్సాస్ లో శుక్రవారం సంభవించిన వరదలకు 24 మంది మృతి చెందగా, 20 మందికి పైగా పిల్లలు గల్లంతు అయ్యారు. వేసవి శిబిరానికి హాజరైన పిల్లలు ఆకస్మిక వరదల్లో గల్లతైయ్యారు. పిల్లల ఆచూకీ కోసం వారి తల్లితండ్రులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వేగంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ప్రత్యేక బృందాలు, హెలికాప్టర్ పై గాలింపులు చర్యలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 237 మందిని రక్షించామని, వారిలో 167 మంది హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

టెక్సాస్ హిల్ కంట్రీలో నెలల పాటు కురిసే వర్షమంతా కొన్ని గంటల్లోనే కురిసేసింది. దీంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. అయితే అదే ప్రాంతంలో చిన్నారులకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. హఠాత్తుగా వరదలు సంభవించడంతో దాదాపు 23 మంది బాలికలు గల్లంతయ్యారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పడవ, హెలికాప్టర్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో తల్లిదండ్రులు తమ బిడ్డల జాడ తెలిస్తే.. తెలియజేయాలని వేడుకుంటున్నారు.