Sunday, July 6, 2025
E-PAPER
Homeకవర్ స్టోరీస్వేచ్ఛా భారతం ఎవ‌రికి

స్వేచ్ఛా భారతం ఎవ‌రికి

- Advertisement -

స్వేచ్ఛ అంటే ఏమిటి?. అది ఎలా ఉంటుందని మేధావులు తమకు తాము వేసుకునే ప్రశ్న. పక్షిలాగా ఎగరటం అని ఒకరంటే, జలపాతంలా ప్రవహించటం అని మరొకరు, ఇష్టమైనట్లు జీవించటం అని ఇంకొకరు సూత్రీకరించారు.
స్వేచ్ఛ అంటే ఇతరులకు ఇబ్బంది కలగకుండా, తమ పరిదిలో ఉండటమని న్యాయకోవిదులు సెలవిచ్చారు. మన రాజ్యాంగం ప్రకారం భారతదేశం ‘సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రరాజ్యం’. భారతదేశ అతిపెద్ద లిఖిత రాజ్యాంగంలో అవతారికతో పాటు 448 అధికరణాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవలసినది అవతారికలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే ఆదర్శాల విస్తతరూపమైన ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులను అతిక్రమించటం నేరం.

ఈ హక్కులను కాపాడడం కోసం ఎన్నో చట్టాలు చేశారు. ఎన్ని చట్టాలు చేసినా మనువాద వారసులు తమకి అనుకూలంగా చట్టాలను చుట్టాలుగా చేసుకున్నారు. వీటి ఫలితాలే ఆనాటి నుండి ఈనాటి వరకు నిర్భయని మించిన సంఘటనల పరంపర. ఈ విషయంలో భారతదేశం ఏకతాటిపై నడుస్తున్నదనడానికి నిదర్శనమే, వయసు, చదువు, వావివరుసలు లేకుండా మగాళ్లు అమ్మల (నెలల శిశువు నుండి పండు ముసలి వరకు) పై జరిపే అకత్యాలు. వాటి గురించి బాధితులు ఎవరితో మొర పెట్టినా సరైన న్యాయం జరగటం లేదు.
ఈ స్వతంత్ర భారతంలో ఎవరికి స్వేచ్ఛ ఉంది. ఎటువంటి స్వేచ్ఛ ఉంది అని మళ్లీ మళ్లీ ఆలోచించాల్సి వస్తోంది. ‘రెడ్డి వచ్చె మొదలాట’ అన్నట్లుగా స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల తీర్పులన్నీ రకరకాల కోర్టు మెట్ల దగ్గరే తిరుగుతూ, వాయిదాలపై వాయిదాలతో తీర్పులేని కేసులు, తీర్చలేని వెతలుగా మిగిలిపోతున్నాయి.
అభివద్ధి చెందిన దేశాలే కాక ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పిల్లలు అడుగడుగునా ఎన్నో సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. పిల్లలపై లైంగికహింస ప్రతి దేశంలోనూ, సమాజంలోని అన్ని విభాగాలలోనూ జరుగుతోంది. ‘ఆడపిల్లలు సమాజానికి గుండె చప్పుడు లాంటి’ వారంటూనే గుట్టుగా మట్టుపెడుతున్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా పసి పిల్లలపై లైంగికనేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, వాటిని అరికట్టడానికి ఒక చట్టాన్ని చేయాల్సివచ్చింది. అదే 2012లో చేసిన ‘పోక్సో (జూతీశ్‌ీవష్‌ఱశీఅ శీట షష్ట్రఱశ్రీసతీవఅ aస్త్రaఱఅర్‌ రవఞబaశ్రీ శీటటవఅషవర Aష్‌)’. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ కోసం చేసిన పోక్సో చట్టం చాలా శక్తివంతమైంది. ఇది మహిళా, శిశు అభివద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
ఈ పోక్సో చట్టం, బాలల హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో చేసింది. చైల్డ్‌ సెంట్రిక్‌ అప్రోచ్‌తో నేరాలను త్వరితంగా విచారణ చేయడానికి, పిల్లల గుర్తింపును గోప్యంగా ఉంచడానికి ప్రత్యేక న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేసారు. 18 ఏళ్లలోపు పిల్లలను బాలలుగానే పరిగణిస్తారు. పిల్లలను అన్నిరకాలుగా అభివద్ధి చెందేట్లుగా పెంచడం తల్లిదండ్రుల ప్రాధమిక బాధ్యత. బాలల హక్కులను గౌరవించి, అమలుపరచవలసిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలది. అలాగే పెద్దలు, పిల్లలకు వారి హక్కుల గురించి తెలియజేయాలి. ఆ హక్కులతో పాటు, వాటి ఆవశ్యకత గురించి తల్లిదండ్రులో లేక ఉపాధ్యాయులో వివరించాలి. పిల్లలపట్ల ఇతరులు ఏ విధంగా ప్రవర్తిస్తే లైంగిక నేరమంటారో, దాన్ని ప్రతిఘటించడానికి అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని పిల్లలకి చదువుతో పాటు అందించాలి. ఎందుకంటే చాలా సందర్భాలలో పిల్లలకు తమపై దాడి జరిగేటప్పుడు ఏమీ అర్థంకాని అయోమయ స్థితిలోకి వెళ్లటం గమనించవచ్చు. ఒక విధమైన షాక్‌ కి గురి అవుతారు. ఎవరికి చెప్పుకోవాలో, ఏమని చెప్పాలో తెలియక మౌనంగా ఉంటారు. అవే బాలల మానసిక, శారీరక రుగ్మతలకు దారే తీసే పరిస్థితి. అందుకే పోక్సో 2012- లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం పిల్లలను విచారించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను పేర్కొంది. అవి
1. పిల్లల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, నివాసస్థలాల వివరాలు మీడియాకి తెలియకూడదు.
2. పిల్లల పేర్లు, ఫొటోలు బహిరంగంగా ప్రకటించినవారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష పడవచ్చు.
3. పిల్లలను పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్లకూడదు. అవసరమైతే సివిల్‌ డ్రస్‌లో ఉన్న మహిళాపోలీస్‌ అధికారి మాత్రమే పిల్లలతో మాట్లాడి, సున్నితంగా విషయాలు తెలుసుకోవాలి.
4. న్యాయాస్థానంలో నిందితుడు పిల్లలకు కనబడకుండా చర్యలు తీసుకోవాలి.
5. వైద్యసహాయం అందించేటప్పుడు తల్లిదండ్రులు లేక సంరక్షకులు తప్పని సరిగా పిల్లల దగ్గర ఉండాలి.
6. బాధితుల సహాయనిధి నుండి పిల్లలకు నష్టపరిహారం అందేట్లుచూడాలి.
విచారణ సమయంలో తీసుకోవలసిన నియమాలను, మార్గదర్శక సూత్రాలను ఎన్నిసార్లు చెప్పినా ‘చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే’ అవుతోంది. మొన్న జరిగిన ‘స్వేచ్ఛ’ బలవన్మరణం తరువాత కూడా అదే జరిగింది. పెద్దలు తరుచుగా ‘పెద్దలు’ అనే కారణంగా తమకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది కాదనలేని నిజం. స్వేచ్ఛ మరణంతో ఆమె తల్లిదండ్రులు బిడ్డని కోల్పోయారు. ఆమె తన కష్టాలకు ముగింపుగా మరణాన్ని ఎంచుకుందేమో, కాని ఆమె బిడ్డ కూడా తల్లిని కోల్పోయింది. ఆమెకు ఒక రకంగా బాల్యం ముళ్లబాటను పరిచయం చేసింది. తాను చేయని తప్పుకు శిక్షను ఎదుర్కొంటోంది. రంగులమయ బాల్యం మసిబారింది. తల్లిదండ్రులు ఎందుకు విడిపోతారో, ఎప్పుడు అనాథలుగా వదిలేసి తనువులు చాలిస్తారో తెలియని స్థితి. ఈ సంఘటన ప్రభావం కేవలం స్వేచ్ఛ కుటుంబానికి పరిమితం కాదు. సమాజంలోని బాలలందరిపైనా పరోక్షంగా ఉంటుంది. కేవలం మీడియా మాత్రమే కాక, చుట్టుపక్కల ఉన్న వారంతా పిల్లల మానసిక సంఘర్షణని అంచనా వేయలేక రకరకాల ప్రశ్నలతో చిన్ని మనసుని ఇంకా తూట్లుపడేట్లు ప్రవర్తించారు. విత్తనంలో వక్షం ఉన్నట్లే, పసివారిలోనూ సంపూర్ణమైన మనుష్యడు ఉన్నాడు. పిల్లలకు కూడా వాళ్లకంటూ ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది. అది గ్రహించని పెద్దలు పిల్లల సహజ వికాసంలో సహాయకులుగా కాకుండా ప్రతిబంధకాలుగా మారతారు. పిల్లల లైంగిక వేధింపులు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది అనేక సామాజిక, ఆరోగ్య సమస్యలకు మూలం. అందుకే అన్ని రకాల విభాగాలవారికి బాలల హక్కుల గురించిన జ్ఞానాన్ని అందచేయాలి. పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించటానికే బాలల దినోత్సవాలను ప్రపంచదేశాలన్నీ జరుపుతాయి. ఒక్కోదేశంలో ఒక్కో తేదీన జరుపుకుంటున్నారు. 1959 నుండి బాలల హక్కుల అన్న భావన వాటి ప్రకటన జరిగిన తరువాత బాలల దినోత్సవాల లక్ష్యాలు కూడా అందరికీ తెలిసాయి.
బాలలని మీడియా ముందుకి తీసుకువచ్చేటప్పుడు తీసుకోవలసిన భద్రతా చర్యలను పరిశీలించడానికి ‘జాతీయ పిల్లల హక్కుల సంరక్షణ కమిషన్‌’ (చీజూజ=), కూడా ఒక కార్యచరణ బందాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మీడియా, టెలివిజన్‌ కార్యక్రమాలలో, ప్రకటనలలో పాల్గొనే పిల్లలకు ఇది భద్రతా వలయంగా ఉందనవచ్చు. ఇదంతా నాణానికి ఒకపక్క మాత్రమే.
మన జీవితశైలి, లక్ష్యాలు, రూపం మార్చుకున్న వివాహ వ్యవస్థ, స్వేచ్ఛ అనుకుంటూ ఒంటరితనానికి దగ్గరవుతున్న యువత, ప్రేమను పంచే పెద్దలు, బాధను పంచుకునే స్నేహితులు లేక మానసిక కంగుబాటుకు బాటలు వేస్తోంది. అందుకు తాజా ఉదాహరణగా ‘స్వేచ్ఛ’ని తీసుకుందాం. చిరునవ్వుతో అందరినీ పలకరించే స్నేహశీలి. ఉద్యమనేపథ్యంతో, ప్రగతిశీల భావాలుగల యువతి. అన్యాయాన్ని ప్రశ్నించగల కవయిత్రి. కలంతో, గళంతో స్ఫూర్తినివ్వగలిగిన జర్నలిస్ట్‌. యువతకు ప్రతినిధి తన నిర్ణయాన్ని తానే తీసుకోగలగే మేధావి. వివాహం, విడాకుల తరువాత తన కూతురిని తానే కంటికి రెప్పలా చూసుకుంటోంది. జీవింతంలోని ఒడిదుడుకులను చిరునవ్వుతో స్వీకరించి ముందుకుసాగే ధీర. కాని ఒక్కో సమయంలో శరీరం శారీరిక శ్రమ కన్నా ఆలోచనలతోనే అలసిపోతుంది. దాని వల్ల ఒత్తిడి, కంగుబాటు కలుగుతాయి. ఇది వ్యాధి అని ఎవరు ఒప్పుకోకపోయినా, వీటి వల్లే నూటికి తొంబ్భైశాతం ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ ఒత్తిడి ఎవరో ఒకరు తోడున్నాననే భరోసా ఇస్తే తగ్గుతుంది. ఒకే ఇంట్లోని మనుషులే ఎవరికి వారే అన్నట్లు జీవిస్తున్నారు. ఇది స్మార్ట్‌ టెక్నాలజీ యుగం కదా. జీవితాలలో పంచుకోవటం కన్నా దాచుకోవటం ఎక్కువైంది. ఓటమిని తట్టుకోవడానికిగాని, ఒప్పుకోవడానికి గానీ ఎవరూ సిద్ధంగాలేరు. సమస్య పరిష్కారం కన్నా, దాని నుండి పారిపోవడానికే ప్రాముఖ్యతని ఇస్తున్నారు. వీటన్నిటికీ మూలకారణం పోటీ తత్వం. చిన్నప్పటి నుండి పిల్లలు గొప్పగా ఉండడమంటే తోటివారికన్నా ఎక్కువ స్థాయిలో ఉండడమనేది తల్లిదండ్రులు తమకు తాము రాసుకున్న చట్టం. పిల్లలు చూసిందే నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా పిల్లలకు ఉదాహరణగా నిలవాలి. దీనికి కొంతవరకు పరిష్కారం పాఠశాలలో లభిస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఆటలాడేటప్పుడు గెలుపోటములు సహజమని తెలుసుకుంటారు. అంతేకాక గెలవకపోతే ఓడినట్లుకాదు. ఈ ప్రపంచంలో ఓటమన్నదే లేదు. ఏ పనిచేసినా అందులో విజయాన్ని సాధించలేకపోతే, అనుభవం వస్తుంది. ఆ అనుభవాలే తదుపరి ప్రయత్నాలలో గెలుపుని ఇస్తాయి. ఈ అంశాన్ని ఆటలలో, ఇతర పోటీల ద్వారాతెలుసుకుంటారు. ఇది పిల్లల భవిష్యతుకు ఒక మంత్రదండం లాంటిది. పిల్లలకు పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలి. ఓటమిపై సాధించిన గెలుపు కథలను, స్ఫూర్తినిచ్చే కథలను చెప్పాలి. ఒకరకంగా నిన్నటి బాలలని నిర్లక్ష్యం చేసినందువల్లే నేటి యువతరంలో అసంతప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయని చెప్పవచ్చు.
ఈ తరం ముందు తరాలు చూడని ఎంతో సాంకేతికతతో పాటు, కొత్త కొత్త సమస్యలను, అనారోగ్యాలను కూడా తెచ్చుకుంటోంది. అదే మానసిక అనారోగ్యం. కంటికి కనిపించని మనసు ఎన్నో మాయలు చేస్తుంది. మన ఆలోచనలు, ప్రవర్తన, భావోద్వేగ బంధాలు, బంధుత్వాలు అన్నీ మనసు ఆధీనంలో ఉంటాయి. బాల్యం నుండి వద్ధాప్యం వరకూ జీవితంలో ప్రతిదశలోనూ మనసు ప్రభావం చూపుతుంది. కొన్ని గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు. వీటికి ఎన్నోకారణాలున్నా, రోజురోజుకి చిన్నకుటుంబాలు పెరగడం, అత్యవసర సమయాల్లో తోడు లేకపోవటం, చదువులు, కెరియర్‌ ఆధారంగా తీవ్రఒత్తిడికి గురై, నెమ్మదిగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. చిన్నపాటి కౌన్సిలింగ్‌ ద్వారా కూడా మానసిక సమస్యల నుండి బయటపడవచ్చు. మానసిక సమస్య-చికిత్సల గురించి భారతదేశంలో తగినంత అవగాహనను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మానసిక సమస్యతో బాధపడుతున్న వ్యక్తిని పిచ్చివాడిగా ముద్రవేసే సంప్రదాయానికి స్వస్తి పలకాలి. వీలైతే మన స్నేహితులను, ఇరుగుపొరుగు వారిని గమనించి, అవసరమైనప్పుడు తగిన సహాయాన్ని అందించాలి. ఎవరిమీదో కోపంతో తమ ప్రాణాలను తీసుకునే ముందు, తనని కావాలనుకునేవారు, తాను లేకపోతే చాలా నష్టపోయేవాళ్లను గుర్తుచేసుకోవాలి. సమస్య ఉన్నచోటే పరిష్కారం ఉందని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలిసినా ఒక బలహీనమైన క్షణంలో మనలని వదిలేసి వెళ్లిన మనందరి స్వేచ్ఛ Û’మట్టిపూలగాలి’ పరిమళాలను ఎక్కడని వెతకాలి?.

డా. నీరజ అమరవాది
9849160055

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -