ధగధగలు
సువర్ణ : సినిమాకు వెళ్ళావు. సినిమా ఎలా వుంది అని అడిగితే చూడలేదంటావేం?
అపర్ణ : ఔను నా పక్కన కూర్చున్నావిడ పెట్టుకొచ్చిన రవ్వల దుద్దులు అంత చీకట్లోనూ ధగధగ మెరుస్తుంటే సినిమా ఎలా చూడగలను చెప్పు..?
కొద్దిగా మార్చుతా
డాక్టర్ ప్రకాశ్ దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు గోపాల్.
గోపాల్ : మీరు నేను గాఢమైన మిత్రులం. ఫీజిచ్చి ఓ మంచి స్నేహితుణ్ణి అవమానించలేను. ఫ్రీగా సేవ చేయించుకోవడమూ ఇష్టం లేదు. కాబట్టి మీకు ఎంతో కొంత అందేలా నా వీలునామాలో మార్పులు చేస్తా
ప్రకాశ్ : డబ్బు కాస్త త్వరగా అవసరం. ఓసారి ఆ ప్రిస్క్రిప్షన్ ఇస్తారా? నేను కొద్దిగా మార్పులు చేస్తా.
బలి
సుగుణ : ఏవండోరు… ఈ రోజుకి మన పెళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం
ప్రదీప్ : ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?
నిద్ర
శ్రీధర్ : డాక్టర్ గారూ… ఈ మధ్య సరిగా నిద్ర పట్టడం లేదు. మంచి మందులేమైనా…
డాక్టర్ : చూడండి.. నిద్ర పట్టడానికి మంచి వాతావరణం అవసరం. చక్కని మెత్తటి పరుపు, ఎత్తైన దిండ్లు, సుగంధభరితమైన అగరుబత్తి పొగలు, నీలంరంగు కాంతి బల్బు, కిటికీలకు మంచి కర్టెన్లు వేసుకుంటే నిద్ర దానంతట అదే వస్తుంది
శ్రీధర్ : కానీ ఆఫీసులో ఇన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడానికి వీలు కాదేమో డాక్టర్…
మంచిదంటే ఏది?
తన రూమ్‌లోకి క్యాలెండర్ కావాలంటూ బజారుకేళ్ళాడు రాము.
యజమాని క్యాలెండర్లు చూపిస్తుంటే ప్రతీ దాన్నీ వద్దంటూ…. ”ఇంకాస్త మంచిదివ్వండి” అంటున్నాడు.
”నీ దృష్టిలో మంచిదంటే ఏంటి? ” విసుకుగా అడిగాడు యజమాని.
”అంటే…… స్కూలుకు సెలవులు బాగా ఇచ్చేలా ఎర్రరంగు గళ్ళు ఎక్కువుండాలి”
అందంగా…
శ్రీను : తాగినపుడు నువ్వు చాలా అందంగా వుంటావు రాణి
రాణి : అవునా, కానీ నేను ఎప్పుడూ తాగలేదే
శ్రీను :నువ్వు కాదు డార్లింగ్… నేను తాగినపుడు
చిన్న-పెద్ద
”మీరు చూస్తే చాలా చిన్న లాయర్లా ఉన్నారు. నా కేస్ టేకప్ చెయ్యగలరా?” సందేహంగా అడిగాడు క్లయింటు.
”ఫరవాలేదు. మీ కేసు పూర్తయ్యేనాటికి నేను పెద్ద లాయర్నవుతాను” అభయమిచ్చాడు లాయర్.
ఉత్తుత్తిదే
దొంగ : నీ పర్స్ ఇవ్వు. లేకపోతే తుపాకీతో కాల్చి చంపేస్తా.
సుబ్బారావు : ఇదిగో తీసుకో…
దొంగ : పిచ్చివాడా! ఈ తుపాకీలో గుళ్ళు లేవు
సుబ్బారావు : వెర్రివాడా! నా పర్సులో కూడా డబ్బుల్లేవు.
ప్రశ్నలు – జవాబులు
తండ్రి : ఏరా నానీ ఈ రోజు లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు?
నాని : యాభై మార్కులకు ఐదు ప్రశ్నలిచ్చారు డాడీ. చాలా కష్టంగా ఉన్నాయి.
తండ్రి : మరి నువ్వెన్ని ప్రశ్నలకు జవాబులు రాశావు?
నాని : పైన రెండు, కింద మూడు ప్రశ్నలకు తప్ప అన్నిటికీ రాశాను.
మందు
రామారావు ప్రతి రోజూ బార్‌కెళ్ళి మందు తాగుతాడు. విషయం ఏమిటంటే ప్రతీ రోజూ రెండు గ్లాసులు ఆర్డర్ చేసి పక్క పక్కనే పెట్టుకుని, ఒక సిప్పు ఒక గ్లాసులోంచి, మరో సిప్పు రెండో గ్లాసులోంచి తాగుతాడు. ఈ తతంగం అంతా చాలా రోజుల నుంచి చూసిన సర్వర్ ఆనందం ఉండబట్టలేక ఒక రోజు రామారావుని అడిగేశాడు.
”నేను ఎప్పుడూ మందు నా స్నేహితుడు సుబ్బారావుతో కలిసి తాగేవాడిని. ప్రమాదవశాత్తు అతను చనిపోయాడు. అతని జ్ఞాపకార్ధం ఈ విధంగా ఎప్పుడూ రెండు గ్లాసులు తాగుతున్నాను” చెప్పాడు రామారావు.
కొంతకాలం తరువాత రోజూ ఒక గ్లాసు మాత్రమే ఆర్డరు చెయ్యటం మొదలుపెట్టాడు రామారావు. ఈ విషయం గమనించిన సర్వర్ రామారావుని అడిగాడు ”ఏంటి సార్ మీ స్నేహితుడిని పూర్తిగా మర్చిపోయారా?”
”లేదయ్యా నేను మందు మానేశాను” చెప్పాడు రామారావు.