Sunday, July 6, 2025
E-PAPER
Homeసమీక్షస్త్రీకి జరిగిన అన్యాయంపై ఫోకస్‌ పెట్టిన చిత్రం

స్త్రీకి జరిగిన అన్యాయంపై ఫోకస్‌ పెట్టిన చిత్రం

- Advertisement -

యదార్థంగా జరిగిన సంఘటనకు వెండితెర రూపం ‘కాఫిర్‌’ హిందీ మూవీ. వెన్నెముక విరిచేసి, ఆర్తనాదం చేసే స్వతంత్రత కూడా కోల్పోయిన ఒక నిస్సహాయ అబల ఉదంతం ఈ సినిమా. షెహనాజ్‌ పర్వీన్‌ అనే పాకిస్తాన్‌ గహిణి మూగ రోదనకు తెరరూపం ఇది.

మొదట ‘కాఫిర్‌’ టీవీ సిరీస్‌గా 15 జూన్‌ 2019 నుంచి ఎనిమిది ఎపిసోడ్స్‌ గా వీక్షకులను అలరించగా, ఈ కథకు అద్భుతమైన సినిమా రూపకల్పన జరిపి 4 ఏప్రిల్‌ 2025 నుంచి జీ 5 ద్వారా స్ట్రీమింగ్‌ అయి, మంచి రేటింగ్‌ను సొంతం చేసుకుంది. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో ఫ్లాష్‌ బాక్‌ సన్నివేశాలు కూడా గందరగోళ పరచని రీతిలో తెరరూపం కల్పించడంలో దర్శకురాలు సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి.
ఒక సాధారణ గహిణి ఎదుర్కొన్న సమస్యల గురించి వివరించిన రచయిత్రి భవాని అయ్యర్‌, దర్శకురాలు సోనమ్‌ నాయర్‌ ఇరువురూ మహిళలే అయినా, తెగింపే పెట్టుబడిగా ఎన్నో ప్రశ్నలు సంధించారు. ఏ నేరమూ చేయకపోయినా ఒక మోసపోయిన ఇల్లాలు పరాయి దేశంలో అన్యాయంగా ఒక టెర్రరిస్ట్‌ అనే అపవాదుతో దాదాపు ఎనిమిది సంవత్సరాలు కారాగార వాసం అనుభవించిన ఉదంతం హదయాలను కదిలిస్తుంది. కాదు కాదు రగిలిస్తుంది. కోల్పోయిన ఆ కాలాన్ని ఆమెకు ఎవరు తెచ్చివ్వగలరు? ఇలా ప్రపంచ వ్యాప్తంగా అన్యాయంగా శిక్షలు అనుభవించే వాళ్ళు వేల సంఖ్యలోనే ఉండి ఉండవచ్చు.
‘కొంతమంది నేరస్తులు శిక్షనుంచి తప్పించుకోవచ్చు కానీ, ఒక నిరపరాదికి అన్యాయంగా శిక్ష పడకూడదు’ అనే సూక్తులను చెప్తుంటాం. అయితే జరుగుతున్న చరిత్ర వేరు.
స్థూలంగా చిత్ర కథ ఏమిటంటే, కైనాజ్‌ అక్తర్‌ అనే పాకిస్తానీ యువతి పేదరికపు పడతి. ఎన్నో కలలతో అత్తవారింట అడుగు పెడుతుంది. వారి ఆదరింపులకు, భర్త ప్రేమకు ఫిదా అవుతుంది. సగటు స్త్రీ ఇంతకంటే ఏమి కోరుకుంటుంది. అయితే, వారి వెనుక విషపు ఆలోచనలను పసిగట్టలేక పోతుంది. భర్త ప్రేమగా సాగనంపగా కొన్ని రోజులు పుట్టింట గడుపుదామని అమ్మగారి ఇంటికి చేరుకున్న కైనాజ్‌ భంగపడుతుంది. తనను వదిలించుకోవాలని వాళ్లు అనుకున్నారని, భర్త మరో నిఖా జరుపుకుంటున్నాడని తెలిసి అత్తగారి ఇంటికి చేరుకున్న ఆమెకు అవమానాలే ఎదురవుతాయి. అలా త్రుణీకరించ బడిన ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో పాకిస్తాన్‌లోని నీలం నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. ఆమె పొరుగు దేశం భారత సరిహద్దులో అచేతనంగా పడి ఉండటం భారత సైనికులు గమనిస్తారు. అదే సమయంలో ఎదురు కాల్పుల్లో మరణించిన కొందరు టెర్రరిస్టుల మత దేహాలు అదే ప్రాంతంలో పడి ఉంటాయి. కైనాజ్‌ను టెర్రరిస్ట్‌గా భావించి, ఆమెను కారాగారానికి పంపిస్తారు.
ఒక భారతీయ జర్నలిస్టు వేదాంత్‌ రాథోడ్‌ అనే వ్యక్తి కైనాజ్‌ను ఇంటర్వ్యూ చేయటానికి అధికారుల అనుమతిని తీసుకుంటాడు. విచిత్రంగా ఆమెకి ఒక పాప కూడా ఉంటుంది. అతను కూపీ లాగితే కైనాజ్‌ జైలు శిక్ష మొదలయ్యే సమయానికి ఆమె గర్భవతి కాదు అని రుజువు దొరుకుతుంది. అతను చేసిన ఇంటర్వ్యూలో తాను ఒక సెంట్రీ ద్వారా రేప్‌ కు గురైనట్టు, అందుకే తాను ఒక పాపకు జన్మ ఇచ్చినట్టు చెపుతుంది. ఒక నిస్సహాయ స్త్రీపై బలత్కార సంఘటన ఆలోచింప చేస్తుంది.
జర్నలిస్ట్‌ స్వతహాగా న్యాయవాది కూడా కావడం వలన, ఆ వత్తిని వదిలి, న్యాయవాదిగా కైనాజ్‌ తరపున వకాల్తా పుచ్చుకుంటాడు. అయితే అతను కల్మష రహితుడే అయినా, ఒక భయంకర నిజం బయట పడుతుంది. అది కూడా కైనాజ్‌ ద్వారానే! అసలు అచేతనంగా పడి ఉన్న కైనాజ్‌ను టెర్రరిస్ట్‌గా ముద్ర వేసి, సైన్యానికి సిఫార్స్‌ చేసింది వేదాంత్‌ రాథోడే! ఆ సమయంలో టెర్రరిస్ట్‌ ద్వారా తమ్ముడిని కోల్పోయిన స్థితిలో అతను అలా ప్రవర్తిస్తాడు.
ఎంతో కష్టపడి అన్ని ఫార్మాలిటీస్‌ పూర్తి చేశాక, స్వదేశంలోకి అడుగు పెట్టడానికి కైనాజ్‌కు అనుమతి దొరకదు. కారణం ఆమెకు జన్మించిన పాప భారతీయురాలు కావడం. ఆ పాప స్వతహాగా పాకిస్తాన్‌లో జన్మించి ఉండకపోవటం. జాతీయ భద్రత కారణంగా ఆరేళ్ల చిన్నారి ప్రవేశానికి అడ్డంకులు ఎదురయినా, మరలా ప్రయత్నాలు మొదలు పెడతాడు వేదాంత్‌. పాకిస్తాన్‌ మంత్రిని కూడా ఒక సమావేశంలో కలిసి అభ్యర్థిస్తాడు. ఇంకా మరో కోణం నుంచి చేసే ప్రయత్నాలు విరమించడు. పాకిస్తానీ ఆమెకు ఆశ్రయం ఇచ్చినందుకు కన్నవారు కూడా అతడిని దూరం పెడతారు.
చివరికి కూతురితో సహా పాకిస్తాన్‌ చేరుకోవడానికి కైనాజ్‌కు అనుమతి లభిస్తుంది. అప్పటికే ఇరువురి నడుమ మూగ ‘కెమిస్ట్రీ’ నడుస్తుంది. ఆ రోజు వచ్చేసరికి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితి. అది ప్రేమకు మించి భావోద్రేకం. కైనాజ్‌ అతి భారంగా భారత సరిహద్దు దాటి పాక్‌లో ప్రవేశిస్తుంది తన పాపతో.
క్లైమాక్స్‌ హదయపు లోతుల్లోకి చేరుతుంది. అంతర్‌ – రాష్ట్ర శత్రుత్వాలు ఇరువైపులా పౌరుల జీవితాలను, జీవనాలను ఎలా దెబ్బతీసాయో ఈ చిత్రం తెలియజేస్తుంది. తన కూతురును తనతో తన దేశానికి తీసుకు వెళ్లడానికి ఒక మాతమూర్తి చేసిన పోరాటం, రెండవ భాగంలో చాలా పకడ్బందీ సన్నివేశాలు సినిమాను ఉన్నతస్థాయిలో నిలబడేలా చేశాయి.
వేదాంత్‌ రాథోడ్‌ పాత్రకు ప్రేరణ ఇచ్చిన న్యాయవాది ఎ.కె.సాహ్ని. ఇతను షెహనాజ్‌ పర్వీన్‌ను పూంచ్‌లోని జైలులో కలుస్తాడు. విడుదల అనంతరం ఆమెను పాకిస్తాన్‌కు పంపడానికి పాకిస్తాన్‌ మానవ హక్కుల కమిషన్‌ను, అప్పటి పాకిస్తాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ను సంప్రదించాడు.
ఈ మూవీలో కైనాజ్‌ అక్తర్‌ పాత్రను దియా మీర్జా ఎంతో అద్భుతంగా పోషించింది. హైదరాబాద్‌ కు చెందిన ఈమే అసలు పేరు దియా హ్యాండ్రిచ్‌. ఈమె నిజ జీవితంలో చాలా ధైర్యం కలిగిన మహిళ. మీటూ గురించి చర్చను లేవదీసి, సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఒక ఆలోచన రావడానికి కారణభూతురాలు. అంతే కాకుండా పర్యావరణ పరిరక్షణలో మనం ఎలా చురుకుగా సహకరించుకోవచ్చునో సలహాలు కూడా ఇచ్చింది.
డిజిటల్‌ రంగంలో ఈ చిత్రం దియా మీర్జాకు తొలి చిత్రం. తీవ్రమైన బాధాకరమైన ఒత్తిడితో సతమతమయ్యే ఒక స్త్రీ భావోద్వేగ సన్నివేశాలలో ఎంతో గొప్పగా నటించింది దియా.
వేదాంత్‌ రాథోడ్‌ పాత్రలో మోహిత్‌ రైనా తన పరిధుల మేరకు విజయవంతంగా నటించాడు. ఎన్నో సన్నివేశాల్లో పరిణతి మించిన హుందాతనపు నటనను ప్రదర్శించాడు. ఈ సినిమా చిత్రీకరణ హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగింది. లొకేషన్‌ అందాలకు తన కెమెరా ద్వారా ఆహ్లాదకర భాష్యం చెప్పాడు ఫొటోగ్రాఫర్‌.
ఇది ఒక విధంగా లేడీ ఓరియెంటెడ్‌ స్టోరీ అయినా, హీరో పాత్ర ఔన్నత్యానికి తక్కువ లేదు. లోపాలు అంతగా లేని ‘కాఫిర్‌’ మూవీ చూడదగ్గ చిత్రాల్లో ఒకటి.
– పంతంగి శ్రీనివాస రావు,
9182203351

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -