Sunday, July 6, 2025
E-PAPER
Homeప్రత్యేకంభూసార పరీక్ష- రైతు భవిష్యత్తుకు రక్ష

భూసార పరీక్ష- రైతు భవిష్యత్తుకు రక్ష

- Advertisement -

రైతు జీవితం భూమిపై ఆధారపడి వుంటుంది. భూమి ఆరోగ్యంగా వుంటేనే రైతు ఆనందంగా వుంటాడు. భూమిలో జీవం ఉంటేనే పంటకు ప్రాణం ఉంటుంది. పంట బాగుంటేనే రైతు బాగుంటాడు, దేశానికి అన్నం దొరుకుతుంది. కానీ దురదష్టకరం ఏమిటంటే, రైతుకు మట్టిలో శక్తి మిగిలి ఉందో లేదో తనకు తెలియక వ్యవసాయాన్ని కష్టంగా కొనసాగిస్తున్నాడు.
పలువురు రైతులు అధిక దిగుబడి కోసం అధికంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. పంటలు కోతకాకముందే భూమి అస్థిత్వాన్ని కోల్పోతోంది. శతాబ్దాలనాటి శక్తివంతమైన నేలలు నేడు చౌడు భూములుగా మారిపోతున్నాయి. ఇది కేవలం పంటల దిగుబడిపై ప్రభావం చూపడం కాదు, భవిష్యత్తు తరాలకు భూమిని ఉపయోగించలేనంతగా మారుతున్నాయి. మానవ ఆరోగ్యానికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. ఇలాంటి స్థితిలో శాస్త్రీయంగా తీసుకోవాల్సిన తొలి మెట్టు – భూసార పరీక్ష.
భూమికి పరీక్ష అవసరం
మనిషి అనారోగ్యంగా ఉన్నప్పుడు వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకుంటారు. అలానే భూమికి ఆరోగ్య సంబంధ సమస్యలు ఉన్నప్పటికీ రైతులు దానిని గుర్తించలేక సాగు కొనసాగిస్తున్నారు. భూమిలో ఏ పోషకాలు తక్కువ? ఏవి ఎక్కువ? నేల పీహెచ్‌ స్థాయి ఎంత? చౌడు శాతం ఎంత? వంటి విషయాలు తెలుసుకోవాలంటే భూసార పరీక్షే మార్గం.
ఈ పరీక్షలో భూమి ఆరోగ్య స్థితి తెలుసుకోవడమే కాక మట్టిలోని నత్రజని ఫాస్పరస్‌, పొటాష్‌ వంటి ప్రధాన పోషకాలు, ఇతర సూక్ష్మ పోషకాలు, సున్నం శాతం, మట్టిలో జీవకణాల స్థితి వంటి అంశాలు తేలుతాయి. దీని ఆధారంగా సరైన ఎరువులు, వాటి మోతాదులు రైతుకు తెలుస్తాయి. దీని ఫలితంగా వ్యయం తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది, భూమి ఆరోగ్యంగా మారుతుంది, పంటల నాణ్యత మెరుగవుతుంది. భవిష్యత్‌ కోసం భూమి సంసిద్ధంగా వుంటుంది.
మట్టి నమూనా సేకరణలో సూచనలు:
పొలంలో ఎరువులు వేసిన తర్వాత నెల రోజుల వరకు మట్టి సేకరించవద్దు. పంటకు నీరు పెట్టిన తర్వాత, నీడపడే ప్రదేశాలు, ఎరువుల కుప్పలున్న చోట, గట్లు, చెట్ల వద్ద మట్టి నమూనాలు తీయవద్దు.
ఖరీఫ్‌ సీజన్‌లో పంట సాగు చేయక ముందు భూసార పరీక్షలకు మట్టి నమూనాలు సేకరించాలి.
పొలంలో ‘వీ’ ఆకారంలో 15-20 సెంటీమీటర్ల లోతున పారతో గుంత తీసి అందులో పై పొర నుంచి కింద వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి.
పొలంలో మొత్తంగా 8-10 చోట్ల సేకరించిన మట్టిని ఒక చోట చేర్చి బాగా కలిపి నాలుగు భాగాలు చేయాలి. అందులో ఎదుటి భాగాలను మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా మట్టి అరకిలో వచ్చే వరకు చేస్తూ ఉండాలి.
ఇలా సేకరించిన మట్టిలో రాళ్లు, గడ్డివేర్లను వేరు చేసి నీడలో అరబెట్టాలి.
మట్టి బాగా ఆరిన తర్వాత ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో గానీ పాలిథిన్‌ కవర్‌లో గానీ నింపి రైతు వివరాలు రాసి భూసార పరీక్ష కేంద్రాలకు పంపాలి.
మట్టి సేకరణకు స్థానిక భూసార కేంద్రం సిబ్బంది సాయం తీసుకుంటే వారు రైతు పొలం వద్ద మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్ష కేంద్రాలకు పంపుతారు
పండ్ల తోటల కోసం మట్టి నమూనా :
1-2 మీటర్ల లోతు వరకు గుంట త్రవ్వి ప్రతి అడుగుకు నమూనా విడిగా సేకరించాలి.
ఎక్కడైనా గట్టి పొరలు ఉంటే, వాటి లక్షణాలను వేరుగా పేర్కొనాలి.
పండ్ల తోట భూసార పరీక్ష అని స్పష్టంగా నమూనాపై రాయాలి.
మట్టి నమూనాతో పంపవలసిన సమాచారం :
– రైతు పేరు, గ్రామం, సర్వే నంబర్‌, మండలం
-ప్రస్తుతం సాగు చేసిన పంట, వాడిన ఎరువులు
– తదుపరి వేసే పంట వివరాలు
నేలలో గమనించిన సమస్యలు
నీటి లభ్యత/ ఎలుక్ట్రికల్‌ కనెక్టివిటీ
తనిఖీ కావాల్సిన పరీక్షలు: (సాధారణ/ చౌడు/ పండ్ల తోట)
ఈ మట్టిను సమీపంలోని వ్యవసాయ శాఖ భూసార పరీక్షా కేంద్రంకు పంపాలి. వాటితో పాటు కొన్ని ప్రభుత్వం ఆమోదం పొందిన ప్రైవేట్‌ ల్యాబ్‌లలో, కషి విజ్ఞాన కేంద్రాలలో, వ్యవసాయ విశ్వవిద్యాలలో కూడా భూసార పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి
రైతు విజయం భూసారంతో మొదలవుతుంది!
పంటలో పోషకాలు పెంచాలంటే, భూమిలో పోషకాలను గుర్తించాలి. మట్టిని అర్థం చేసుకున్న రైతు కష్టాన్ని విజయంగా మార్చగలడు!
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు :
కేంద్ర ప్రభుత్వం 2015లో ‘సాయిల్‌ హెల్త్‌ కార్డ్‌’ పథకం ప్రారంభించింది. లక్షలాదిమంది రైతులకు మట్టిలోని పోషక స్థాయిలను తెలిపే హెల్త్‌ కార్డులను అందించింది. కానీ పథకం ప్రారంభించి నేటికి దాని ప్రభావం ఆశించినంతగా కనిపించకపోవడానికి కారణం అవగాహన లోపం, వ్యవస్థాపక బలహీనత, భూసార పరీక్షా కేంద్రాల సరిగా పని చేయకపోవడం.
రాష్టప్రభుత్వాలు కూడా భూసార పరీక్షలపై క్షేత్ర స్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాయి. ఇవి ఎంత వరకు సత్ఫలితాలను కల్పిస్తాయో చూడాలి.
భూమిని పరీక్షించండి, భవిష్యత్‌ను రక్షించండి:
ఈ రోజుల్లో వ్యవసాయం ఒక సవాలుగా మారింది. మారుతున్న వాతావరణం, సాగు ఖర్చులు, మార్కెట్‌ అస్థిరతల మధ్య రైతుకు ముందుకు వెళ్లాలంటే భూమిని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం భూసార పరీక్షలతో మొదలవుతుంది. మట్టి మాట వినండి. దాన్ని పరీక్షించండి. దానికి అద్భుత ఫలితాలిచ్చే శక్తి ఇవ్వండి.
ఎప్పుడు చేయించాలి :
రైతులు భూసార పరీక్షలను వర్షాధార భూములలో అయితే 3 సంవత్సరాల కోసారి, నీటి వసతి ఉన్న భూములలో అయితే 3 పంటలకొక సారి చేయించుకోవడం మంచిది.
ఖరీఫ్‌, రబీ సీజన్‌ ప్రారంభానికి ముందు, అలాగే ఏదైనా భూమిని మొదటి సారి సాగు చేసే ముందు భూసార పరీక్షలు చేయించుకోవడం తప్పని సరి.
మట్టికి పరీక్ష – భవిష్యత్తుకు పునాదులు :
భూమి బాగుంటే రైతు బాగుంటాడు. రైతు బాగుంటే దేశం బాగుపడుతుంది. భూమి బాగుండాలంటే భూసార పరీక్ష తప్పనిసరి
జి. అజయ్‌ కుమార్‌,
వ్యవసాయ నిపుణులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -