విజయపురిని విక్రముడు పాలించేవాడు. అతని మంత్రి రామశర్మ. ఒక రోజు పశువుల కాపరి గోపయ్య కోటలోని ఆవులను తోలుకుపోయి పచ్చిక మైదానంలో వదిలాడు. ఆవులు గడ్డి మేయసాగాయి. గోపయ్య, పశువులను మేపడానికి వచ్చిన మిత్రులతో ముచ్చట్లు పెట్టాడు. రెండు గంటల తరువాత ఆవులను తోలుకుని కోటకు వెళుతూ లెక్క చూశాడు. అందులో సీత అనే ఆవు కనిపించలేదు. ఆవులను కోటలోని పశువులశాలకు తీసుకెళ్లి వాటిని కట్టేసి పశువుల అధికారికి సీత తప్పిపోయిన విషయం చెప్పాడు.
”అమ్మో! సీత కనిపించ లేదా?..ఆ ఆవు అంటే యువరాణి గారికి ప్రాణం. అది దొరకకుంటే నీకు శిక్ష తప్పదు” అన్నాడు అధికారి.
”అయ్య గారూ! నేను మైదానం చుట్టు పక్కలకు వెళ్ళి ఆవును వెదికి తెస్తాను” అని చెప్పి గొప్పయ్య వెళ్లబోయాడు.
”కాసేపు ఆగు” అని అధికారి, మంత్రికి విషయం చెప్పాడు. మంత్రి కొంతమంది భటులను తీసుకెళ్లి చుట్టు పక్కల గ్రామాలలో వెతకమని గోపయ్యకు చెప్పాడు.
ఆ ఆవు పార్వతీపురంలోని రామయ్య ఇంటి బయట పశువుల కొట్టంలో కట్టేసి ఉంది.
”ఇది కోటలోని ఆవు. పచ్చిక మైదానంలో నుండి తప్పిపోయింది.. నీవద్దకు ఎలా వచ్చింది? మేం ఈ అవును కోటకు తోలుకెళుతున్నాం. నువ్వు మా వెనకాలే రా” అని రామయ్యతో అన్నాడు గోపయ్య.
”అయ్యల్లారా!..ఇది నా ఆవు” అన్నాడు రామయ్య.
”ఆ విషయం రాజు గారికి చెబుతువు గానీ పద” అన్నారు భటులు. చేసేది లేక రామయ్య వారి వెనకాలే బయలుదేరాడు.
రాజు కొలువుతీరి ఉన్నాడు. భటులతో, రామయ్య, రాజు గారి ముందర నిలబడ్డాడు. గోపయ్య సీతను పశువుల అధికారికి అప్పగించి సభకు వచ్చాడు. రాజుకు ఆవు గురించి చెప్పాడు మంత్రి. తప్పిపోయిన ఆవు రామయ్య వద్ద దొరికిన విషయం చెప్పాడు గోపయ్య.
”ఏం రామయ్యా! మా ఆవును నీ పశువుల పాకలో ఎలా కట్టేశావు?” అన్నాడు రాజు కాస్త కోపంగా.
”మహారాజా! ఆ ఆవు నాది. పార్వతి అని పేరు పెట్టుకున్నాను.. కొన్ని నెలల క్రితం తప్పిపోయింది. నిన్నటి దినం నేను ఎద్దుల బండిలో కోటకు అటు వైపు ఉన్న పచ్చిక మైదానం నుండీ వెళుతుండగా నన్ను చూసి పరుగున నా ఎద్దుల బండి వెంట వచ్చింది.. నా వద్ద ఉన్న ఆవులన్నిటికీ కుడి చెవులకు వెనకాల చంద్రుడి ముద్ర ఉంటుంది గమనించగలరు” అన్నాడు రామయ్య.
”ఆవు నీ వద్దకు వచ్చాక ముద్ర వేసి ఉండవచ్చు కదా? అన్నాడు రాజు. ”మహారాజా! మీ పశువులశాలకు వెళదాం, నా వెంట రండి.. నేను పేరు పెట్టి పిలవగానే వస్తే ఆ ఆవు నాది, లేకపోతే మీరు నాకు ఎలాంటి శిక్ష వేసిన దానికి నేను సిద్ధం!” అన్నాడు రామయ్య.
అందుకు రాజు ఒప్పుకున్నాడు. రాజు, మంత్రి, గోపయ్యలతో రామయ్య పశువులశాలకు వెళ్లాడు. ”పార్వతీ” అని రామయ్య పిలవగానే ఆ ఆవు రామయ్య వద్దకు వచ్చి నాలుకతో రామయ్య చేతులను నాకసాగింది.
”మహారాజా! ఎవరో దొంగ ఈ ఆవును దొంగిలించి మనకు అమ్మి ఉంటాడు” అన్నాడు మంత్రి. ”రామయ్యా! నువ్వు చెప్పింది నమ్ముతున్నాను ఈ ఆవు నీదే.. కానీ ఈ ఆవు అంటే యువరాణికి ఎంతో ప్రాణం సీత అని ముద్దుగా పేరు పెట్టుకుంది..నీకు పది బంగారు నాణేలు ఇస్తాను.. ఈ అవును మాకు ఇవ్వు” అన్నాడు రాజు.
”మహారాజా! మీరు ప్రజలను కన్నబిడ్డలుగా పాలిస్తున్నారు.. ఎంతో మందికి కానుకలు కూడా ఇస్తున్నారు.. సామాన్యుడినైన నేను కూడా యువరాణి గారికి ఈ అవును కానుకగా ఇస్తున్నాను” అన్నాడు రామయ్య.
”చాలా సంతోషం రామయ్యా” అన్నాడు రాజు.
”పార్వతీ నేను అప్పుడప్పుడూ వచ్చి నిన్ను చూసి వెళుతుంటాను” అని తల నిమిరాడు. పార్వతి అలాగే అన్నట్టు తలను ఆడిచింది. మెడలోని గంటలు గలగలమని మ్రోగాయి. రాజుకు చెప్పి రామయ్య వెళ్లిపోయాడు.
కొన్ని రోజులకు ఆ అవును అమ్మిన దొంగ దొరికాడు. అతనికి చెరసాలలో కొంత కాలం శిక్ష పడింది. ఇంకెప్పుడూ పశువులను కానీ ఎలాంటి దొంగతనాలు కానీ చేయనని రాజుగారితో చెప్పాడు. రాజు అతణ్ణి వదిలేశాడు. రామయ్య చెప్పినట్టుగానే వారానికొకసారి వచ్చి పార్వతిని చూసి వెళ్ళేవాడు.
– యు.విజయశేఖర రెడ్డి, 9959736475