Sunday, July 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుశ్రమదోపిడీకి సర్కారు గ్రీన్‌సిగల్‌

శ్రమదోపిడీకి సర్కారు గ్రీన్‌సిగల్‌

- Advertisement -

మొన్న గుజరాత్‌… నేడు తెలంగాణ
దొడ్డితోవన మోడీ సర్కార్‌ లేబర్‌కోడ్‌ల అమలు
రోజుకు 10 గంటలు పనిచేయాలని ఉత్తర్వులు
ఆందోళనలకు సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు

శ్రమశక్తిని దోచి, కార్పొరేట్లకు అధికలాభాలు కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో మోడీ సర్కార్‌ నాలుగు లేబర్‌ కోడ్‌లను తెస్తున్న విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈనెల 9వ తేదీ యావత్‌ కార్మికలోకం సార్వత్రిక సమ్మెలోకి వెళ్తుంది. పుండుమీద కారం చల్లినట్టు కార్మికవర్గాన్ని మరింత రెచ్చగొడుతూ గుజరాత్‌లో కార్మికులు పదిగంటలు పనిచేయాలని అక్కడి బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అచ్చం దాన్నే కాపీ కొట్టి కర్నాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పదిగంటల పనిని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రెండు రాష్ట్రాల బాటలోనే నడుస్తూ కార్మికులకు 10 గంటల పనిని చట్టబద్ధం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీలు వేరైనా, బూర్జువా పాలకవర్గ నేతల ఆలోచనలు ఒక్కటేనని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదేమో? ప్రపంచకార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని, ‘మే’డే స్ఫూర్తి, మానవత్వ విలువల్ని ప్రభుత్వాలు మంటగలుపుతున్నాయి.
నవతెలంగాణ బ్యూరో-హైదరబాద్‌
కష్టజీవుల చెమట చుక్కల్ని కరెన్సీగా మార్చుకోవడానికి కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ విషయంలో మోడీ సర్కార్‌ బాటలోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా నడుస్తుంది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే చాలు అంటూ ప్రపంచదేశాల్లో పర్యటనలు చేసి వస్తున్న ప్రభుత్వాధినేతలు, కార్పొరేట్ల కోసం కార్మికుల శ్రమను పణంగా పెడుతున్నారు. ఇప్పటికే చదివిన చదువుకు, చేస్తున్న పనికి సంబంధం లేకుండా యువతరం కార్ఖానాల్లో మగ్గుతోంది. మోడీ సర్కార్‌ నాలుగు లేబర్‌కోడ్‌లు అమల్లోకి వస్తే దేశంలో కార్మికులకు కనీస భద్రత, కనీస వేతనాలు, సెలవులు వంటి అనేక అంశాలను కోల్పోవాల్సి వస్తుందని జాతీయ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకోవడాన్ని ఆ సంఘాలన్నీ తప్పుపడుతున్నాయి. శ్రమదోపిడీకి ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌’ అంటూ పాలకులు ముద్దుపేరు పెట్టుకున్న విషయం తెలిసిందే.


అప్పట్లో అదేం లేదన్న కార్మిక మంత్రి
రాష్ట్రంలో పదిగంటల పనివిధానాన్ని అమల్లోకి తెస్తారా అని కార్మికశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామిని ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో ‘నవతెలంగాణ’ ప్రతినిధి ప్రశ్న అడిగారు. అలాంటిదేం లేదంటూ ఆయన కొట్టిపారేశారు. వారం తిరక్కుండా పదిగంటల పనివిధానంపై ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జులై 9న జరిగే సమ్మెలో కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ కూడా పాల్గొంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు.


ఇప్పటి వరకు…
ప్రస్తుత కార్మిక చట్టాల ప్రకారం ఒక కార్మికుడు రోజులో 8 గంటలు మాత్రమే పనిచేయాలి. వారానికి 48 గంటలకు మించకూడదు. అయితే ఈ 8 గంటల పనిని కూడా తగ్గించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రతిపాదన చేసింది. 8 గంటల పనివల్ల కార్మికులు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారనీ, అందువల్ల పనిగంటలు తగ్గించాలని సూచించింది.


ఉపాధికీ దెబ్బే
ఇప్పటి వరకు 24 గంటలు పనిచేసే సంస్థల్లో మూడు షిప్టుల పనివిధానం అమల్లో ఉంది.ఇప్పుడు కంపెనీలు ఆ విధానానికి స్వస్తి చెప్పి, అవే వేతనాలతో రెండు షిఫ్టుల్లో పనిచేయించుకుంటాయి. ఓవర్‌టైం లెక్కించి ఇస్తున్న కంపెనీలు వేళ్లమీద లెక్కపెట్టగలిగినవే ఉన్నాయి. ఈ విధానం వల్ల పరిశ్రమల్లో ఒక షిఫ్ట్‌ కార్మికులకు పనిలేకుండా పోతుంది. ఫలితంగా ఆయా కుటుంబాలు వీధిన పడతాయి. దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది. ఇప్పటికే ముగ్గురు చేయాల్సినపనిని ఇద్దరితోనే చేయించుకుంటూ పరిశ్రమలు ఒకరి జీతాలు మిగుల్చుకుంటున్నాయి. ఇలాంటి వాటిపై కార్మిక శాఖ మొద్దునిద్ర పోతున్నది.


కార్పొరేట్ల మాటల్లో…
ఇన్ఫోసిస్‌ సంస్థ అధినేత నారాయణమూర్తి, ఎల్‌అండ్‌ టీ చైర్మెన్‌ సుబ్రహ్మణ్యం లాంటి వారు వారానికి 70 నుంచి 90 గంటల పని దినం ఉండేలా కార్మికుల చట్టాలు మార్పులు చేయాలని బాహాటంగానే మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చే జరిగింది. పనిగంటలు పెరిగితే కార్మికుల్లో సృజనాత్మకత పోతుందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయినా పాలకులు పనిగంటలు పెంచేందుకే మొగ్గుచూపారు.


అత్యంత ప్రమాదం : పాలడుగు భాస్కర్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పది గంటల పనివిధానం అంటే కార్మికుల శ్రమను మరింత దోచుకోవడమే. మోడీ బాటలోనే రేవంత్‌రెడ్డి సర్కారు నడుస్తున్నది. లేబర్‌ కోడ్‌లు వద్దని పోరాటాలు చేస్తుంటే కార్మిక చట్టాలను సవరిస్తూ, సరళీకరిస్తున్నారు. కేవలం కార్పొరేట్లకు మరిన్ని లాభాలు తెచ్చిపెట్టడం కోసమే ఈ తాపత్రయం. దీనివల్ల కార్మికులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం బేషరతు మద్దతు ప్రకటించాలి.


కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో పదిగంటల పనివిధానానికి ఇటీవల జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రాష్ట్ర కార్మిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పనివేళల పరిమితిని 8 గంటల నుంచి 10 గంటలకు పెంచుతున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారంలో 48 గంటల పని దాటితే ఓవర్‌ టైం (ఓటీ) వేతనం చెల్లించాలని తెలిపారు. కార్మికులు ఆరు గంటలు పనిచేశాక కనీసం ఓ అరగంట విశ్రాంతి ఇవ్వాలనీ, విశ్రాంతితో కలిపి 12 గంటల కంటే ఎక్కువసేపు పని చేయించరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా పనివేళలు సవరించామని కార్మిక శాఖ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -