Monday, July 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంత్వరలో కొత్త స్టాంప్‌ విధానం

త్వరలో కొత్త స్టాంప్‌ విధానం

- Advertisement -

– ముసాయిదా రూపకల్పనకు కసరత్తు
– వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లు
– మహిళలకు స్టాంప్‌ డ్యూటీ తగ్గించే ఆలోచన
– ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం : రెవెన్యూ, శాఖమంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణలో కొత్త స్టాంప్‌ విధానం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో స్టాంప్‌ డ్యూటీ సవరణ బిల్లుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ సాధారణ ప్రజలకు నష్టం కలగకుండా వ్యాపార ఒప్పందాలపై పారదర్శకత ఉండేలా భారతీయ స్టాంపు చట్టం 1899ని అనుసరించి తెలంగాణ సవరణ బిల్లు-2025ను తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ”తెలంగాణ పరిధిలోని నాలుగు సెక్షన్లతో పాటు ఆర్టికల్‌ 26ను సవరించేందుకు 2021లో శాసనసభలో సవరణ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపడం జరిగింది. ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చినప్పటికీ 2023 జనవరిలో మరిన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపించడం జరిగింది” అని ఈ సందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 2021లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లును ఉపసంహరించుకుని ప్రస్తుత కాలానికి అనుగుణంగా 2025 సవరణ బిల్లును తీసుకురావాలని పొంగులేటి అధికారులకు సూచించారు. పాత చట్టంలో లేనివాటిని కొత్త చట్టం పరిధిలోకి తీసుకొచ్చేలా ముసాయిదాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ”విమర్శలకు తావులేకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరల సవరణ జరగాలి. ఏఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది. అక్కడ హేతబద్దంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది. తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేయాలి” అని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళాభ్యుదయం కోసం ఎన్నో చర్యలు చేపడుతోందనీ, అందులో భాగంగా మహిళలకు స్టాంప్‌ డ్యూటీ తగ్గించాలన్న ఆలోచన చేస్తోందని చెప్పారు. అలాగే కొత్త, పాత అపార్ట్‌మెంట్లకు స్టాంప్‌ డ్యూటీ ఒకే విధంగా ఉందనీ, పాత అపార్ట్‌మెంట్లకు రిజిస్ట్రేషన్‌ తేదీలను పరిగణనలోకి తీసుకొని స్టాంప్‌ డ్యూటీ తగ్గించాలన్న ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. సీఎంతో చర్చించి వీటిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్‌. లోకేష్‌కుమార్‌, న్యాయ వ్యవహారాల కార్యదర్శి రెండ్ల తిరుపతి, స్టాంప్స్‌ రిజిస్ట్రేషన్‌ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌ గాంధీ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -