– ఆనాడు సంతకాలు పెట్టింది ఆపార్టీ నేతలే
– ఇప్పుడు మాపై నిందలా? : టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బనకచర్ల ప్రాజెక్టు పాపం బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి ఆరోపించారు. ఆనాడు సంతకాలు పెట్టిన నాయకులే ఇప్పుడు తమ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రజలను తిట్టిన బీఆర్‌ఎస్ నేతలు…అధికారంలోకి వచ్చాక వారి కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తామన్న సంగతి మర్చిపోవద్దని గుర్తు చేశారు. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాగానే బీఆర్‌ఎస్ ఫ్లేట్ ఫిరాయించిందని తెలిపారు. తెలంగాణ నీటి వాటాను తరలించుకుపోయిన నీటి దొంగలను కేసీఆర్ తన నివాసానికి పిలిచి ఎందుకు భోజనం పెట్టారని ప్రశ్నించారు. ఆయనకు ఇక్కడ కోడి పులుసు తినిపిస్తే…ఈయనకు అక్కడ చేపల పులుసు తినిపించారని ఎద్దేవా చేశారు. ఆనాడు బీఆర్‌ఎస్ వ్యవహరించిన తీరును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పుపడుతూ మాట్లాడారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చకు రమ్మంటే, కేటీఆర్ మాత్రం ప్రెస్‌క్లబ్ రమ్మంటున్నారని విమర్శించారు.కొన్ని రోజులైతే కల్లు దుకాణం వద్ద చర్చకు రమ్మంటారేమోనని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సెకండ్ బెంచ్ నాయకులనీ, అటువంటి వారు కేసీఆర్, రేవంత్‌రెడ్డి మధ్యలో ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ రేవంత్ రెడ్డి బొట్టుపెట్టి పిలుస్తుంటే, ఎందుకు రావడం లేదని ఆయన నిలదీశారు.
బనకచర్ల పాపం బీఆర్‌ఎస్‌దే…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES