Sunday, July 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవీఆర్వో, వీఆర్‌ఏలకు మరోసారి జీపీవో పరీక్ష

వీఆర్వో, వీఆర్‌ఏలకు మరోసారి జీపీవో పరీక్ష

- Advertisement -

– రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (వీఆర్వో), విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ (వీఆర్‌ఏ)లకు జీపీవో(గ్రామపరిపాలన అధికారి)గా అవకాశం కల్పించేందుకు మరోసారి అర్హత పరీక్ష నిర్వహించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వీఆర్‌ఏ, వీఆర్‌వోలకు ఇచ్చిన హామీల అమలు తీరుపై శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి లోకేష్‌ కుమార్‌తో కలిసి రెవెన్యూ సంఘాలతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు పాత రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ”భూ భారతి ఫలితాలు ప్రతి పేదవాడికి చేరేలా చట్టం అమలుకు క్షేత్రస్థాయిలో పని చేయండి. పదవులు శాశ్వతం కాదు. తీసుకున్న సంస్కరణలు విధానపరమైన నిర్ణయాలు పదిమందికి మేలు జరిగేలా ఉండాలి” అని పొంగులేటి అన్నారు. ఆ క్రమంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు నిబద్ధతతో పని చేసి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె. రాములు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. రామ్‌రెడ్డి,వి. భిక్షం తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ జేఏసీ హర్షం
వీఆర్‌ఏ, వీఆర్వోలకు జీపీవోలుగా అవకాశం కల్పించేందుకు మరోసారి అర్హత పరీక్ష నిర్వహించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడం పట్ల తెలంగాణ ఉద్యోగ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మెన్‌ వి.లచ్చిరెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రితో జరిగిన రెవెన్యూ ఉద్యోగ సంఘాల సమావేశంలో క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించినట్టు తెలిపారు. జీపీవోలకు ప్రతి రెవెన్యూ గ్రామంలో కార్యాలయ స్థలం కేటాయింపు, జూనియర్‌ అసిస్టెంట్ల నుంచి నాయబ్‌ తహసీల్దార్‌ వరకు అన్ని స్థాయిల ఉద్యోగుల జాబ్‌ చార్ట్‌ రూపొందించాలని కోరినట్టు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -